Telugu Global
NEWS

కరోనా నిబంధనల్లో బీజీపీ డబుల్ గేమ్..

కరోనా తొలి దశలో.. లాక్ డౌన్, అన్ లాక్.. అన్నింటినీ కేంద్రం తన అధీనంలోకి తీసుకుంది. విడతల వారీగా మార్గదర్శకాలను విడుదల చేసి అన్ని రాష్ట్రాలు పాటించేలా ఆదేశాలిచ్చింది. సెకండ్ ఫేజ్ వచ్చే సరికి పూర్తిగా చేతులెత్తేసింది. తప్పు తనపై లేకుండా తప్పుకుంది. కేరళ లాంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుంటే మాత్రం పండగలకు గేట్లెత్తేశారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపింది. సీఎం పినరయి విజయన్ ని నేరుగా బీజేపీ నేతలు టార్గెట్ చేశారు. బక్రీద్, ఓనమ్ పండగలకు […]

కరోనా నిబంధనల్లో బీజీపీ డబుల్ గేమ్..
X

కరోనా తొలి దశలో.. లాక్ డౌన్, అన్ లాక్.. అన్నింటినీ కేంద్రం తన అధీనంలోకి తీసుకుంది. విడతల వారీగా మార్గదర్శకాలను విడుదల చేసి అన్ని రాష్ట్రాలు పాటించేలా ఆదేశాలిచ్చింది. సెకండ్ ఫేజ్ వచ్చే సరికి పూర్తిగా చేతులెత్తేసింది. తప్పు తనపై లేకుండా తప్పుకుంది. కేరళ లాంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుంటే మాత్రం పండగలకు గేట్లెత్తేశారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపింది. సీఎం పినరయి విజయన్ ని నేరుగా బీజేపీ నేతలు టార్గెట్ చేశారు. బక్రీద్, ఓనమ్ పండగలకు వెసులుబాట్లు ఎందుకిచ్చారంటూ నిలదీశారు. అదే బీజేపీ.. ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడాన్ని మాత్రం తప్పుబడుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ సీఎం జగన్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. హిందువుల పండగలకు వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు మొదలు పెట్టారు.

ప్రాణాలుంటేనే ఏ పండగలయినా జరుపుకోడానికి ప్రజలు మిగిలుంటారు. పండగల పేరుతో అన్నిటికీ, అందరికీ పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే.. కరోనా ఎలా కబళిస్తుందో చెప్పడానికి కేరళే పెద్ద ఉదాహరణ. బక్రీద్, ఓనమ్ పండగలకి ఇచ్చిన వెసులుబాట్ల వల్ల.. ఏకంగా దేశంలో 70శాతం కరోనా కేసులు కేరళ ఖాతాలో పడ్డాయి. పక్క రాష్ట్రాల అనుభవాలతోనే.. వినాయక చవితి విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది వైసీపీ నేతలంటున్నారు. కేవలం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయడం, పూజలు, ఊరేగింపులపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో ఇళ్లలో ఎవరికి వారు వినాయక పూజలు చేసుకోడానికి అనుమతిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

బీజేపీ నేతల దృష్టిలో పండగలకు అనుమతులిచ్చిన కేరళ చేసింది పాపం అయితే.. ఏపీ సర్కారు చేస్తున్నదాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. అక్కడ కేరళను విమర్శించిన నేతలు ఇక్కడ ఏపీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించలేరా..? అని అడుగుతున్నారు. కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే బీజేపీ ఇలాంటి డ్రామాలాడుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

First Published:  5 Sept 2021 9:15 PM GMT
Next Story