Telugu Global
NEWS

డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై లబ్ధిదారుల దండయాత్ర..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే నిరుపేద‌లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నది అప్పట్లో కేసీఆర్ చేసిన వాగ్దానం. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినా అది ఇంకా వాగ్దానంగానే మిగిలిపోయింది. పోనీ ఇళ్లు కట్టలేదా అంటే సమస్య అది కాదు. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయి మూడేళ్లవుతోంది. కానీ లబ్ధిదారులకు అందించే విషయంలో మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో జగిత్యాల జిల్లా మల్యాలలో లబ్ధిదారులు తిరుగుబాటు చేశారు. తమ ఇళ్లను తాము […]

డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై లబ్ధిదారుల దండయాత్ర..
X

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే నిరుపేద‌లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నది అప్పట్లో కేసీఆర్ చేసిన వాగ్దానం. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినా అది ఇంకా వాగ్దానంగానే మిగిలిపోయింది. పోనీ ఇళ్లు కట్టలేదా అంటే సమస్య అది కాదు. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయి మూడేళ్లవుతోంది. కానీ లబ్ధిదారులకు అందించే విషయంలో మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో జగిత్యాల జిల్లా మల్యాలలో లబ్ధిదారులు తిరుగుబాటు చేశారు. తమ ఇళ్లను తాము ఆక్రమించుకున్నారు. ప్రభుత్వం తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించిన ధృవపత్రాలున్నా.. తామింకా పూరి గుడిసెల్లో ఎందుకుండాలంటూ వారు అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో కలకలం రేగింది. అనధికారికంగా అపార్ట్ మెంట్లలో ప్రవేశించే వీలు లేదంటూ రెవెన్యూ అధికారులు వారిని బయటకు పంపిస్తున్నారు.

తెలంగాణలో తొలి విడత‌లో 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఎక్కడ ఏ పరామర్శకు వెళ్లినా బాధితులకు ఆర్థిక సాయంతోపాటు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అనే హామీ తెలంగాణలో సర్వసాధారణంగా మారింది. ప్రచార సమయాల్లో నాయకుల నోటి వెంట వచ్చే తొలి మాట కూడా ఇదే అవుతోంది. ఈ క్రమంలో ఇంతవరకు కేవలం లక్ష ఇళ్లు మాత్రమే పూర్తి చేశారనేది ప్రతిపక్షాల వాదన, అయితే వాటిని కూడా ఇంకా లబ్ధిదారులకు ఇవ్వకుండా వేధిస్తున్నారనే అపవాదు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై ఉంది.

నిజామాబాద్ లాంటి చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. చాలా చోట్ల దొంగలు కరెంటు వైర్లు కత్తిరించుకు వెళ్లారు, ఇతర ఎలక్ట్రిక్‌ సామాన్లను మాయం చేశారు. అయినా కూడా ప్రభుత్వం ఇంకా లబ్ధిదారుల గృహప్రవేశాలకు ఎందుకో అడ్డు చెబుతూ వస్తోంది. ప్రతి కార్యక్రమానికీ ఏదో ఒక రాజకీయ లబ్ధిని ఆశించడం, ఉప ఎన్నికను ముడి పెట్టడం టీఆర్ఎస్ కి అలవాటైందనేది ప్రతిపక్షాల వాదన. ఈ క్రమంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుకి కూడా ఏదో ఒక ముహూర్తం ఎంచుకుని ఉంటారని ఎద్దేవా చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈలోగా జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పూరి గుడిసెల్లో ఉంటూ, పాములు, తేళ్ల మధ్య ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నామంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తయిన ఇళ్లలోకి కూడా తమని పోనీయకుండా అడ్డుకోవడం దారుణమని అంటున్నారు. ఈ ఘటనతో తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. గృహప్రవేశాలకయినా అనుమతివ్వాలి, లేదా పూర్తయిన ఇళ్లను మూడేళ్లుగా ఎందుకు కేటాయించలేదో సరైన కారణం అయినా చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యవహారంతో కేసీఆర్ ఇరుకున పడినట్టేనని చెప్పాలి.

First Published:  3 Sep 2021 9:14 PM GMT
Next Story