Telugu Global
National

సార్, మేడమ్ అనొద్దు.. అన్నా, అక్కా అనండి చాలు..

సహజంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే.. చెప్పులు బయట విడిచి, వినయంగా చేతులు కట్టుకుని లోపలికి వెళ్తుంటారు ప్రజలు. పట్టణాల్లో పరిస్థితి మరీ ఇంతలా ఉండదు కానీ, పల్లెటూళ్లలో మాత్రం గ్రామస్తులు అధికారులంటే హడలిపోతుంటారు. ఆ మర్యాదలు చూసి అధికారులు కూడా లేనిపోని దర్పం ప్రదర్శించడం కూడా చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవాంతరాలను తగ్గించేందుకు కేరళలోని పంచాయతీ అధికారులు ఓ సరికొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఇకపై పంచాయతీ కార్యాలయాల్లోకి వచ్చే ప్రజలు, అధికారుల్ని కానీ, సిబ్బందిని కానీ సార్, […]

సార్, మేడమ్ అనొద్దు.. అన్నా, అక్కా అనండి చాలు..
X

సహజంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే.. చెప్పులు బయట విడిచి, వినయంగా చేతులు కట్టుకుని లోపలికి వెళ్తుంటారు ప్రజలు. పట్టణాల్లో పరిస్థితి మరీ ఇంతలా ఉండదు కానీ, పల్లెటూళ్లలో మాత్రం గ్రామస్తులు అధికారులంటే హడలిపోతుంటారు. ఆ మర్యాదలు చూసి అధికారులు కూడా లేనిపోని దర్పం ప్రదర్శించడం కూడా చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవాంతరాలను తగ్గించేందుకు కేరళలోని పంచాయతీ అధికారులు ఓ సరికొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఇకపై పంచాయతీ కార్యాలయాల్లోకి వచ్చే ప్రజలు, అధికారుల్ని కానీ, సిబ్బందిని కానీ సార్, మేడమ్ అనాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నేరుగా పేరు పెట్టి పిలిచేందుకు వీలుగా వారి పేర్లతో కూడిన నేమ్ బోర్డ్స్ ని టేబుళ్లపై ఉంచుతున్నారు. అంతే కాదు, చేటన్‌ (అన్న), చేచి (అక్కా) అని అధికారులను పిలవాలని సూచిస్తున్నారు.

కేరళలోని మధుర అనే గ్రామపంచాయతీ కార్యాలయంలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచ్, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలోనే ఈ పదాలను తొలగించిన మొదటి గ్రామంగా మధుర నిలిచింది. సార్‌, మేడమ్‌ అనే పదాలు ప్రజలకు, అధికారులకు మధ్య దూరాన్ని పెంచుతున్నాయని..దాన్ని చెరిపేసి స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మధుర గ్రామ సర్పంచ్ చెబుతున్నారు. గౌరవ పదాలను నిషేధిస్తూ పంచాయతీ కార్యాలయం వెలుపల నోటీసులు కూడా ఉంచారు. సార్‌, మేడమ్‌ అని సంబోధించకపోయినా అధికారులు ప్రజల సమస్యలు తీరుస్తారని అందులో పేర్కొన్నారు.

ప్రజలు ఇచ్చే అర్జీల విషయంలో కూడా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు కేరళ అధికారులు. అర్జీ, లేదా అప్లికేషన్ అంటే వారు అభ్యర్థిస్తున్నట్టు ఉందని, అలా కాకుండా ఆ స్థానంలో ‘అవకాశ పత్రిక’ అనే పేరు ఉపయోగిస్తామని అంటున్నారు. ప్రజలు ఇకపై అధికారులను అభ్యర్థించడం ఉండకూడదని, తమ హక్కులను వారు డిమాండ్ చేసి సాధించుకోవాలని పిలుపునిస్తున్నారు. అన్నా, అక్కా అనే పిలుపుతో కేరళ అధికారులు సరికొత్త సంప్రదాయానికి తెరతీశారని చెప్పొచ్చు.

First Published:  2 Sep 2021 9:52 PM GMT
Next Story