Telugu Global
National

కరోనా సీన్ రివర్స్.. ఆంక్షలు విధించడం ఇప్పుడు భారత్ వంతు..

డెల్టా వేరియంట్ విజృంభణతో ఓ దశలో భారత్, అంతర్జాతీయ సమాజంలో ఒంటరిగా నిలిచింది. ఇండియన్ వేరియంట్ అనే పేరుతో భారత్ ను దాదాపుగా వెలి వేసినంత పని చేశాయి కొన్ని దేశాలు. తమ దేశస్తులకు కూడా భారత్ నుంచి రావడానికి తుది గడువు పెట్టిన ఆస్ట్రేలియా, గడువు దాటిన తర్వాత వచ్చే వారికి భారీ జరిమానా విధిస్తూ గతంలో సంచల నిర్ణయం తీసుకుంది. అమెరికా, యూఏఈ, బ్రిటన్ కూడా అప్పట్లో భారత్ నుంచి వచ్చేవారిపై ఆంక్షలు పెట్టాయి. […]

కరోనా సీన్ రివర్స్.. ఆంక్షలు విధించడం ఇప్పుడు భారత్ వంతు..
X

డెల్టా వేరియంట్ విజృంభణతో ఓ దశలో భారత్, అంతర్జాతీయ సమాజంలో ఒంటరిగా నిలిచింది. ఇండియన్ వేరియంట్ అనే పేరుతో భారత్ ను దాదాపుగా వెలి వేసినంత పని చేశాయి కొన్ని దేశాలు. తమ దేశస్తులకు కూడా భారత్ నుంచి రావడానికి తుది గడువు పెట్టిన ఆస్ట్రేలియా, గడువు దాటిన తర్వాత వచ్చే వారికి భారీ జరిమానా విధిస్తూ గతంలో సంచల నిర్ణయం తీసుకుంది. అమెరికా, యూఏఈ, బ్రిటన్ కూడా అప్పట్లో భారత్ నుంచి వచ్చేవారిపై ఆంక్షలు పెట్టాయి. విదేశీ విమాన సర్వీసులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మొదలు కాలేదంటే.. దానికి కారణం.. ఇతర దేశాలు భారత్ ని దూరం పెట్టడమే. కానీ ఈ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. భారత్ కు సెకండ్ వేవ్ ముప్పు దాదాపుగా తప్పిపోయినట్టే తెలుస్తోంది. అదే సమయంలో విదేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో.. ఆంక్షలు విధించడం ఇప్పుడు భారత్ కి తప్పనిసరిగా మారింది.

కరోనా రూపాంతరం చెందడం, ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ల జాడ కనిపిస్తుండటంతో.. కేంద్రం అప్రమత్తమైంది. డెల్టా ప్లస్ తర్వాత ఇప్పుడు కొత్తగా సి-1.2 వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఈ వేరియంట్ భారత్ లో లేదని ప్రభుత్వం ధీమాగా ఉంది, అయితే విదేశీ ప్రయాణాల వల్ల ఇది భారత్ లో అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది అందుకే ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాలకు చెందిన ప్రయాణికులు భారత్‌ కు వస్తే కచ్చితంగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ చూపించాల్సిందే. లేకపోతే వారిని అక్కడే క్వారంటైన్లో పెట్టేస్తారు. ఇప్పుడీ నిబంధనను మరో ఏడు దేశాలకు విస్తరించారు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, బోత్సువానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే దేశాలకు చెందిన ప్రయాణికులు భారత్‌లో దిగగానే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. అక్కడినుంచి వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కేటప్పుడు పరీక్ష చేయించుకున్నా కూడా భారత్‌లో దిగగానే మళ్లీ పరీక్ష చేయాలని స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వస్తేనే వారికి అనుమతి ఇవ్వాలని తేల్చి చెప్పింది.

కొత్త వేరియంట్ తోనే మూడో ముప్పు..
ఫస్ట్ వేవ్ నుంచి నేర్చుకున్న గుణపాఠాలు సెకండ్ వేవ్ సమయంలో ఉపయోగపడినా.. కొత్త వేరియంట్ వల్ల భారత్ లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. థర్డ్ వేవ్ ముప్పు భయం ఉండనే ఉంది. ఈ దశలో కొత్త వేరియంట్ భారత్ లో ప్రవేశిస్తే, థర్డ్ వేవ్ కి అదే తొలి సంకేతం అవుతుంది. అందుకే భారత్ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశీ ప్రయాణికులపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించింది. ఓ దశలో భారత్ నుంచి వచ్చేవారిపై ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తే.. ఇప్పుడు ఆ అవసరం భారత్ కి వచ్చింది.

First Published:  2 Sep 2021 10:21 PM GMT
Next Story