Telugu Global
NEWS

డిపోల మూత, స్థలాల విక్రయం.. తెలంగాణ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం..

అప్పుల బాధతో మూలుగుతున్న తెలంగాణ ఆర్టీసీపై కరోనా తాటికాయ పడింది. దీంతో అది మరింత కష్టాల్లో చిక్కుకుపోయింది. విలీనం చేసుకోడానికి ప్రభుత్వం ససేమిరా అనడంతో.. జీతాలివ్వడానికే ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో నష్టాలు వచ్చే డిపోలను మూసేస్తూ, మిగులు స్థలాలను అమ్మేయడం ద్వారా ఆర్థిక సాంత్వన కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆర్టీసీ ఆస్తుల అమ్మకం అనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా.. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల అభ్యంతరంతో ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ దఫా కరోనా వల్ల ఆర్టీసీ పూర్తిగా […]

డిపోల మూత, స్థలాల విక్రయం.. తెలంగాణ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం..
X

అప్పుల బాధతో మూలుగుతున్న తెలంగాణ ఆర్టీసీపై కరోనా తాటికాయ పడింది. దీంతో అది మరింత కష్టాల్లో చిక్కుకుపోయింది. విలీనం చేసుకోడానికి ప్రభుత్వం ససేమిరా అనడంతో.. జీతాలివ్వడానికే ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో నష్టాలు వచ్చే డిపోలను మూసేస్తూ, మిగులు స్థలాలను అమ్మేయడం ద్వారా ఆర్థిక సాంత్వన కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆర్టీసీ ఆస్తుల అమ్మకం అనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా.. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల అభ్యంతరంతో ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ దఫా కరోనా వల్ల ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతున్న పరిస్థితి. దీంతో ఎట్టకేలకు ఈ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి డిపోల మూత, ఆస్తుల విక్రయం ఖాయమని తెలుస్తోంది.

టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఖర్చులకి సరిపోవడంలేదు. ఇటీవల కార్గో సర్వీసులను ప్రారంభంచినా వాటితో ప్రయోజనం కనిపించడంలేదు. కార్గో సేవలకోసం ఆర్టీసీ సిబ్బందిని కాకుండా కాంట్రాక్ట్ సిబ్బందిని వినియోగించుకోవడంతో వారి జీతాలకు కూడా కటకట మొదలైంది. కరోనా వల్ల తెలంగాణ ఆర్టీసీకి మరిన్ని నష్టాలొచ్చాయి. బస్సుల నిర్వహణ సమస్యలు తలెత్తాయి. హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు, వ్యక్తిగత వాహనాల కొనుగోలు పెరిగిపోవడంతో ఆర్టీసీ ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఆస్తుల విక్రయం మినహా వేరే దారి కనడపటంలేదని చెబుతున్నారు అధికారులు.

జిల్లా కేంద్రాల్లో, ఇతర ముఖ్య ప్రాంతాల్లో పట్టణాల నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను ఊరు చివరకు మార్చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అలా ఖాళీ అయిన ఆ స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారట. లీజు ప్రాతిపదికన ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం కానీ, లేదా విక్రయించడం కానీ చేస్తారు.

గతంలో ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో డిపోల సంఖ్యను పెంచారు. ఇప్పుడు వాటి నిర్వహణ భారం కావడంతో.. దగ్గర దగ్గరగా ఉన్న డిపోల్లో ఒకదాన్ని మూసివేయాలనుకుంటున్నారు. లాభాలు తెచ్చిపెట్టే లాంగ్ జర్నీ బస్సులు, లగ్జరీ బస్సులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు. సిటీ, పల్లె వెలుగు బస్సుల సంఖ్య క్రమంగా తగ్గిస్తారు. హైదరాబాద్ లో కూడా డిపోల సంఖ్యను కుదించే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. రెండేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె సమయంలో సిటీలో దాదాపు 1000 బస్సులను తగ్గించారు. సర్వీసుల సంఖ్య తగ్గిన డిపోలను ఇప్పుడు మూసివేయబోతున్నారు. కొత్తగా వచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ మార్పులు చేర్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయ్యాక నష్టాల కష్టాలపై సిబ్బంది ఆందోళన పడటం ఆపేశారు, ఆ భారమంతా ప్రభుత్వంపైనే పడింది. తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నరు అధికారులు.

First Published:  2 Sep 2021 10:05 PM GMT
Next Story