Telugu Global
National

బ్యాన్ కేరళ.. పొరుగు రాష్ట్రాల కొత్త నినాదం..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా, కేరళలో మాత్రం రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దేశంలో వెలుగు చూస్తున్న కేసుల్లో దాదాపు 70శాతానికి పైగా కేరళనుంచి వస్తున్నవే. ఈ క్రమంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలు కేరళని ఓ కంట కనిపెడుతున్నాయి. కర్నాటక కాస్త ఎక్కువగా భయపడుతోంది. కేరళనుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. కేరళ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఏడు రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. విద్యార్థులతో సహా […]

బ్యాన్ కేరళ.. పొరుగు రాష్ట్రాల కొత్త నినాదం..
X

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా, కేరళలో మాత్రం రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దేశంలో వెలుగు చూస్తున్న కేసుల్లో దాదాపు 70శాతానికి పైగా కేరళనుంచి వస్తున్నవే. ఈ క్రమంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలు కేరళని ఓ కంట కనిపెడుతున్నాయి. కర్నాటక కాస్త ఎక్కువగా భయపడుతోంది. కేరళనుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. కేరళ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఏడు రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. విద్యార్థులతో సహా కేరళ నుంచి వచ్చే ప్రతిఒక్కరికీ ఈ కొవిడ్‌ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తయినా‌, ముందస్తు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్నా కూడా కేరళనుంచి వస్తే క్వారంటైన్‌ తప్పనిసరి అని తేల్చేశారు. క్వారంటైన్ ముగిసిన తర్వాత వారికి తిరిగి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తారు. నెగెటివ్ వస్తేనే బయటకు అనుమతిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా సరిహద్దు ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటుచేస్తోంది కర్నాటక. ఒకటి రెండు రోజుల్లో ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

తమిళనాడు అప్రమత్తం..
కేరళతో అత్యథిక భూ సరిహద్దుని పంచుకుంటున్న తమిళనాడు కూడా అప్రమత్తమవుతోంది. కేరళనుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి మినహాయింపు ఇస్తోంది. కేరళలో థర్డ్ వేవ్ మొదలైతే.. కచ్చితంగా తమిళనాడు, కర్నాటకపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆయా రాష్ట్రాలు కేరళపై ఆంక్షలు విధించాయి.

పొరుగు ఆంక్షలతో కేరళకు చిక్కులు..
సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న వేళ.. కేరళలో పర్యాటక రంగం కాస్త ఊపందుకుంది. ఓనమ్ పండగతో సందడి మరింత పెరిగింది. అయితే కేసులు కూడా అదే స్థాయిలో పెరగడంతో పొరుగు రాష్ట్రాలు ‘బ్యాన్ కేరళ’ అనేస్తున్నాయి, ఆంక్షలు విధించాయి. దీంతో కేరళకు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలోని పినరయి విజయన్ సర్కారుపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అయితే రెండు రోజులుగా పాజిటివిటీ రేటు కేరళలో కాస్త తగ్గుముఖం పట్టడం ఒక్కటే సంతోషించదగ్గ విషయం. ఇటీవల 18 శాతం దాటిన పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.74కి దిగొచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే కేరళలో కేసులు పూర్తి స్థాయిలో తగ్గుతాయని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  30 Aug 2021 9:08 PM GMT
Next Story