Telugu Global
NEWS

సెప్టెంబర్-1 జల జగడం..

ఇప్పటి వరకూ ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నది నీటి పంపకాల్లో మాటల తూటాలు పేలాయి. అటు ఇటు ఇరువైపుల నాయకులు నీటి వాటాలపై తమ వాదన వినిపించారు. అయితే అధికారికంగా లెక్కలు తేల్చే సమావేశం ఇంతవరకూ జరగలేదు. కొన్నిరోజులుగా తెలంగాణ ఈ సమావేశాలను దాటవేస్తూ వచ్చింది. ఎట్టకేలకు సెప్టెంబర్-1న జరిగే కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని నిర్ణయించింది. దీంతో అదే రోజు అసలు జల జగడం మొదలవుతుందనే అంచనాలున్నాయి. […]

సెప్టెంబర్-1 జల జగడం..
X

ఇప్పటి వరకూ ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నది నీటి పంపకాల్లో మాటల తూటాలు పేలాయి. అటు ఇటు ఇరువైపుల నాయకులు నీటి వాటాలపై తమ వాదన వినిపించారు. అయితే అధికారికంగా లెక్కలు తేల్చే సమావేశం ఇంతవరకూ జరగలేదు. కొన్నిరోజులుగా తెలంగాణ ఈ సమావేశాలను దాటవేస్తూ వచ్చింది. ఎట్టకేలకు సెప్టెంబర్-1న జరిగే కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని నిర్ణయించింది. దీంతో అదే రోజు అసలు జల జగడం మొదలవుతుందనే అంచనాలున్నాయి.

ఫిఫ్టీ ఫిఫ్టీ కుదరదంతే..
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కృష్ణానదీ జలాల పంపకాలపై స్పష్టమైన ఆదేశాలున్నాయి. 70శాతం నీటిని ఏపీ, 30శాతం నీటిని తెలంగాణ వాడుకోవాలనే నిబంధన ఉంది. అప్పట్లో కేసీఆర్ ఒప్పుకున్నారు కూడా. కానీ ఇటీవల శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తికోసం తెలంగాణ ఏకపక్షంగా నీటిని విడుదల చేయడంతో అసలు వివాదం మొదలైంది. అయితే ఏపీ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో శ్రీశైలం డ్యామ్ ఖాళీ చేయాలని చూస్తోందని, అందుకే తాము అడ్డం తిరిగామనేది తెలంగాణ వాదన. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో రాయలసీమ ఎత్తిపోతలకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం చేస్తోంది. అదే సమయంలో తెలంగాణ కూడా కృష్ణానదిపై అక్రమంగా ప్రాజెక్ట్ లు నిర్మిస్తోందని, దాని వల్ల శ్రీశైలానికి వచ్చే నీటి మట్టం తగ్గిపోతుందని ఏపీ ఆరోపిస్తోంది. ఏది ఏమయినా.. 70శాతం, 30శాతం నిబంధనకే కట్టుబడి ఉండాలని వైసీపీ ప్రభుత్వం వాదిస్తోంది. తెలంగాణ కోరుతున్న ఫిఫ్టీ ఫిఫ్టీ నీటి కేటాయింపులు పగటి కలే అని అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్లాలని అన్నారు. అంగీకరించిన విషయాన్ని తెలంగాణ ప్రశ్నించటం అసంబద్ధం అని చెప్పారు. కేఆర్ఎంబీ సమావేశంలో తమ వాదన బలంగా వినిపిస్తామంటున్నారు.

అధికారులకు కేసీఆర్ దిశా నిర్దేశం..
గత కొన్ని రోజులుగా కేఆర్ఎంబీ సమావేశానికి హాజరు కాకుండా వాయిదా వేస్తున్న కేసీఆర్ ఎట్టకేలకు సెప్టెంబర్-1న జరిగే సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. తెలంగాణకు న్యాయమైన నీటివాటా కోసం పోరాడుతున్నామని చెప్పారాయన. భవిష్యత్తులో 70శాతం, 30శాతం నిబంధనకు ఒప్పుకునేదే లేదన్నారు కేసీఆర్. శ్రీశైలం ప్రాజెక్ట్ జలవిద్యుత్ ఉత్పత్తితో మొదలైన ఈ జల జడగం.. ఎట్టకేలకు ఇప్పుడు అధికారుల సమావేశంతో కీలక మలుపుకి చేరుకుంది. ఈ సమావేశంతో తేలేది ఏమైనా ఉందా లేక గొడవలు మళ్లీ కేంద్రం, కోర్టుల పరిధిలోకే వెళ్తాయా అనేది వేచి చూడాలి.

First Published:  25 Aug 2021 11:00 PM GMT
Next Story