Telugu Global
National

కొంపముంచిన ఓనమ్.. కేరళలో భారీగా పెరిగిన కేసులు..

అనుకున్నంతా అయింది, కేరళలో ఓనమ్ పండగ సందర్భంగా కరోనా పుట్ట పగిలింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో కేరళ వాటా 80శాతానికి పైగా పెరిగింది. పాజిటివిటి రేటు కూడా 15శాతం నుంచి 19.03 శాతానికి ఎగబాకింది. దీంతో కేరళ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేరళలో ఈనెల 12న ప్రారంభమైన ఓనమ్ ఉత్సవాలు 23తో ముగిశాయి. ఆ తర్వాత రెండు రోజులు కూడా పండగ సందడి కొనసాగింది. ఇప్పుడు లెక్కలు తీస్తే […]

కొంపముంచిన ఓనమ్.. కేరళలో భారీగా పెరిగిన కేసులు..
X

అనుకున్నంతా అయింది, కేరళలో ఓనమ్ పండగ సందర్భంగా కరోనా పుట్ట పగిలింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో కేరళ వాటా 80శాతానికి పైగా పెరిగింది. పాజిటివిటి రేటు కూడా 15శాతం నుంచి 19.03 శాతానికి ఎగబాకింది. దీంతో కేరళ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కేరళలో ఈనెల 12న ప్రారంభమైన ఓనమ్ ఉత్సవాలు 23తో ముగిశాయి. ఆ తర్వాత రెండు రోజులు కూడా పండగ సందడి కొనసాగింది. ఇప్పుడు లెక్కలు తీస్తే కేరళ కరోనా గుప్పెట్లో చిక్కుకున్నట్టు స్పష్టమవుతోంది. కేరళ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,445 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 215 మంది కరోనా బాధితులు మృతిచెందారు. తాజా కేసులతో కలుపుకొని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,83,429కి చేరింది. మృతుల సంఖ్య 19,972కి పెరిగింది.

గతంలో బక్రీద్ పండగకోసం కేరళలో లాక్ డౌన్ నిబంధనలు సడలించారు. అప్పుడు కూడా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. ఇప్పుడు ఓనమ్ పండగ కోసం నిబంధనల్లో మార్పు తీసుకొచ్చి, షాపింగ్, ఇతర అవసరాలకోసం సడలింపులు ఇచ్చారు. దీంతో మరోసారి కరోనా వ్యాప్తి భారీగా పెరిగింది. ఓవైపు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మరోవైపు కేరళ వాటా అమాంతంగా పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 80శాతం కేరళనుంచే వస్తున్నాయంటే, పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కేరళ వైఫల్యాలకు ఇతర రాష్ట్రాల ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టినట్టే అనే విషయం స్పష్టమవుతోంది. గతంలో నలుగురు సభ్యుల బృందాన్ని పంపి, పరిస్థితుల్ని సమీక్షించిన కేంద్రం ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగకపోతే కేరళ పుట్టి మునగడం ఖాయం.

First Published:  25 Aug 2021 11:18 PM GMT
Next Story