Telugu Global
National

అమరీందర్ సీటు కింద అసమ్మతి బాంబు పెట్టిన సిద్ధూ..

పంజాబ్ లో కాంగ్రెస్ అంతర్గత రాజకీయం మరోసారి రచ్చకెక్కింది. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ లో లుకలుకలు ప్రత్యర్థులకు వరంగా మారే అవకాశం ఉందని తెలిసి కూడా.. ఆ పార్టీ నష్టనివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం అయింది. అధిష్టానం సిద్ధూకి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అమరీందర్ కి ఒకరకంగా పొగపెట్టినట్టయింది. అయితే అమరీందర్ మాత్రం సీఎం కుర్చీని వదిలేందుకు ససేమిరా అంటున్నారు. సిద్దూతో కలసిపోయినట్టే కనిపించినా.. […]

అమరీందర్ సీటు కింద అసమ్మతి బాంబు పెట్టిన సిద్ధూ..
X

పంజాబ్ లో కాంగ్రెస్ అంతర్గత రాజకీయం మరోసారి రచ్చకెక్కింది. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ లో లుకలుకలు ప్రత్యర్థులకు వరంగా మారే అవకాశం ఉందని తెలిసి కూడా.. ఆ పార్టీ నష్టనివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం అయింది. అధిష్టానం సిద్ధూకి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అమరీందర్ కి ఒకరకంగా పొగపెట్టినట్టయింది. అయితే అమరీందర్ మాత్రం సీఎం కుర్చీని వదిలేందుకు ససేమిరా అంటున్నారు. సిద్దూతో కలసిపోయినట్టే కనిపించినా.. తాజాగా ఆయన సలహాదారులపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి గొడవ ముదిరింది. కాశ్మీర్ అంశంపై సిద్ధూ సలహాదారులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు అమరీందర్. ఆ తర్వాత సిద్ధూ దానికి కౌంటర్ గా చక్కెర రైతుల గిట్టుబాటు ధరల్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, ఇతర రాష్ట్రాల్లో రైతులకు న్యాయం జరుగుతోందని, పంజాబ్ లో మాత్రం చక్కెర రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా న్యాయం జరగడంలేదని విమర్శించారు.

తాజాగా అమరీందర్‌ పై నలుగురు క్యాబినెట్‌ మంత్రులు, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. సీఎం కుర్చీనుంచి అమరీందర్ ను దించేయాలని డిమాండ్‌ చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన అమరీందర్‌ పై తమకు విశ్వాసం లేదని వారు ప్రకటించారు. ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తామని ఆ నలుగురు మంత్రుల్లో ఒకరైన టీ రాజీందర్‌ సింగ్‌ బజ్వా మీడియాకు తెలిపారు.

మరోవైపు అమరీందర్‌ కూడా తన వర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. సిద్ధూపై విమర్శలు ఎక్కు పెట్టించారు. అమరీందర్ కు విధేయులైన మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధూపై విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్‌, కాశ్మీర్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ సలహాదారులు ఇద్దర్ని తొలిగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ పూర్తి మద్దతు అమరీందర్ కే నని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే దానికి కారణం సిద్ధూయే అవుతారని వారు ఆరోపించారు.

మొత్తమ్మీద సద్దుమణిగినట్టే ఉన్న కాంగ్రెస్ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలనాటికి ఇవి మరింత ముదిరి పార్టీని అధికారానికి దూరం చేస్తాయనే అంచనాలున్నాయి. రైతు ఉద్యమం వల్ల శిరోమణి అకాలీ దళ్ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షం నుంచి.. అధికార పక్షం మారేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దశలో కాంగ్రెస్ అంతర్గత కల్లోలం వారికి అనుకోని వరంలా మారింది.

First Published:  24 Aug 2021 8:02 PM GMT
Next Story