Telugu Global
NEWS

ఏపీలో విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట పడుతుందా..?

కరోనాకు ముందు తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా సాగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యా సంస్థలు ఉత్తరాదిలో కూడా బ్రాంచ్ లు పెట్టి విద్యా వ్యాపారాన్ని సమర్థంగా నడిపాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి కార్పొరేట్ సంస్థలన్నిటికీ ఇకపై చెక్ పెట్టబోతోంది ఏపీ విద్యాశాఖ. గతంలో కూడా విద్యార్థుల ఫీజులు, ఇతర వ్యవహారాలపై నిబంధనలు, నియంత్రణలు ఉన్నా కూడా ఈసారి అవి మరింత పగడ్బందీగా అమలు చేయడానికి నిర్ణయించింది. ఇంటర్ కాలేజీల […]

ఏపీలో విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట పడుతుందా..?
X

కరోనాకు ముందు తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా సాగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యా సంస్థలు ఉత్తరాదిలో కూడా బ్రాంచ్ లు పెట్టి విద్యా వ్యాపారాన్ని సమర్థంగా నడిపాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి కార్పొరేట్ సంస్థలన్నిటికీ ఇకపై చెక్ పెట్టబోతోంది ఏపీ విద్యాశాఖ. గతంలో కూడా విద్యార్థుల ఫీజులు, ఇతర వ్యవహారాలపై నిబంధనలు, నియంత్రణలు ఉన్నా కూడా ఈసారి అవి మరింత పగడ్బందీగా అమలు చేయడానికి నిర్ణయించింది. ఇంటర్ కాలేజీల అడ్మిషన్లన్నీ ఆన్ లైన్ చేయడం ద్వారా ఇందులో తొలి అడుగు పడింది. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల్ని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం మలి అడుగు వేసింది.

టెన్త్ క్లాస్ గరిష్ట ఫీజు రూ.24వేలు
హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు.. ఇలా రకరకాల పేర్లతో.. ఏపీలో టెన్త్ ఫీజు లక్ష రూపాయల గరిష్ట స్థాయిని ఎప్పుడో దాటేసింది. ఇప్పుడది రూ.24వేలకు పరిమితం కావాల్సిన సందర్భం.
నర్సరీ నుంచి 5వ తరగతి వరకు గ్రామాల్లో 10వేల రూపాయలు, పట్టణాల్లో 11వేలు, నగరాల్లో 12వేలుగా ఫీజులు నిర్ణయించారు. 6నుంచి 10 తరగతి వరకు గ్రామాల్లో 12వేల రూపాయలు, పట్టణాల్లో 15వేలు, నగరాల్లో 18వేలుగా ఫీజు నిర్ణయించారు. ఇక విద్యార్థి హాస్టల్ ఎంచుకుంటే, గ్రామాల్లో 18వేలు, పట్టణాల్లో 20వేలు, నగరాల్లో 24వేలు గరిష్ట ఫీజుగా నిర్ణయించారు. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్‌ ఫీజు, రిజిస్ట్రేషన్‌ ఫీజు, పరీక్షలు, లేబొరేటరీ, క్రీడలు, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ, స్టడీ టూర్‌.. ఇతర విద్యా సంబంధ రుసుములన్నీ ఇందులోనే కలిసి ఉంటాయి. అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పుస్తకాలు, యూనిఫామ్ లు, స్టడీ మెటీరియళ్ల పేరిట కూడా ఇకపై దోపిడీ జరిగే అవకాశం లేదు. ప్రత్యేకించిన దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలని యాజమాన్యాలు చెప్పకూడదు. కనీసం అయిదేళ్ల వరకు యూనిఫాం మార్చకూడదు. మార్చాల్సి వస్తే అందుకు కారణాలు తెలియజేయాలి. గతంలోనూ ఇలాంటి నిబంధనలే ఉన్నా.. ఈసారి మాత్రం పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది.

ఇంటర్ కాలేజీలకు కూడా షాకే..
ఎంపీసీ, బైపీసీ కోర్సులకు ఏడాదికి గరిష్ఠంగా.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేలు, పురపాలక సంఘాల్లో రూ.17,500, నగర పాలక సంస్థల్లో రూ.20 వేలు వసూలు చేయాలని చెప్పింది విద్యాశాఖ. ఇక్కడ కూడా అడ్మిషన్, ట్యూషన్‌, ల్యాబ్ ఫీజు అంటూ విద్యార్థుల్ని వేధించడానికి లేదు. కాలేజీ బస్సు సౌకర్యం ఉంటే కిలోమీటర్ కు కేవలం రూ.1.20 చొప్పున మాత్రమే వసూలు చేయాలి. హాస్టల్ పేరుతో నిలువు దోపిడీకి కూడా అడ్డుకట్ట వేసింది విద్యాశాఖ. హాస్టల్ లో ఉంటే.. నగరాల్లో గరిష్టంగా రూ.24వేలు మాత్రమే ఫీజు తీసుకోవాల్సి ఉంటుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పేరుతో వసూలు చేసే అదనపు ఫీజులకు కూడా కళ్లెం వేసింది. ఇంటర్ తోపాటు జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పరీక్షలకు గరిష్టంగా రూ.20వేలు మాత్రమే ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది. మెటీరియల్ పేరుతో అదనపు వసూళ్లు ఉండకూడదు. ఈ లెక్కన చూసుకుంటే.. ఒక సైన్స్ స్టూడెంట్ ఇంటర్ తోపాటు నీట్ కోచింగ్ తీసుకుంటూ, హాస్టల్ లో ఉంటే.. అతనికి గరిష్టంగా రూ.64వేలు మాత్రమే ఖర్చవుతాయి. ప్రస్తుతం దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా ప్రైవేటు యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు తక్కువగా ఉన్నాయని యాజమాన్యం భావిస్తే, ప్రకటన వెలువడిన 15 రోజుల్లోగా తగిన కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. అందులో సిబ్బంది జీతాలు, వారి అర్హతలు, ఇతర ఖర్చులు, అన్ని వివరాలు నమోదు చేసి పంపాలి. ఫిర్యాదు పరిష్కరించే వరకు ఎలాంటి అదనపు ఫీజులూ వసూలు చేయకూడదని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తమ్మీద ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన ఫీజుల ప్రకటన సంచలనంగా మారింది. ప్రైవేటు యాజమాన్యాలపై కచ్చితంగా ఇది పిడుగుపాటేనని చెప్పాలి. ఇప్పటి వరకూ జరిగిన దోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

First Published:  24 Aug 2021 8:23 PM GMT
Next Story