Telugu Global
National

హెచ్చరించేదీ వారే.. గేట్లెత్తేదీ వారే..

భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ గుర్తులు మెల్లి మెల్లిగా చెరిగిపోతున్నాయి. కేసులు కనిష్టానికి పడిపోయాయి. ఈ దశలో థర్డ్ వేవ్ ఉంటుందని చాలామంది అంటున్నారు, ఆ భయాలు పెట్టుకోనక్కర్లేదని కూడా మరికొంతమంది నిపుణులు భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కేంద్ర సంస్థలు ఒకేరోజు విడుదల చేసిన కీలక నివేదికలు మాత్రం ఆందోళన కలిగించేలా ఉన్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం), నీతి ఆయోగ్‌ […]

హెచ్చరించేదీ వారే.. గేట్లెత్తేదీ వారే..
X

భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ గుర్తులు మెల్లి మెల్లిగా చెరిగిపోతున్నాయి. కేసులు కనిష్టానికి పడిపోయాయి. ఈ దశలో థర్డ్ వేవ్ ఉంటుందని చాలామంది అంటున్నారు, ఆ భయాలు పెట్టుకోనక్కర్లేదని కూడా మరికొంతమంది నిపుణులు భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కేంద్ర సంస్థలు ఒకేరోజు విడుదల చేసిన కీలక నివేదికలు మాత్రం ఆందోళన కలిగించేలా ఉన్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం), నీతి ఆయోగ్‌ సంస్థలు రెండూ.. థర్డ్ వేవ్ తథ్యమని, అక్టోబర్ లో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి.

ఎన్ఐడీఎం ఏం చెబుతోంది..?
కొవిడ్‌-19 పోరులో భారత్‌ కు సెప్టెంబర్, అక్టోబర్ కీలకం అవుతాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక బయటపెట్టంది. హోంమంత్రిత్వశాఖ అధీనంలోని ఎన్‌ఐడీఎం.. కరోనా మూడో దశ ముప్పుపై తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. వైరస్‌ లో మార్పులు ఎక్కువైతే సెప్టెంబర్ లోనే రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పరిస్థితులను బట్టి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ చివరినాటికల్లా ఎప్పుడైనా దేశంలో థర్డ్ వేవ్ కనిపించవచ్చని పేర్కొంది. చిన్నారులపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుందనే ఆధారాలు లేవని చెప్పిన ఎన్ఐడీఎం, ఒకవేళ అదే నిజమైతే భారత్ లో పిల్లలకు సరిపడా వైద్యసౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తంచేసింది. ఇన్‌ ఫెక్షన్‌ ద్వారాకానీ, వ్యాక్సినేషన్‌ ద్వారాకానీ హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యపడితేనే కరోనాకు ముగింపు పలకగలం అని పేర్కొంది. గతంలో 67శాతం మంది ప్రజలకు ఇలాంటి శక్తి వస్తేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందన్నారు. కానీ కొత్త వేరియంట్ల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి జనాభాలో 80–90 శాతం మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది ఎన్ఐడీఎం.

నీతి ఆయోగ్ లెక్కలు ఇవీ..
థర్డ్ వేవ్ పై నీతి ఆయోగ్ కూడా కేంద్రాన్ని ముందుగానే హెచ్చరిస్తోంది. ఆగస్టులోనే రోజుకు 4 నుంచి 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. థర్డ్ వేవ్ ముదిరితే దేశ ప్రజల్లో 23శాతం మంది ఆసుపత్రుల్లో చేరతారని, దాదాపు 2 లక్షల ఐసీయూ పడకలను కేంద్రం సిద్ధం చేసుకోవాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల లెక్క తీస్తే, ఆగస్ట్ లో ఆ స్థాయి ముప్పు ముంచుకొచ్చే అవకాశం లేదు. పరిస్థితులు చేయి దాటితే సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కేసుల ఉధృతి పెరగొచ్చు.

గేట్లు ఎత్తేసిన కేంద్రం..
అన్ లాక్ సడలింపుల బాధ్యత రాష్ట్రాలపైనే నెట్టేసిన కేంద్రం థర్డ్ వేవ్ హెచ్చరికలను పట్టించుకున్నట్టు లేదు. దేశవ్యాప్తంగా ఈ రోజునుంచి ప్యాసింజర్ రైళ్లకు రిజర్వేషన్లు రద్దు చేశారు. అప్పటికప్పుడు జనరల్ టికెట్ తీసుకుని నేరుగా రైలు ఎక్కేయొచ్చు. ఈ నిబంధన సడలింపుతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసే ప్రమాదం ఉంది. మరోవైపు మిగతా వ్యవహారాల్లో కూడా కేంద్రం, రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. కేరళ వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా నిపుణుల బృందాన్ని పంపి చేతులు దులుపుకుంది కేంద్రం. కేరళలో కేసులు పెరిగితే అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొంది. లాక్ డౌన్ పెట్టండి అని ఆదేశిస్తే, రాష్ట్రాలు ఆర్థిక సాయం అడుగుతాయేమోనన్న భయం కేంద్రానిది. థర్డ్ వేవ్ ముప్పుపై కేంద్ర సంస్థల తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో మరోసారి కఠిన నిబంధనలు అమలులోకి వస్తాయేమో చూడాలి.

First Published:  23 Aug 2021 8:57 PM GMT
Next Story