Telugu Global
National

యడ్డీ బాటలో యోగీ.. పొమ్మనలేదు కానీ..

కర్నాటకలో యడ్యూరప్పను సమర్థవంతంగా సీఎం కుర్చీనుంచి పక్కకు తప్పించి కొత్త నాయకుడు బసవరాజ్ బొమ్మైకి పగ్గాలప్పగించింది బీజేపీ అధిష్టానం. అదే సమయంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్ పై కూడా ఆ స్థాయిలోనే దృష్టిపెట్టింది. ఇక్కడ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. యోగీని మార్చేంత సాహసం చేయట్లేదు కానీ, ఆయనకు మెల్లగా పొగపెట్టడానికి సిద్ధమైంది కేంద్ర నాయకత్వం. యోగీ పక్కలో బల్లేలను సిద్ధం చేసింది. ఆమధ్య యోగీ కేబినెట్ […]

యడ్డీ బాటలో యోగీ.. పొమ్మనలేదు కానీ..
X

కర్నాటకలో యడ్యూరప్పను సమర్థవంతంగా సీఎం కుర్చీనుంచి పక్కకు తప్పించి కొత్త నాయకుడు బసవరాజ్ బొమ్మైకి పగ్గాలప్పగించింది బీజేపీ అధిష్టానం. అదే సమయంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్ పై కూడా ఆ స్థాయిలోనే దృష్టిపెట్టింది. ఇక్కడ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. యోగీని మార్చేంత సాహసం చేయట్లేదు కానీ, ఆయనకు మెల్లగా పొగపెట్టడానికి సిద్ధమైంది కేంద్ర నాయకత్వం. యోగీ పక్కలో బల్లేలను సిద్ధం చేసింది. ఆమధ్య యోగీ కేబినెట్ విస్తరణకు మహూర్తం ఖరారైందని, కొత్త మొహాలను తెరపైకి తెస్తున్నారని, యోగీ ప్రాభవాన్ని తగ్గిస్తారని ప్రచారం జరిగినా అది సాధ్యపడలేదు. ఇన్నాళ్లకు దానికి ముహూర్తం కుదిరింది. తాజాగా యోగీ కేబినెట్ విస్తరణకు కేంద్రం సిద్ధపడింది.

ఢిల్లీలో మంతనాలు..
రెండ్రోజులుగా ఢిల్లీలో యూపీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు నేతలు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, పార్టీ సీనియర్ నాయకుడు సునీల్ బన్సల్.. అమిత్ షా తో సమావేశమయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేశారు. ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సీనియ‌ర్ నేత జితిన్ ప్ర‌సాద‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరొందిన ఏకే శ‌ర్మ‌, ల‌క్ష్మీకాంత్ బాజ్‌ పాయి త‌దిత‌రులు యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ముగ్గురు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గ నేత‌ల‌తోపాటు యూపీలో బీజేపీ మిత్ర‌ప‌క్షం నేత సంజ‌య్ నిషాద్ స‌హా మ‌రో ఇద్ద‌రు, ముగ్గురు నేత‌ల‌కు కేబినెట్ లో చోటు క‌ల్పిస్తార‌ని సమాచారం. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి సంబంధించిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు బీజేపీ ఆధ్వర్యంలో యాత్ర మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ కూడా తయారు చేస్తున్నారు.

యోగీ కాదు, మోదీ ఫేస్ తోనే ఎన్నికలకు..
ఐదేళ్లలో యోగీ సర్కారు పనితీరు బేరీజు వేసుకుంటే.. పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే యోగీని పక్కనపెట్టి, మోదీ ఫేస్ తోనే యూపీ ఎన్నికలను ఎదుర్కోవాలనుకుంటోంది బీజేపీ అధిష్టానం. అక్టోబర్ నుంచి ప్రధాని మోదీ, యూపీ పర్యటనలు ఖరారు చేసుకుంటున్నారు. ఎన్నికలయ్యే వరకు నెలకోసారి మోదీ యూపీలో పర్యటిస్తారని అంటున్నారు. మొత్తమ్మీద ఎన్నికల భారమంతా యోగీపై వేయకుండా బీజేపీ అధిష్టానం జాగ్రత్తపడుతోంది. జితిన్ ప్రసాద వంటి నాయకులతో ఎక్కడికక్కడ యోగీకి చెక్ పెడుతూ ఆయన అధికారానికి కత్తెర వేస్తోంది.

First Published:  20 Aug 2021 9:03 PM GMT
Next Story