Telugu Global
National

మతమార్పిళ్ల నిరోధ చట్టంపై గుజరాత్ హైకోర్టు స్టే..

లవ్ జీహాద్ పేరుతో మత మార్పిళ్లు జరుగుతున్నాయని చాలా కాలంగా బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన చట్టాలు కూడా రూపొందాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌ మత స్వేచ్ఛ(సవరణ) చట్టం-2021ని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 15న నోటిఫై చేసింది. అయితే ఈ చట్టం అమలుపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసిన కోర్టు, మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మతాంతర వివాహాలు చేసుకున్నవారిని అనవసర […]

మతమార్పిళ్ల నిరోధ చట్టంపై గుజరాత్ హైకోర్టు స్టే..
X

లవ్ జీహాద్ పేరుతో మత మార్పిళ్లు జరుగుతున్నాయని చాలా కాలంగా బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన చట్టాలు కూడా రూపొందాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌ మత స్వేచ్ఛ(సవరణ) చట్టం-2021ని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 15న నోటిఫై చేసింది. అయితే ఈ చట్టం అమలుపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసిన కోర్టు, మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మతాంతర వివాహాలు చేసుకున్నవారిని అనవసర వేధింపుల నుంచి కాపాడేందుకే ఈ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది.

గుజరాత్‌ మత స్వేచ్ఛ(సవరణ) చట్టంలో కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ, జామియత్‌ ఉలెమా-ఇ-హింద్‌ కు చెందిన గుజరాత్‌ శాఖ గత నెలలో హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ చట్టం ప్రకారం వివాహం ద్వారా బలవంతపు మతమార్పిడికి పాల్పడితే ఐదేళ్ల వరకూ జైలుశిక్ష విధించడంతో పాటు వివాహాన్ని రద్దు చేస్తారు. మత మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించే మత పెద్దలు ముందస్తుగా జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అన్యమతాన్ని స్వీకరిస్తున్నవారు ఆ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్‌కు తెలపాల్సి ఉంటుంది. మత మార్పిడి అభియోగాలు ఎదుర్కొంటున్నవారు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఓ మతానికి చెందిన వ్యక్తి, మరో మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అది బలవంతం, మోసపూరితం అని చెప్పలేమని, అక్కడ మత మార్పిడి ఉద్దేశం ఉంటుందని చెప్పలేమని పేర్కొంది. ఆయా సెక్షన్ల అమలును ధర్మాసనం నిలిపివేసింది.

వివాహం ద్వారా బలవంతపు మత మార్పిడి జరిగితే ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ కమల్‌ త్రివేది ధర్మాసనాన్ని అడిగారు. అయితే ఇలాంటి వివాహాల్లో బలవంతపు, మోసపూరిత ఉద్దేశాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉండాలని, ఆధారాలు లేకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి న్యాయ విచారణ చేపట్టకూడదని స్పష్టం చేశారు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌.

First Published:  19 Aug 2021 10:06 PM GMT
Next Story