Telugu Global
NEWS

విశాఖ ఉక్కు కొనుగోలు రేసులో 'టాటా'లు.. అసలేంటి కథ..?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే జరుగుతోంది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రైవేటీకరణ వద్దు అంటున్నాయి. అయితే కేంద్రం మాత్రం తగ్గేేదే లేదని స్పష్టం చేసింది. కానీ ఏపీలో వస్తున్న వ్యతిరేకతను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషిస్తోంది. ఈ క్రమంలోనే టాటా కంపెనీ వైజాగ్ స్టీల్ ని కొనేందుకు ఆసక్తి చూపిస్తుందనే విషయం మరింత ఆసక్తిగా మారింది. టాటాలకు ఏంటి […]

విశాఖ ఉక్కు కొనుగోలు రేసులో టాటాలు.. అసలేంటి కథ..?
X

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే జరుగుతోంది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రైవేటీకరణ వద్దు అంటున్నాయి. అయితే కేంద్రం మాత్రం తగ్గేేదే లేదని స్పష్టం చేసింది. కానీ ఏపీలో వస్తున్న వ్యతిరేకతను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషిస్తోంది. ఈ క్రమంలోనే టాటా కంపెనీ వైజాగ్ స్టీల్ ని కొనేందుకు ఆసక్తి చూపిస్తుందనే విషయం మరింత ఆసక్తిగా మారింది.

టాటాలకు ఏంటి ఆసక్తి..?
ప్రైవేటు రంగంలో టాటా స్టీల్ కు తిరుగులేని ఆధిపత్యం ఉంది. 113 ఏళ్ల క్రితమే జంషెడ్ పూర్ లో టాటా స్టీల్ ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటి వరకు విజయవంతంగా కంపెనీని నిర్వహిస్తున్నారు. విస్తరణకోసం ప్రయత్నాలు చేసినా, మిగతా కంపెనీలను మింగేయాలనే ఆలోచన ఎప్పుడూ ‘టాటా’ చేయలేదు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కోసం టాటా కంపెనీ ఆసక్తి చూపిస్తున్నట్టు ఆ కంపెనీ సీఈఓ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ స్పష్టం చేశారు. తూర్పు తీరంలో ఉన్న వైజాగ్ స్టీల్ ని కొనుగోలు చేస్తే తమకు అనేక ప్రయోజనాలున్నట్టు ఆయన తెలిపారు.

కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో సంబంధం ఉందా..?
ఇటీవలే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, టాటా కంపెనీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “మీ లాంటి సంస్థ.. రెండుమూడు విదేశీ కంపెనీలను కొనుగోలు చేసి ఉండవచ్చు. అయితే వాటి ప్రాధాన్యం దేశ ప్రయోజనాల కన్నా ఎక్కువయిందా?” అని ప్రశ్నించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సులో ప్రసంగించిన ఆయన, దేశంలోని పరిశ్రమల వ్యవహార శైలి జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. పీయూష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది. ‘టాటా’ల దేశభక్తిని ప్రశ్నించేందుకు గోయల్ కి ఉన్న అర్హత ఏంటని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. మేక్ ఇన్ ఇండియాని సమర్థంగా అమలు చేస్తున్న టాటా వంటి కంపెనీలపై దాడి చేయడం మోదీ ప్రభుత్వ కొత్త నిర్ణయమా అని దుయ్యబట్టారు. గోయల్ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత రోజుల వ్యవధిలోనే టాటా కంపెనీ వైజాగ్ స్టీల్ కొనుగోలుపై ఆసక్తి వ్యక్తీకరించడం గమనార్హం.

ఉద్యోగుల అసంతృప్తిని తగ్గించేందుకేనా..?
ప్రైవేటీకరణ పేరుతో మోదీ ప్రభుత్వం తమ సన్నిహితులకు, గుజరాత్ వ్యాపారులకు అన్ని కంపెనీల్లో వాటాలు కట్టబెడుతుందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ని కూడా అలాగే ఏ విదేశీ కంపెనీకో లేక, మోదీ స్నేహితులు వాటాదారులుగా ఉన్న కంపెనీలకో అమ్మేస్తారని కూడా అంటున్నారు. దీంతో తమకు ఉద్యోగ భద్రత ఉండదని ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఇప్పుడు సడన్ టాటా కంపెనీ తెరపైకి రావడంతో ఈ ఆందోళనలు తగ్గుతాయనే అంచనాలున్నాయి. వైజాగ్ స్టీల్ తో పాటు, ఒడిశాలోని “నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్”ని కొనుగోలు చేసేందుకు కూడా ఇటీవలే టాటా స్టీల్ ఆసక్తి వ్యక్తీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తూర్పు తీరంలో ఉన్న వైజాగ్ స్టీల్ కూడా టాటాల చేతుల్లోకి వెళ్తుందనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Next Story