Telugu Global
NEWS

మళ్లీ పాతరోజులు.. సర్కారీ బడికి జేజేలు..

ఒకప్పుడు అందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నవారే, కానీ రాను రాను సర్కారు బడులపై మోజు తగ్గింది, ఇంగ్లిష్ మీడియం చదువులపై ఆశ పెరిగింది. ప్రైవేట్ సెక్టార్ లో కార్పొరేట్ మాయాజాలం, ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల లేమి.. వెరసి పేదలు కూడా ఫీజులకోసం అప్పులు చేసి మరీ పిల్లల్ని కాన్వెంట్ లలో చేర్చే పరిస్థితి వచ్చింది. కానీ కరోనా కాలంలో ఈ వ్యవహారం తారుమారవుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి, సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ఏపీలో కరోనాకి […]

మళ్లీ పాతరోజులు.. సర్కారీ బడికి జేజేలు..
X

ఒకప్పుడు అందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నవారే, కానీ రాను రాను సర్కారు బడులపై మోజు తగ్గింది, ఇంగ్లిష్ మీడియం చదువులపై ఆశ పెరిగింది. ప్రైవేట్ సెక్టార్ లో కార్పొరేట్ మాయాజాలం, ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల లేమి.. వెరసి పేదలు కూడా ఫీజులకోసం అప్పులు చేసి మరీ పిల్లల్ని కాన్వెంట్ లలో చేర్చే పరిస్థితి వచ్చింది. కానీ కరోనా కాలంలో ఈ వ్యవహారం తారుమారవుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి, సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.

ఏపీలో కరోనాకి ముందే మార్పు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అమ్మఒడి’ ఆర్థిక సాయం కేవలం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకే ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో చాలామంది తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ మాన్పించి, ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. ఆ తర్వాత ఆ పథకాన్ని అందరికీ వర్తింపజేసింది ప్రభుత్వం. జగనన్న విద్యాకానుక పేరుతో ఉచితంగా బుక్స్, బ్యాగ్, యూనిఫాం, షూ.. ఇలా అన్ని వస్తువులు అందించడం, ఇంగ్లిష్ మీడియం బోధనకు రంగం సిద్ధం చేయడం, నాడు-నేడు పనులతో ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడులు తయారు కావడంతో విద్యార్థుల వలస ఇంకా కొనసాగుతోంది.

తెలంగాణలో కరోనా తర్వాత పెనుమార్పు..
కరోనా కష్టకాలంలో కూడా ఆన్ లైన్ చదువుల పేరుతో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులకోసం ఒత్తిడి పెంచడంతో చాలా చోట్ల తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్స్ మాన్పించేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,39,449 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఒకటో తరగతిలోనే 1,25,034 అడ్మిషన్లు జరిగాయి. ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు 1,14,415 మంది ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2021–22 విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రెండు నెలల వ్యవధిలోనే భారీ సంఖ్యలో పిల్లలు సర్కారు బడుల్లో చేరుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 10% విద్యార్థులు అదనంగా అడ్మిషన్లు తీసుకున్నారని అన్నారు. 2019–20 విద్యా సంవత్సరంలో ఒకటినుంచి 12వ తరగతి వరకు 68,813 కొత్త ప్రవేశాలు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు మూడున్నర రెట్లు అడ్మిషన్లు జరగడం గమనార్హం. బడులు పూర్తిగా తెరిస్తే రెట్టింపు ప్రవేశాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఫీజుల బాదుడుతో ప్రైవేటుకి రాంరాం..
ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలోనూ, ప్రైవేట్ స్కూళ్లలోనూ బోధన ఆన్ లైన్ లోనే జరుగుతోంది. ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభిస్తుండగా, తెలంగాణలో సెప్టెంబర్ 1నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయని సమాచారం. అయితే ఆన్ లైన్ బోధనకోసం కూడా ప్రైవేట్ పాఠశాలలు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. సకాలంలో ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఆన్ లైన్ టీచింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉండటం, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యాసంస్థల వైపు మొగ్గుచూపుతున్నారు.

First Published:  13 Aug 2021 10:07 PM GMT
Next Story