Telugu Global
Health & Life Style

పిల్లలకి కరోనా ప్రాణాంతకం కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ తోనే సమస్యలన్నీ..

చిన్నారులపై కరోనా ప్రభావం అనే విషయంపై ఇప్పటికే చాలా పరిశోధనలు, అధ్యయనాలు, సర్వేలు జరిగాయి. 18ఏళ్లలోపు వారిలో కరోనా మరణాల శాతం తక్కువ. అందులోనూ 10ఏళ్లలోపు పిల్లలు కరోనా బారినపడి శ్వాస సమస్యలతో చనిపోయారన్న ఉదాహరణలు భారత్ లో ఎక్కడా లేవు. కానీ చిన్నపిల్లలకు కూడా కరోనా సోకిందని, లక్షణాలేవీ లేకుండానే వారిలో వైరస్ లోడ్ తగ్గిపోయిందని మాత్రం పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక మూడోవేవ్ కన్ను కూడా పూర్తిగా చిన్నపిల్లలపై ఉందనే పుకారు కూడా అబద్ధమని […]

పిల్లలకి కరోనా ప్రాణాంతకం కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ తోనే సమస్యలన్నీ..
X

చిన్నారులపై కరోనా ప్రభావం అనే విషయంపై ఇప్పటికే చాలా పరిశోధనలు, అధ్యయనాలు, సర్వేలు జరిగాయి. 18ఏళ్లలోపు వారిలో కరోనా మరణాల శాతం తక్కువ. అందులోనూ 10ఏళ్లలోపు పిల్లలు కరోనా బారినపడి శ్వాస సమస్యలతో చనిపోయారన్న ఉదాహరణలు భారత్ లో ఎక్కడా లేవు. కానీ చిన్నపిల్లలకు కూడా కరోనా సోకిందని, లక్షణాలేవీ లేకుండానే వారిలో వైరస్ లోడ్ తగ్గిపోయిందని మాత్రం పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక మూడోవేవ్ కన్ను కూడా పూర్తిగా చిన్నపిల్లలపై ఉందనే పుకారు కూడా అబద్ధమని తేలిపోతోంది. ఈ దశలో చిన్నారుల్లో కరోనా అనే అంశంపై పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) చేసిన ఓ అధ్యయనం కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది.

కరోనా వైరస్ కొంతమంది చిన్నపిల్లల్లో వారి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ అధ్యయనం పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌లో పిల్లల్లో ఉన్నట్టుండి కాలేయ వాపు లక్షణాలు బయటపడినట్లు తెలిపింది. కరోనా వైరస్‌ వచ్చి తగ్గిపోయిన చిన్నారుల్లో కొంతమంది హెపటైటిస్ బారిన పడ్డారని పీజీఐఎంఈఆర్ అధ్యయనంలో తేలింది. మరి కొందరు చిన్నారుల గుండె, రక్తనాళాలు, కళ్లు, చర్మం వంటి అవయవాలను వైరస్ ప్రభావితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రభావాన్నే మల్టీసిస్టమ్‌ ఇన్‌ ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌(మిస్సీ)గా ఇదివరకే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు పీజీఐఎంఈఆర్ పరిశోధన దీనికి మరింత బలం చేకూర్చింది. మూడో వేవ్ లో చిన్నారులే కరోనాకు ప్రధాన టార్గెట్ అయినా, కాకపోయినా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అత్యవసరం. వైరస్ ప్రాణం తీయకపోయినా.. అంతకు మించి మన శరీర అవయవాలను ప్రభావితం చేస్తోంది. వాటి పనితీరుని క్షీణింపజేస్తోందనే విషయం తేలిపోయింది.

మూడు నుంచి ఆరు వారాల వరకు కొవిడ్‌ వైరస్ తో బాధపడిన కొందరు పిల్లల్లో హెపటైటిస్ లక్షణాలు కనిపించాయి. వీరిలో 90శాతం మందికి కొవిడ్ లక్షణాలు లేకపోవడం గమనార్హం. వారి కుటుంబంలో కూడా ఎవరికీ కాలేయానికి సంబంధించిన జబ్బులు లేవు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇలాంటి సమస్యలేవీ పెద్దగా బయటపడలేదు, ఆ దిశగా జరిగిన అధ్యయనాలు కూడా తక్కువే. అయితే సెకండ్ వేవ్ లో మాత్రం కరోనా వచ్చిన చిన్నారులపై జరిపిన పరిశోధనలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. పిల్లల్లో వైరస్ లక్షణాలు కనపడకపోయినా, వారి అంతర్గత అవయవాల పనితీరుపై వైరస్ తీవ్ర ప్రభావితం చూపుతోందని తెలింది.

First Published:  10 Aug 2021 8:46 PM GMT
Next Story