Telugu Global
NEWS

ఆగస్ట్ 15 తర్వాత స్కూల్స్.. తెలంగాణ విద్యాశాఖ ప్రతిపాదన

ఇప్పటి వరకూ ఆన్ లైన్ పాఠాలతో సరిపెట్టిన తెలంగాణ విద్యాశాఖ తరగతి గతి బోధనకు సిద్ధపడుతోంది. ఆగస్ట్ 15 తర్వాత స్కూల్స్ తెరిచేందుకు ఓ నివేదిక రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దీనిపై ఈనెల 1న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వం పక్కనపెట్టింది. దీంతో మరోసారి స్కూల్స్ తెరిచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటోంది విద్యాశాఖ. ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ వెనుకబడిపోకూడదన్న ఉద్దశంతో విద్యాశాఖ […]

ఆగస్ట్ 15 తర్వాత స్కూల్స్.. తెలంగాణ విద్యాశాఖ ప్రతిపాదన
X

ఇప్పటి వరకూ ఆన్ లైన్ పాఠాలతో సరిపెట్టిన తెలంగాణ విద్యాశాఖ తరగతి గతి బోధనకు సిద్ధపడుతోంది. ఆగస్ట్ 15 తర్వాత స్కూల్స్ తెరిచేందుకు ఓ నివేదిక రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దీనిపై ఈనెల 1న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వం పక్కనపెట్టింది. దీంతో మరోసారి స్కూల్స్ తెరిచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటోంది విద్యాశాఖ. ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ వెనుకబడిపోకూడదన్న ఉద్దశంతో విద్యాశాఖ కసరత్తులు ముమ్మరం చేసింది.

ఏపీలో ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం అవుతాయి. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేస్తూ, అదే రోజు రెండో దశ నాడు-నేడు ప్రారంభిస్తూ.. తరగతి గతి బోధన కూడా తిరిగి మొదలయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇప్పుడు తెలంగాణ కూడా అదే మహూర్తాన్ని ఎంచుకోవాలని చూస్తోంది. ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణలో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా లేవు. అక్కడ నైట్ కర్ఫ్యూ కూడా లేదు. అన్నిటికీ అనుమతులున్నాయి. కానీ స్కూల్స్ మాత్రం తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ఇటు ఏపీలో నైట్ కర్ఫ్యూతోపాటు చాలా చోట్ల పాక్షిక లాక్ డౌన్ అమలవుతోంది. అయినా కూడా విద్యార్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని ఈనెల 16నుంచి స్కూల్స్ తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. దీంతో తెలంగాణ విద్యాశాఖ కూడా త్వరపడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో స్కూల్స్ తెరిచి, తెలంగాణలో మాత్రం మూసివేస్తే.. ఇబ్బందికర పరిణామాలుంటాయని అంచనా వేస్తోంది.

తమిళనాడులో సెప్టెంబరు 1 నుంచి 9-12 తరగతులను 50 శాతం విద్యార్థులతో నడపాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కర్నాటకలో ఈనెల 23 నుంచి రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించబోతున్నారు. యూపీ, మహారాష్ట్రల్లో కూడా ఈనెల 16 తర్వాత స్కూల్స్ మొదలవుతాయి. అయితే సగం మంది విద్యార్థులు ఒకరోజు, మిగతా సగం మరో రోజు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒడిశా లో ఆల్రడీ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేస్తోంది. గతంలో స్కూల్స్ తెరిచేందుకు ప్రయత్నించినా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీంతో రెండోసారి ఆ సాహసం చేసేందుకు తీవ్రంగా ఆలోచిస్తోంది.

First Published:  9 Aug 2021 10:10 PM GMT
Next Story