Telugu Global
National

ముహూర్తాలక్కర్లేదు.. సోషల్ మీడియాకు కళ్లెం వేయాల్సిందే..

గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పట్లో మోదీ ప్రాభవాన్ని చాటిచెప్పి, దేశానికి అతని అవసరం ఉందని నొక్కి వక్కాణించింది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో జరిగిన విపరీత ప్రచారం వల్లే అందరు సీనియర్లను పక్కకు తప్పించి, మోదీ ప్రధాని పీఠం ఎక్కారు. కానీ ఇప్పుడా సోషల్ మీడియానే ఆయన శతృవుగా భావిస్తున్నారు. సోషల్ మీడియాపై కేంద్రం ఆంక్షలు విధించడం ఇందులో భాగమే. సోషల్ మీడియా సెగ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి కూడా గట్టిగానే తగులుతోంది. వచ్చే […]

ముహూర్తాలక్కర్లేదు.. సోషల్ మీడియాకు కళ్లెం వేయాల్సిందే..
X

గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పట్లో మోదీ ప్రాభవాన్ని చాటిచెప్పి, దేశానికి అతని అవసరం ఉందని నొక్కి వక్కాణించింది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో జరిగిన విపరీత ప్రచారం వల్లే అందరు సీనియర్లను పక్కకు తప్పించి, మోదీ ప్రధాని పీఠం ఎక్కారు. కానీ ఇప్పుడా సోషల్ మీడియానే ఆయన శతృవుగా భావిస్తున్నారు. సోషల్ మీడియాపై కేంద్రం ఆంక్షలు విధించడం ఇందులో భాగమే. సోషల్ మీడియా సెగ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి కూడా గట్టిగానే తగులుతోంది. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో యోగిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, 2022 ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా యోగికి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. దీంతో ఆయన కూడా సోషల్ మీడియాపై పగబట్టారు.

“ప్రస్తుతం సోషల్ మీడియా, కళ్లెం లేని గుర్రంలా ఉంది. ముహూర్తాలు చూడకుండా దానికి కళ్లెం వేయాల్సిందే” అని బీజేపీ నేతలకు ఉపదేశమిచ్చారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. బీజేపీ ఐటీ, సోషల్‌ మీడియా విభాగం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రింట్‌, టీవీ మీడియాకు యజమానులు, సంపాదకులు ఉంటారని, సోషల్‌ మీడియాను నియంత్రించడానికి ఎవరూ ఉండరని చెప్పారు. అప్రమత్తంగా లేకపోతే దాని బారినపడతారని హెచ్చరించారు. 2019 ఎన్నికలకు ముందుగా రాఫెల్ గురించి ప్రతిపక్షాలు ప్రస్తావించాయని, దాన్ని సోషల్ మీడియా హైలెట్ చేసిందని, కానీ ప్రజలు వారి మాటలు నమ్మలేదని చెప్పారు యోగి. తాజాగా పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోయే ముందు పెగాసస్ వ్యవహారాన్ని సోషల్ మీడియా హైలెట్ చేసిందని, ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయని అన్నారు. యూపీలో ఓ స్థానిక ఘటనపై విదేశాల్లో సోషల్‌ మీడియాలో విచారణ ప్రారంభించారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సోషల్ మీడియాకు కళ్లెం వేయాలని చెప్పారు యోగి.

“కళ్లెం లేని గుర్రం” అంటూ యోగి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడై వైరల్ గా మారాయి. సోషల్ మీడియాపై బీజేపీ కక్షగట్టిందనడానికి ఇదే మరో ఉదాహరణ అంటూ కాంగ్రెస్ విమర్శలు మొదలు పెట్టింది. మీడియాని తన అధీనంలో పెట్టుకున్నారని, కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా వాస్తవాలు వెలుగులోకి వస్తాయనుకుంటే, దానిపై కూడా ఆంక్షలు విధిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

First Published:  8 Aug 2021 1:22 AM GMT
Next Story