Telugu Global
National

అప్పుడు అనుమానించారు.. ఇప్పుడు శభాష్ అంటున్నారు..

శాస్త్ర పరిశోధనల్లో ఎప్పుడూ తొలి అడుగు విజయంవైపు పడదు. పరాజయాలు పలకరించాలి, విమర్శలు ఎదుర్కోవాలి, చీత్కారాలను తట్టుకోవాలి. అలా తట్టుకుని నిలబడగలిగినవారే ఆ తర్వాత ప్రపంచం గుర్తించే మేధావులు అవుతారు. అలాంటి వారిలో ఒకరు కటాలిన్ కరికో. ఎం-ఆర్ఎన్ఏ టెక్నాలజీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన శాస్త్రవేత్త ఆమె. తొలుత ఆమె పరిశోధనలు అందరూ అనుమానించారు. ఎం-ఆర్ఎన్ఏ టెక్నాలజీ అసాధ్యం అన్నారు. ప్రొటీన్లతో ఆర్ఎన్ఏ ని చొప్పించి వైరస్ ని ఎదుర్కోవడం అసలు కుదిరే పని కాదన్నారు. ఎన్నో […]

అప్పుడు అనుమానించారు.. ఇప్పుడు శభాష్ అంటున్నారు..
X

శాస్త్ర పరిశోధనల్లో ఎప్పుడూ తొలి అడుగు విజయంవైపు పడదు. పరాజయాలు పలకరించాలి, విమర్శలు ఎదుర్కోవాలి, చీత్కారాలను తట్టుకోవాలి. అలా తట్టుకుని నిలబడగలిగినవారే ఆ తర్వాత ప్రపంచం గుర్తించే మేధావులు అవుతారు. అలాంటి వారిలో ఒకరు కటాలిన్ కరికో. ఎం-ఆర్ఎన్ఏ టెక్నాలజీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన శాస్త్రవేత్త ఆమె. తొలుత ఆమె పరిశోధనలు అందరూ అనుమానించారు. ఎం-ఆర్ఎన్ఏ టెక్నాలజీ అసాధ్యం అన్నారు. ప్రొటీన్లతో ఆర్ఎన్ఏ ని చొప్పించి వైరస్ ని ఎదుర్కోవడం అసలు కుదిరే పని కాదన్నారు. ఎన్నో అవాంతరాలు, ప్రోత్సాహమిచ్చేవారే కరువయ్యారు, చివరకు పరిశోధనలకు ఆర్థిక సాయం కూడా లేని పరిస్థితి. అలాంటి దశనుంచి ఒంటరిగా తన పోరాటం సాగించి ఇప్పుడు ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది కటాలిన్ కరికో.

ఎవరీ కటాలిన్, ఎందుకీ పరిశోధనలు..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కి విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషిచేస్తున్నారు. రోజు రోజుకీ కొత్త లక్షణాలు, సరికొత్త వేరియంట్లు, రూపు మార్చుకుంటున్న వైరస్ రూపం.. శాస్త్రవేత్తలకు సవాళ్లు విరుతున్నాయి. అయినా కూడా వైరస్ పీడ విరగడ చేసే పనిలో మహిళా శాస్త్రవేత్తలు తమ సత్తా చూపించారు. ఆస్ట్రాజెనెకా(భారత్ లో కొవిషీల్డ్) వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించిన సారా గిల్బర్ట్ ఓ మహిళ. భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్ టీకా టీమ్ లో కె.సుమతి ముఖ్యురాలు. జాన్సన్ టీకా వెనక ఉన్న డచ్ వైరాలజిస్ట్ హెన్నెక్ షూమాకర్, స్పుత్నిక్-వి తయారీలో భాగస్వామురాలైన ఎలెనా సోలైర్చంక్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కరోనా కట్టడిలో మహిళల పాత్ర ఎన్నదగినది. వారందరిలో మేటి అనిపించుకుంటున్నారు కటాలిన్ కరికో. హంగేరియా మూలాలున్న డాక్టర్ కరికో అమెరికాలో స్థిరపడ్డారు. ఫైజర్ బయో-ఎన్- టెక్ వ్యాక్సిన్ తయారీలో ఆమె కీలకంగా వ్యవహరించారు. అంతే కాదు, బయోటెక్నాలజీ విభాగంలో ఓ గొప్ప సంచలనం అని చెప్పుకుంటున్న ఎం-ఆర్ఎన్ఏ టెక్నాలజీని అభివృద్ధి చేసింది కూడా ఆవిడే.

ఎం-ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో తయారైన టీకాలు వ్యాధి నిరోధక ప్రొటీన్లు ఎలా ఉత్పత్తి చేసుకోవాలో శరీరానికి నేర్పుతాయి. కోవిడ్‌ విషయంలో ఈ టీకాలు వైరస్‌ జన్యుక్రమం చుట్టూ పరుచుకుని ఉండే కొమ్ములను కణాల ద్వారా తయారు చేస్తాయి. దీనిపై చాలా కాలంగా ప్రయోగాలు జరుగుతున్నా.. వాటికి ఓ తుదిరూపునిచ్చింది డాక్టర్ కటాలిన్. ఎం-ఆర్ఎన్ఏ టెక్నాలజీతో పైజర్ కంపెనీ తయారు చేసిన టీకావెనక ఆమె కృషి చాలా ఉంది ఆ తర్వాత మోడెర్నా కంపెనీ కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుంది. ప్రస్తుతం ఈ రెండు వ్యాక్సిన్లు కొవిడ్ పై సమర్థంగా పనిచేస్తాయని సర్వేలు చెబుతున్నాయి.

నోబెల్ గ్యారెంటీ..
ప్రపంచమంతా ఇప్పుడు కరోనాకు ముందు, కరోనాకి తర్వాత అన్నట్టుగా తయారైంది. రాబోయే రోజుల్లో కరోనా నివారణకోసం తయారు చేసే వ్యాక్సిన్లకే అత్యంత ప్రాముఖ్యత ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో డాక్టర్ కటాలిన్ కి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్యారెంటీ అనే సంకేతాలందుతున్నాయి.

First Published:  5 Aug 2021 10:41 PM GMT
Next Story