Telugu Global
National

దేవేగౌడతో సీఎం భేటీ.. కన్నడనాట మారుతున్న రాజకీయ సమీకరణాలు..!

కన్నడనాట రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రజలు ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపి విజయాన్ని అందిస్తుంటారు. అయితే కర్ణాటకలో పరిస్థితి ఇలా ఉండదు. ఆ రాష్ట్రంలో ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కవు. అందుకే అక్కడ ఎక్కువగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని […]

దేవేగౌడతో సీఎం భేటీ.. కన్నడనాట మారుతున్న రాజకీయ సమీకరణాలు..!
X

కన్నడనాట రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రజలు ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపి విజయాన్ని అందిస్తుంటారు. అయితే కర్ణాటకలో పరిస్థితి ఇలా ఉండదు. ఆ రాష్ట్రంలో ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కవు. అందుకే అక్కడ ఎక్కువగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

అయితే ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవల వయసు కారణం చూపి బీజేపీ అధిష్టానం యడియూరప్పను పదవి నుంచి దింపి బసవరాజ్ బొమ్మై ని ముఖ్యమంత్రిని చేసింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తాజాగా జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ అయ్యారు. ఇది కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీజేపీ అధిష్టానం సూచన మేరకే ముఖ్యమంత్రి మాజీ ప్రధాని దేవేగౌడను కలుసుకున్నారని బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యే బసన గౌడ పాటిల్ యత్నాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తిరుగుబావుటా ఎగురవేసిన బీజేపీ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకే బీజేపీ అధిష్టానం ఈ వ్యూహరచన చేసినట్లు పేర్కొన్నారు. బొమ్మైతో భేటీ అనంతరం కష్ట సమయంలో ఆదుకుంటామని మాజీ ప్రధాని దేవేగౌడ చేసిన వ్యాఖ్యలే బీజేపీ, జేడీఎస్ పార్టీలు దగ్గర అవుతున్నాయనడానికి ఉదాహరణ అని ఆయన అన్నారు.

అయితే బసనగౌడ చేసిన వ్యాఖ్యలను దేవేగౌడ తనయుడు, మాజీ మంత్రి రేవణ్ణ కొట్టిపారేశారు. ప్రభుత్వం చేపట్టే మంచి పనులకు నిర్మాణాత్మక సహకారం ఉంటుందని అర్థం తోనే దేవేగౌడ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. సీఎం బొమ్మై దేవేగౌడ తో భేటీ కావడం కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణలకు ముందస్తు సంకేతాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో జేడీఎస్, బీజేపీ మిత్రపక్షాలు గానే ఉన్నాయి. బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో దేవేగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. అధికారాన్ని పంచుకోవడంలో తలెత్తిన విభేదాలతో ఆ రెండు పార్టీలు అప్పట్లో దూరమయ్యాయి. మళ్లీ ఇప్పుడు రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

First Published:  4 Aug 2021 2:40 AM GMT
Next Story