Telugu Global
National

లాక్ డౌన్ దిశగా భారత్..? 46 జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గకముందే తిరగబెట్టందా? లేదా థర్డ్ వేవ్ వచ్చేసిందా? అనే విషయాలను పక్కనపెడితే.. దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాలను హాట్ స్పాట్ లుగా చెబుతుండటంతో సరిహద్దు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా 46 జిల్లాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన కేంద్రం.. ఆయా ప్రాంతాల్లో కఠినంగా కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. 46 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి పైగా ఉందని […]

లాక్ డౌన్ దిశగా భారత్..? 46 జిల్లాల్లో కఠిన ఆంక్షలు..
X

కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గకముందే తిరగబెట్టందా? లేదా థర్డ్ వేవ్ వచ్చేసిందా? అనే విషయాలను పక్కనపెడితే.. దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాలను హాట్ స్పాట్ లుగా చెబుతుండటంతో సరిహద్దు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా 46 జిల్లాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన కేంద్రం.. ఆయా ప్రాంతాల్లో కఠినంగా కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. 46 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి పైగా ఉందని లెక్క తేల్చింది. మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికి దగ్గరగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 10రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది. ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది.

ఓ దశలో దేశవ్యాప్తంగా 25 వేలకు తగ్గిపోయిన రోజువారీ కరోనా కేసులు వారం రోజులుగా పైకి ఎగబాకుతున్నాయి. 40రోజుల మార్కుని దాటుతూనే ఉన్నాయి. దీంతో కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రాలు కొవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలని సూచించింది. జిల్లాస్థాయిలో పరిస్థితులను తెలుసుకొనేందుకు రాష్ట్రాలు స్థానికంగా సీరో సర్వే నిర్వహించాలని కోరింది. కొవిడ్‌ తో చనిపోతున్న వారిలో 80శాతం మంది 45 ఏళ్లు పైబడిన వారే ఉంటున్నందున ఆ వర్గాలకు వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని సూచించింది.

ఆంక్షలు ఇలా..
– 10శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదవుతున్న జిల్లాల్లో ప్రజల కదలికలు, గుంపులుగా చేరడం, పరస్పరం కలుసుకోవడం లాంటి వాటిపై కఠిన ఆంక్షలు.
– కరోనా పాజిటివ్ నిర్థారణ అయినవారు బయట తిరగకుండా ఆంక్షలు, పాజిటివ్ రోగులు హోమ్ ఐసోలేషన్లో అయినా ఉండాలి, లేదా ఆస్పత్రుల్లో అయినా ఉండాలని నిబంధన
– ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలి. ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్షించి, తక్షణం ప్రారంభమయ్యేలా చూడాలి.
– ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కేసుల మ్యాపింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఆధారంగా కంటైన్మెంట్ జోన్లను అమలు చేయాలి.

వణికిస్తున్న కేరళ..
కేరళలో నిత్యం 20వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. గత ఐదురోజులుగా ఇదే పరిస్థితి. దీంతో కేరళలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 12.31శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 64వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉందని.. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ నుంచి రాష్ట్రం విముక్తి కాలేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. కేరళలో ఇంకా సగం మందికి వైరస్‌ బారినపడే ముప్పు పొంచివుందన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ అందరికీ అందేనాటికే థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అటు తమిళనాడులో కూడా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి, ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఈ దశలో కేంద్రం చొరవ తీసుకుని రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేసింది.

First Published:  31 July 2021 9:35 PM GMT
Next Story