Telugu Global
National

కేరళ బాటలో తమిళనాడు.. ఆగస్ట్ 9వరకు లాక్ డౌన్..

కేరళతో సరిహద్దుని పంచుకుంటున్న తమిళనాడు రాష్ట్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రెండు రోజులుగా స్వల్ప స్థాయిలో కేసులు పెరగడంతో కేరళ సరిహద్దుల వద్ద పహారా పెంచింది. సరిహద్దు దాటి వచ్చేవారికి కొవిడ్ లక్షణాలుంటే అక్కడినుంచే తిప్పి పంపించేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ ని ఆగస్ట్ 9వరకు పొడిగిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ గడువు ఈరోజుతో […]

కేరళ బాటలో తమిళనాడు.. ఆగస్ట్ 9వరకు లాక్ డౌన్..
X

కేరళతో సరిహద్దుని పంచుకుంటున్న తమిళనాడు రాష్ట్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రెండు రోజులుగా స్వల్ప స్థాయిలో కేసులు పెరగడంతో కేరళ సరిహద్దుల వద్ద పహారా పెంచింది. సరిహద్దు దాటి వచ్చేవారికి కొవిడ్ లక్షణాలుంటే అక్కడినుంచే తిప్పి పంపించేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ ని ఆగస్ట్ 9వరకు పొడిగిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ గడువు ఈరోజుతో పూర్తవుతుండగా.. దాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆంక్షలు కఠినం..
తమిళనాడులో ఉదయం 6గంటలనుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఉంది. ప్రస్తుతం ఆ వెసులుబాటుని మరో గంట పొడిగించారు. రాత్రి 9 తర్వాత ఎలాంటి జనసంచారానికి, వ్యాపారాలకు అనుమతి లేదు. ఇక ప్రజా రవాణా విషయంలో కూడా కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. కేవలం 50శాతం సీటింగ్ తోనే బస్సులు, ఆటోలు నడపాల్సి ఉంటుంది. హోటల్స్ లో కూడా 50శాతం ఆక్యుపెన్సీ రూల్ అమలవుతోంది. స్కూళ్లు, కాలేజీలు, స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్లు, బార్లు.. తెరిచేందుకు అనుమతి లేదు. ఐటీ కార్యాలయాల్లో కూడా 50శాతం మంది సిబ్బంది మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. వివాహాలకు 50మంది, అంత్యక్రియల కార్యక్రమాలకు 20మందికి మాత్రమే అనుమతి ఉంది.

దక్షిణాదిన థర్డ్ వేవ్ భయం..
థర్డ్ వేవ్ ముప్పుతో ముందుగా దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది. కేరళలో వారాంతపు పూర్తి లాక్ డౌన్ ప్రస్తుతం అమలులో ఉంది. అక్కడ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇక ఏపీలో నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా తమిళనాడులో కూడా లాక్ డౌన్ ని ఆగస్ట్ 9వరకు పొడిగించారు. థర్డ్ వేవ్ భయాలతో ఈ దఫా దక్షిణాది రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉన్నట్టు స్పష్టమైంది.

First Published:  30 July 2021 9:50 PM GMT
Next Story