Telugu Global
National

కలవరపెడుతున్న ఆర్-ఫ్యాక్టర్.. థర్డ్ వేవ్ కి మరో సంకేతం..

థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది, ఎన్నాళ్లుంటుంది, ఎంత ఉత్పాతం సృష్టిస్తుంది అనే దానిపై ఇప్పటి వరకూ స్పష్టమైన సమాచారం లేకపోయినా.. దాని రాకను సూచించే సంకేతాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు అర్థమవుతోంది. కేరళలో ఒక్కసారిగా కేసులు పెరగడంతోపాటు.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆర్-ఫ్యాక్టర్(రీ ప్రొడక్షన్ రేట్) పెరగడంపై తీవ్ర ఆందోళన నెలకొంది. గతంలో సెకండ్ వేవ్ పెరుగుదలను కూడా ఈ ఆర్-ఫ్యాక్టర్ కచ్చితంగా సూచించింది. ఇప్పుడు మరోసారి ఈ రీ ప్రొడక్షన్ రేట్ గణాంకాల్లో పెరుగుదల మరో […]

కలవరపెడుతున్న ఆర్-ఫ్యాక్టర్.. థర్డ్ వేవ్ కి మరో సంకేతం..
X

థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది, ఎన్నాళ్లుంటుంది, ఎంత ఉత్పాతం సృష్టిస్తుంది అనే దానిపై ఇప్పటి వరకూ స్పష్టమైన సమాచారం లేకపోయినా.. దాని రాకను సూచించే సంకేతాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు అర్థమవుతోంది. కేరళలో ఒక్కసారిగా కేసులు పెరగడంతోపాటు.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆర్-ఫ్యాక్టర్(రీ ప్రొడక్షన్ రేట్) పెరగడంపై తీవ్ర ఆందోళన నెలకొంది. గతంలో సెకండ్ వేవ్ పెరుగుదలను కూడా ఈ ఆర్-ఫ్యాక్టర్ కచ్చితంగా సూచించింది. ఇప్పుడు మరోసారి ఈ రీ ప్రొడక్షన్ రేట్ గణాంకాల్లో పెరుగుదల మరో ప్రమాదానికి హెచ్చరికలా మారింది.

1కి చేరువవుతున్న ఆర్ ఫ్యాక్టర్
100మంది కరోనా రోగులనుంచి ఎంతమందికి ఆ వైరస్ వ్యాపిస్తుంది అని తెలిపేదే ఆర్-ఫ్యాక్టర్. 100మంది రోగులనుంచి మరో 100మందికి ఇది వ్యాపిస్తే దాని రేటు 1గా ఉంటుంది. కేవలం మరో 50మంది మాత్రమే ఇది సోకితే ఆర్-ఫ్యాక్టర్ రేటు 0.5గా గణిస్తారు. 1దాటితే ఇది ప్రమాదమే. అంటే కరోనా రోగులెవరూ ఇళ్లల్లో ఉండటంలేదని, జనాల్లోకి వచ్చేస్తున్నారని, సామాజిక వ్యాప్తి భారీగా జరుగుతోందనే విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం కేరళ, ఈశాన్య రాష్ట్రాలతోపాటు పుణె, ముంబైలో కూడా ఆర్-ఫ్యాక్టర్ 1కి చేరింది.

దేశంలో కొవిడ్‌ సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న దశలో (మార్చి 9 – ఏప్రిల్‌ 21 మధ్య) ఆర్‌-ఫ్యాక్టర్‌ 1.37గా ఉండేది. క్రమేపీ తగ్గుతూ జూన్‌ 26 నాటికి 0.78కి చేరింది. జులైలో లాక్ డౌన్ నిబంధనలు ఒక్కసారిగా సడలించడంతో మళ్లీ కేసుల పెరుగుదల మొదలైంది. ఆర్-ఫ్యాక్టర్ ఏకంగా 0.95కి పెరిగింది. కేరళలో ఆర్‌-ఫ్యాక్టర్‌ 1.11 ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, మణిపూర్‌ మినహా మిగిలిన అన్నిచోట్ల 1 దాటింది. ఉత్తరాఖండ్‌ లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో వచ్చే రెండు వారాల్లో ఆయా ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని చెన్నైలోని ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ బృందం తెలిపింది.

పెరుగుతున్న కేసులు..
దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య మరోసారి 43 వేలు దాటింది. వరుసగా రెండురోజులు యాక్టివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షలు దాటింది. వీటిలో కేరళ వాటా 1.54 లక్షలు. దేశంలోని మొత్తం క్రియాశీలక కేసుల్లో 37% (1.54 లక్షలు) కేరళలోనే ఉన్నాయి. అక్కడ రోజువారీ పాజిటివిటీ రేటు ఏకంగా 13.53 శాతం నమోదైంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలవుతుందనడానికి కేరళ కేసులతోపాటు ఆర్-ఫ్యాక్టర్ ని కూడా సంకేతంగా చెబుతున్నారు.

First Published:  29 July 2021 9:46 PM GMT
Next Story