Telugu Global
National

మమత మకాం ఢిల్లీకి మార్చేస్తారా..?

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చాన్నాళ్లనుంచి అనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నారు. సరిగ్గా ఇప్పుడా సమయం రానే వచ్చింది. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ మరోసారి తన పట్టునిలుపుకున్నారు, బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించారు. అక్కడింకా ఆమెకు ఐదేళ్లు సమయం ఉంది. ఈలోగా దేశ రాజకీయాల్లో తన సత్తా చూపాలనుకుంటున్నారు మమత. అందుకే ఆమె మూడో కూటమికి రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ నేతృత్వంలో ఈ కూటమి ఏర్పడాల్సి […]

మమత మకాం ఢిల్లీకి మార్చేస్తారా..?
X

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చాన్నాళ్లనుంచి అనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నారు. సరిగ్గా ఇప్పుడా సమయం రానే వచ్చింది. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ మరోసారి తన పట్టునిలుపుకున్నారు, బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించారు. అక్కడింకా ఆమెకు ఐదేళ్లు సమయం ఉంది. ఈలోగా దేశ రాజకీయాల్లో తన సత్తా చూపాలనుకుంటున్నారు మమత. అందుకే ఆమె మూడో కూటమికి రంగం సిద్ధం చేస్తున్నారు.

వాస్తవానికి కాంగ్రెస్ నేతృత్వంలో ఈ కూటమి ఏర్పడాల్సి ఉన్నా.. సొంత పార్టీని చక్కదిద్దుకోలేని రాహుల్ గాంధీకి కూటమి బాధ్యతలు అప్పజెప్పేందుకు మిగతా పార్టీలు సిద్ధంగా లేవు. శరద్ పవార్ తెరవెనక మంత్రాంగం నడిపించగలరు కానీ, ‘ఫేస్ ఆఫ్ ది థర్డ్ ఫ్రంట్’ అనిపించుకోలేరు. రాగా పోగా ఇప్పుడు కేజ్రీవాల్, మమతా బెనర్జీ.. వీరిద్దరే మోదీని ధైర్యంగా ఢీకొనే నాయకులుగా కనిపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీకి మరిన్ని విజయాలందించి థర్డ్ ఫ్రంట్ లో కీలకంగా మారాలనుకుంటున్నారు కేజ్రీవాల్. ఎందుకంటే ఢిల్లీలో ఆయనకున్న స్పేస్ చాలా తక్కువ. అందులోనూ 2019 ఎన్నికల్లో ఢిల్లీలోని లోక్ సభ సీట్లు ఏడింటిలో ఒక్కచోట కూడా ఆమ్ ఆద్మీ గెలవలేకపోయింది. దీంతో తాజా విజేత మమతపైనే అందరికీ గురి కుదిరేలా ఉంది.

ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ప్రదాని మోదీతో భేటీ అయిన మమత, వ్యాక్సిన్ల వ్యవహారంపై చర్చించారు, పెగాసస్ స్కామ్ పై అఖిలపక్షం వేయాలని సూచించానని చెప్పారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కమల్‌ నాథ్‌, ఆనంద్‌ శర్మతో కూడా మమత భేటీ కావడం విశేషం. సోనియా గాంధీ, శరద్ పవార్ తో కూడా ఆమె సమావేశం కావాల్సి ఉంది. మొత్తమ్మీద ఈసారి ఢిల్లీ పర్యటనతో ఆమె బీజేపీ వైరి వర్గాలను ఏకం చేయబోతున్నట్టు స్పష్టమవుతోంది.

ఢిల్లీపై ఫోకస్ పెంచుతారా..?
ప్రస్తుతం మమత పశ్చిమబెంగాల్ సీఎంగా ఉన్నా కూడా ఆమెకు అక్కడ అసెంబ్లీలో సభ్యత్వం లేదు. సీఎం కుర్చీలో కూర్చున్న ఆరు నెలలలోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. శాసన మండలి పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. కరోనా కష్టకాలంలో ఎన్నికలకు ఈసీ ధైర్యం చేస్తుందనీ అనుకోలేం. ఈ దశలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిని తన అనుచరుడికి అప్పగిస్తారని, ఆమె జాతీయ రాజకీయాల్లోకి వస్తారని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే మమత ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేసుకున్నారని, ఇకపై హస్తినలోనే ఎక్కువ సమయం గడుపుతారని అంటున్నారు. ఈ వార్తలు నిజమేనా, సీఎంగా మమత అంత తేలిగ్గా తప్పుకుంటారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఆమెకు మాత్రం హస్తిన రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచన ఉంది. రాష్ట్ర స్థాయి నేతల్ని ఆమె లెక్కలోకి తీసుకోవడం లేదు. మమత మాటల దాడి చేస్తే అది నేరుగా మోదీ లేదా అమిత్ షా పైనే ఉంటోంది. ఆ దిశగా ఆమె ప్రతిపక్షాలను ఏకం చేయాలనుకుంటున్నారు. హస్తినలో చక్రం తిప్పాలనుకుంటున్నారు.

First Published:  27 July 2021 10:01 PM GMT
Next Story