Telugu Global
National

భారత్ లో జీవనం దుర్భరం.. సగమే సంతోషం..

కరోనా కష్టకాలం ప్రపంచమంతట్నీ వణికించింది. ఆర్థిక కష్టాలు అన్నిదేశాలకు కామన్. అయితే ప్రపంచ దేశాలన్నీ ఆ కష్ట నష్టాలనుంచి క్రమంగా గట్టెక్కుతున్నాయి. కరోనా పుట్టుకకు కారణం అని చెబుతున్న చైనా కూడా కుదుటపడింది. కానీ భారత్ మాత్రం ఈ ఉపద్రవం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇప్పుడల్లా కోలుకుంటుందనే అంచనాలు కూడా లేవు. ఈ దశలో ఐపీఎస్ఓఎస్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సర్వే భారత్ లో ప్రజల జీవన స్థితిని మరోసారి కళ్లముందుంచింది. దేశవ్యాప్తంగా 8 పట్టణాల్లో […]

భారత్ లో జీవనం దుర్భరం.. సగమే సంతోషం..
X

కరోనా కష్టకాలం ప్రపంచమంతట్నీ వణికించింది. ఆర్థిక కష్టాలు అన్నిదేశాలకు కామన్. అయితే ప్రపంచ దేశాలన్నీ ఆ కష్ట నష్టాలనుంచి క్రమంగా గట్టెక్కుతున్నాయి. కరోనా పుట్టుకకు కారణం అని చెబుతున్న చైనా కూడా కుదుటపడింది. కానీ భారత్ మాత్రం ఈ ఉపద్రవం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇప్పుడల్లా కోలుకుంటుందనే అంచనాలు కూడా లేవు. ఈ దశలో ఐపీఎస్ఓఎస్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సర్వే భారత్ లో ప్రజల జీవన స్థితిని మరోసారి కళ్లముందుంచింది. దేశవ్యాప్తంగా 8 పట్టణాల్లో ‘దనోనే ఇండియా’ సీఐఐతో కలసి ఈ సర్వే నిర్వహించింది. భారత్ లో సగం మంది జనాభా కష్టాల్లో మగ్గిపోతున్నట్టు సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

భారత జనాభాలో ప్రతి ఇద్దరిలో ఒకరు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. సంతోషకరమైన జీవితం వారికి దూరమైంది. వాస్తవానికి కరోనా కంటే ముందు కూడా భారత్ లో దుర్భర పరిస్థితులున్నా కూడా.. మహమ్మారి వచ్చిన తర్వాత అవి మరింత దిగజారాయి. భారత్ లాంటి దేశాల్లో ఆస్పత్రి సౌకర్యాలు పేదలకు ఎంత దూరమో మరోసారి రుజువైంది. అంతరిక్ష యాత్రల్లో విజయం సాధించినా, అవసరానికి రోగులకు ఆక్సిజన్ చేరవేయలేని దుస్థితి మనది. ఈ దశలో సగానికి సగం మంది దుర్భర స్థితిలోకి జారుకున్నారనడంలో ఆశ్చర్యం లేదు.

దేశవ్యాప్తంగా 2762మందిపై నిర్వహించిన ఈ సర్వేలో.. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వంటి ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. నాణ్యమైన జీవితం గడిపుతున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరిలో 46.2శాతం మంది, అంటే దాదాపు సగం మంది జనాభా తాము నాణ్యమైన జీవితం గడపడంలేదని తేల్చి చెప్పారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వీరందరికీ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇందులో మహిళల శాతం ఎక్కువ. 50.4 శాతం మంది మహిళలు సంతోషకరమైన జీవితాన్ని గడపడంలేదని సర్వే చెబుతోంది.

ఆరోగ్యపు అలవాట్లు.. నిద్రలేమి..
భారత్ లో సగం మంది జనాభా శారీరక ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారాన్ని తీసుకోవడంలేదు. ఉపాధి వేటలో పడి నిద్రకు కూడా దూరమవుతున్నారు. ఆహారపు అలవాట్లు, నిద్రలేమి కారణంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారం వీరికి దూరమైంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేనివారి శాతం కోల్ కతాలో ఎక్కువ. ఆ తర్వాత చెన్నై, ఢిల్లీ, పాట్నా, హైదరాబాద్, లక్నో.. ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఇక ముంబైలో మాత్రం 68శాతం మంది తాము సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నామని చెప్పారు.

కొవిడ్ తో ఉపాధి, ఉద్యోగాలకు కరవు..
భారత్ లో కొవిడ్ కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కరువయ్యాయని, నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిందని చెబుతోంది సీఐఐ సర్వే. ఆర్థిక కష్టాలు కూడా ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందువల్లే ప్రజలు సుఖవంతమైన జీవితానికి దూరమయ్యారని తెలుస్తోంది.

భారత్ లో ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న కుటుంబాల్లో కూడా పౌష్టికాహారం తీసుకునే అలవాటు లేకపోవడం సర్వేలో మరో కొత్త విషయం. కేవలం 9 శాతం మంది మాత్రమే ప్రొటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు. మిగతావారిలో కూడా సర్వే సంస్థ అవగాహన కల్పించడానికి ప్రయత్నించింది.

First Published:  24 July 2021 8:58 AM GMT
Next Story