Telugu Global
NEWS

ఆనాడే ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే? ఈనాడు ఇంత వివాదం ఉండేదా?

(ఎస్వీ రావు) ఆంధ్ర – తెలంగాణ ల మధ్య రాజుకుంటున్న ఈ నిప్పుల కుంపటి కి ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణం కాదా? బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న విధంగా 2004 కుముందే సమస్యాత్మక ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి ఎదురయ్యి ఉండేదా? ఈ సమస్య ఇప్పుడు ఎదురు కావటానికి 2004 కు ముందు ఆ ప్రాజెక్టులను కనీసం సగమైనా పూర్తి చేసి పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురాకపోవటమే కారణం. పదేళ్ళపాటు అధికారంలో కొనసాగిన […]

ఆనాడే ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే? ఈనాడు ఇంత వివాదం ఉండేదా?
X

(ఎస్వీ రావు)

ఆంధ్ర – తెలంగాణ ల మధ్య రాజుకుంటున్న ఈ నిప్పుల కుంపటి కి ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణం కాదా? బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న విధంగా 2004 కుముందే సమస్యాత్మక ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి ఎదురయ్యి ఉండేదా? ఈ సమస్య ఇప్పుడు ఎదురు కావటానికి 2004 కు ముందు ఆ ప్రాజెక్టులను కనీసం సగమైనా పూర్తి చేసి పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురాకపోవటమే కారణం. పదేళ్ళపాటు అధికారంలో కొనసాగిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకు కారణం కాదా?

ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల మధ్య నిప్పుగా మారిన నది జలాల వివాద పరిష్కారం కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పట్లో పరిస్కారమయ్యే సూచనలు కనిపించటం లేదు. కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుండగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ విధంగా బోర్డులను ఏర్పాటు చేసి వివాదం పరిష్కరించాలని కేంద్రప్రభుత్వం 2020 అక్టోబరు 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయించింది. అప్పుడు ఈ ప్రతిపాదనను తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం తీవ్రమైంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుండ‌టం తో కేంద్రబలగాల అధీనంలో ప్రాజెక్టులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదేపదే కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

అదే విధంగా ఆంధ్రాలో రాయలసీమ ఎత్తిపోతల పధకం, తెలంగాణ లో పాలమూరు-రంగారెడ్డి తదితర పధకాలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణ నదులకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దాదాపుగా అన్ని వర్గాలు, ముఖ్యంగా నీటిపారుదల రంగ నిపుణులు స్వాగతిస్తున్నప్పటికీ ఇప్పట్లో సమస్య పరిష్కారం అయ్యే సూచనలు కనిపించటం లేదు. అయితే ఈ బోర్డులు అపరిమితమైన అధికారాలతో ఏర్పాటు చేయటం ద్వారా సమస్య పరిష్కారానికి ముందడుగు పడినట్లే.

అయితే ప్రధానంగా నీటి పంపకం, ప్రాజెక్టుల నిర్వహణ మొదలైన అంశాలు నది జలాల లభ్యత పై ఆధారపడి ఉంటాయి. గోదావరికి ఇప్పట్లో నీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి లేనే లేదు. ఎగువ భాగంలో తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినా దిగువన వున్నా ఆంధ్రప్రదేశ్ కు నీటి సమస్య ఎదురుకాబోదు. ఇందుకు ప్రధానంగా ఖమ్మం దిగువన వున్న ఉపనదులు నుంచి గోదావరికి గరిష్టంగా నీరు లభిస్తుండటమే కారణం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఇక అసలు సమస్యలే వుండవు.

సమస్య మొత్తం కృష్ణ నదిపైనే..
ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల్లా కృష్ణ నది పైనే వుంది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటకలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘమైన నీటి తగాదాలు వున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆ తగాదా నాలుగు రాష్ట్రాల మధ్య సమస్యగా మారింది. అందులోను ఏపీ, తెలంగాణాల మధ్య తీవ్రస్థాయిలో వుంది. ఈ సమస్యకు బీజాలు తాజాగా పడినవి కాదు. ఎప్పుడో బచావత్ ట్రిబ్యునల్ సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర – తెలంగాణ – రాయలసీమల మధ్య ఏర్పడ్డాయి. తెలంగాణ పుట్టుకకు నిధులు నీళ్లు కీలకమైనవి. జలాలను సీమ – ఆంధ్రకు తరలించుకుపోతున్నారని అప్పట్లోనే వివాదాలు చెలరేగాయి. పోతిరెడ్డిపాడు, పులిచింతల, పోలవరం వివాదాలకు కేంద్రబిందువు అయ్యాయి.

బచావత్ అప్పుడే చెప్పింది
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడే మిగులు జలాలను 2004 లోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు అని స్పష్టంగా తేల్చి చెప్పింది. అందులో భాగంగా 370 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించాలని 1980 దశకంలో సీమలో పెద్ద ఎత్తున ఉద్యమమే సాగింది. అదే సమయంలో చెన్నై కు తాగునీరు అందించేందుకు తెలుగు గంగ పథ‌కాన్ని చేపట్టారు. ఆ క్రమంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తాగు, సాగునీరు అందించేందుకు తెలుగు గంగ, వెలిగొండ, SLBC, హంద్రీనీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, SRBC మొదలైన పథ‌కాలను చేపట్టారు.

ఇందులో SRBC, భీమా, కోయిల్ సాగర్, పులిచింతల లాంటివి మినహా మిగిలినవాటికి కేంద్రం నుంచి అనుమతులు లభించలేదు. అయినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టాలని ఒత్తిడి రావటం తో నాటి ముఖ్యమంత్రి రామారావు పథ‌కాలను ప్రకటించారు కానీ పనులు చేపట్టలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చి పదేళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి గ కొనసాగిన చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసారు. ఆయన అధికారంలో ఉండగా “నిధులెక్కడివి? నీళ్లెక్కడివి?” అని తరచూ ప్రశ్నిస్తూ ఉండేవారు.

కర్ణాటక కూడా లాభపడింది
అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును గణనీయంగా పెంచుకోగలిగింది. దేవెగౌడ ప్రధానిగా వున్నప్పుడు అప్పటి కేంద్రప్రభుత్వానికి చంద్రబాబు కన్వీనర్ గా ఉండగా ఈ అనుమతులు లభించాయి. అల్మట్టికి వ్యతిరేకంగా కృష్ణ నది పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండటం పై అప్పట్లో నాటి ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున నిలదీశారు.

పదేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది కానీ, చంద్రబాబు పాలనలో ఏ ప్రాజెక్ట్ పని అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే అయన 1996లో ఒకసారి, 2001లో మరోసారి హంద్రీనీవాకు శంకుస్థాపన చేసారు. తెలంగాణ ఉద్యమం తీవ్రం అవుతూ ఉండటం తో 2001లో గోదావరి పై దేవాదులకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. 2004లో అయన అధికారం నుంచి దిగిపోయేనాటికి బచావత్ ట్రిబ్యునల్ కృష్ణ మిగులు జలాలను వినియోగించుకునేందుకు నిర్దేశించిన గడువు కూడా ముగిసిపోయింది.

ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జలయజ్ఞం పేరుతో గోదావరి, కృష్ణ నదులపై పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటిని చేపట్టారు. పైన పేర్కొన్న జాబితాలోని ప్రాజెక్టులు అన్ని నిర్మాణం ఊపందుకున్నాయి. అందులో భాగంగానే పోల‌వ‌రం ప్రాజెక్టు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయినప్పటికీ అయన లెక్కచేయకుండా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయితే కొత్తగా ఏర్పడే కృష్ణ జలాల ట్రిబ్యునల్ లో ఎంతో కొంత నీటి కేటాయింపు లభిస్తుందని ఆయన భావించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. 2004 కు ముందు ఆ ప్రాజెక్టులు కనీసం మిగులు, వరద జలాల ఆధారంగానైనా వినియోగంలోకి వచ్చి ఉంటే ఈ రోజు సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదు.

కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు లేకపోయినప్పటికీ ఎగువ భాగంలో ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మించి చాలావరకు అనుమతులు తెచ్చుకున్నాయి. ఫలితంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (బచ్చావత్ తరువాత ఏర్పాటు అయిన ట్రిబ్యునల్) కేటాయింపుల్లో ఆ రాష్ట్రాలకు ఊరట లభించింది. నష్టమల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే వాటిల్లింది. కృష్ణ నది పై మొత్తం 36 ప్రాజెక్టులు షెడ్యూల్ 1 లో చేర్చగా అందులో 16 ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు లేవు.

ఆఖరికి ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన తెలుగు గంగ, హంద్రీనీవా, ముచ్చుమర్రి, గాలేరు – నగరి, కల్వకుర్తి మొదలైనవి వున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నీళ్లు నికరంగా కేటాయించిన ప్రాజెక్టులకే నీటిని విడుదల చేయాలి. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయి వినియోగంలో వున్న ఆ ప్రాజెక్టులకు ఈ ఏడాది నుంచి నీటిని ఎలా విడుదల చేస్తారు? పోనీ ఆ ప్రాజెక్టులకు కేంద్రం నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా 6 నెలల్లో అనుమతులు వస్తాయా? అదే విధంగా నిర్మాణంలో వున్న ప్రాజెక్టులకు నికర జలాలు లేనందున రాష్ట్రాలు DPR లు సమర్పించినా కేంద్రం అనుమతి ఇస్తుందా?

వివాదం తప్పదు
ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకటం అంత సులభం కాదు కాబట్టి వివాదం తీవ్రంగానే కొనసాగుతుంది. కృష్ణ బోర్డు ఆ ప్రాజెక్టులను నిర్వహణలోకి తీసుకుంటే తొలుత నికర జలాలు కేటాయింపు వున్న ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుంది. అనుమతులు లేని 16 ప్రాజెక్టులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ ఇంకా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనందున అమలులోకి రావటం లేదు. ఏది ఏమైనా ఆ 16 ప్రాజెక్టులకు నీటి లభ్యతే ప్రధానమైన సమస్య.

ఈ సమస్య ఇప్పుడు ఎదురు కావటానికి 2004 కు ముందు ఆ ప్రాజెక్టులను కనీసం సగమైనా పూర్తి చేసి పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురాకపోవటమే కారణం. ఇందుకు పదేళ్ళపాటు అధికారంలో కొనసాగిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కారణం కాదా?

First Published:  21 July 2021 1:05 AM GMT
Next Story