Telugu Global
National

అస్త్ర సన్యాసానికి యడ్డీ సిద్ధం.. ఒప్పుకునేది లేదంటున్న స్వామీజీలు..

కర్నాటకలో సీఎం కుర్చీ మార్పిడికి రంగం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈమేరకు కర్నాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ గొంతు తనది కాదు అని నళిన్ తప్పించుకోవాలనుకున్నా అది సాధ్యం కాలేదు. సీఎం మార్పుతోపాటు, మరికొందరు మంత్రులపై కూడా వేటు పడుతుందని నళిన్ కుమార్ క్లియర్ గా చెప్పిన ఆడియో సంచలనంగా మారింది. ఈలోగా యడ్యూరప్ప తనకు తానే సీఎం చైర్ నుంచి […]

అస్త్ర సన్యాసానికి యడ్డీ సిద్ధం.. ఒప్పుకునేది లేదంటున్న స్వామీజీలు..
X

కర్నాటకలో సీఎం కుర్చీ మార్పిడికి రంగం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈమేరకు కర్నాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ గొంతు తనది కాదు అని నళిన్ తప్పించుకోవాలనుకున్నా అది సాధ్యం కాలేదు. సీఎం మార్పుతోపాటు, మరికొందరు మంత్రులపై కూడా వేటు పడుతుందని నళిన్ కుమార్ క్లియర్ గా చెప్పిన ఆడియో సంచలనంగా మారింది. ఈలోగా యడ్యూరప్ప తనకు తానే సీఎం చైర్ నుంచి తప్పుకుంటున్నారనే వార్తలు కూడా కర్నాటకలో చక్కర్లు కొట్టాయి. సొంత పార్టీలో అసమ్మతి నేతల పోరు, అధిష్టానం నుంచి ఎదురవుతున్న ఒత్తిడి భరించలేక యడ్డీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

పదవి వీడేలోపు సొంత ప్రాంతమైన శివమొగ్గలో ముఖ్యమంత్రి హోదాలో భారీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు యడ్యూరప్ప యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. శివమొగ్గలో సీఎం హోదాలో ఈనెల 23, 24వ తేదీల్లో పర్యటించి ఆ తర్వాత తన రాజీనామా ప్రకటన చేస్తారని అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో చివరిసారిగా సమావేశం కావాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారట. వారందరికీ భారీ స్థాయిలో ఈనెల 25వ తేదీన విందు ఏర్పాటు చేయాలని యడ్డీ భావిస్తున్నారని సమాచారం. జులై 26న సీఎం రాజీనామాకు మహూర్తం కూడా ఫిక్స్ చేశారని సమాచారం.

అయితే ఈలోగా కర్నాటకలో మఠాధిపతుల రాయబారం మరింత హైలెట్ అవుతోంది. దాదాపు 30మంది స్వామీజీలు, వివిధ పీఠాల అధిపతులు సీఎం యడ్యూరప్పను కలసి తమ మద్దతు తెలిపారు. మీరే చిరకాలం సీఎంగా ఉండాలని దీవించారు. కర్నాటకలో యడ్డీ మినహా ఇంకెవరూ సీఎం కుర్చీలో కూర్చున్నా బీజేపీ కుప్పకూలిపోతుందని కూడా వారు హెచ్చరించారు. యడ్యూరప్పనే సీఎంగా కొనసాగించాలని బాలేశుర్ మఠాధిపతి దింగలేశ్వర్ స్వామీజీ సహా పలువురు పీఠాధిపతులు డిమాండ్ చేశారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని ఈ సందర్భంగా యడ్యూరప్ప వారిని సముదాయించి పంపించినట్టు తెలుస్తోంది.

మొత్తమ్మీద కర్నాటకలో సీఎం మార్పు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. నేను రాజీనామా చేయను అని మొదట్లో భీష్మించుకు కూర్చున్న యడ్యూరప్ప మెల్లగా స్వరం మార్చారు. అధిష్టానం ఆదేశాల ప్రకారం నడచుకుంటానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈలోగా తన మద్దతుదారులందర్నీ కూడగట్టి, కేంద్ర పార్టీకి తన బలాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం కర్నాటకకు కొత్త సీఎంను తీసుకొచ్చి.. ఆయన ఆధ్వర్యంలో 2023లో జరిగే ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది. యడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాలని చూస్తోంది.

First Published:  20 July 2021 10:13 PM GMT
Next Story