Telugu Global
National

కోటీశ్వరులకు పీఎం కిసాన్ నిధులు.. 3వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. షార్ట్ కట్ లో పీఎం-కిసాన్. ఈ పథకం పేరుతో కేంద్రం పేద రైతులకు ప్రతి ఏటా 6 వేల రూపాయలు సాయం చేస్తోంది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా నేరుగా కేంద్రం ఈ సొమ్ముని రైతుల ఖాతాల్లో వేస్తుంది. విడతకు రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సొమ్ము నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతుంది. అయితే పేదలతోపాటు కోటీశ్వరులు, లక్షల్లో ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారి అకౌంట్లలో కూడా ఈ […]

కోటీశ్వరులకు పీఎం కిసాన్ నిధులు.. 3వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు..
X

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. షార్ట్ కట్ లో పీఎం-కిసాన్. ఈ పథకం పేరుతో కేంద్రం పేద రైతులకు ప్రతి ఏటా 6 వేల రూపాయలు సాయం చేస్తోంది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా నేరుగా కేంద్రం ఈ సొమ్ముని రైతుల ఖాతాల్లో వేస్తుంది. విడతకు రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సొమ్ము నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతుంది. అయితే పేదలతోపాటు కోటీశ్వరులు, లక్షల్లో ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారి అకౌంట్లలో కూడా ఈ సొమ్ము జమ కావడం విశేషం. ఒకరిద్దరు కాదు ఏకంగా 42లక్షలమంది అనర్హులు గత రెండేళ్లుగా పీఎం కిసాన్ లబ్ధిని అందుకుంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు కావు, స్వయానా వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ లో చెప్పిన మాటలు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఇప్పుడీ సొమ్మంతా వెనక్కి తెప్పిస్తామంటూ ప్రభుత్వం బీరాలు పలకడం మాత్రం కొసమెరుపు.

విదేశాల్లో దాచిన నల్లధనం భారత్ కు తెప్పిస్తామంటూ అప్పట్లో బీజేపీ నేతలు ఎన్ని కోతలు కోశారో అందరికీ తెలుసు. అది వదిలేయండి, ఇప్పుడు స్వదేశంలో ప్రభుత్వం బూడిదలో పోసిన 3వేల కోట్ల రూపాయలు ఎలా వెనక్కి తెప్పిస్తారో చెప్పండి అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. పీఎం-కిసాన్ పేరుతో ప్రభుత్వం అనర్హుల అకౌంట్లలో వేసిన సొమ్ము అక్షరాలా 3వేల కోట్ల రూపాయలు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యంతో ఈ సొమ్ము అనర్హులకు చేరింది. 42లక్షల మంది అనర్హులు పీఎం-కిసాన్ ద్వారా లబ్ధి పొందారు, పొందుతున్నారు కూడా.

అసోంలో అత్యథికంగా 8.35 లక్షల మంది అనర్హులు రూ.554 కోట్ల లబ్ధి పొందారు. తమిళనాడులో 7.22 లక్షల మందికి అర్హత లేకపోయినా రూ.340 కోట్ల నిధులు జమ చేశారు. పంజాబ్‌లో 5.62 లక్షల మంది రిచ్ రైతులకు రూ.437 కోట్లు ముట్టజెప్పారు. తలాపాపం తిలా పిడికెడు అన్నట్టుగా ఇలా ప్రతి రాష్ట్రంలోనూ అనర్హులకు పీఎం-కిసాన్ నిధుల్ని పంచిపెట్టారు. ఓవైపు అర్హులైన సన్న, చిన్నకారు రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే, సవాలక్ష కండిషన్లతో వారిని పక్కనపెట్టేసే ప్రభుత్వం, అనర్హులకు మాత్రం ఇలా దోచిపెట్టడం సబబేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి అకౌంట్లలో డబ్బులు పడ్డాక, వాటిని తిరిగి తీసుకోవడం అసలు ప్రభుత్వానికి సాధ్యమేనా అనే అనుమానాలూ ఉన్నాయి. అయితే రికవరీ చేసి తీరతామంటూ పార్లమెంట్ లో వ్యవసాయ సాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ధీమాగా చెప్పడం మాత్రం విశేషం.

First Published:  20 July 2021 10:00 PM GMT
Next Story