Telugu Global
NEWS

రాయలసీమ ఎత్తిపోతల అనుమతులు మరింత ఆలస్యం..

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కేంద్ర బిందువైన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ అనుమతులివ్వడాన్ని మరి కొంతకాలం వాయిదా వేసింది. గతంలో 5 అంశాలపై వివరణ కోరుతూ మొదటిసారి అనుమతులు వాయిదా వేసింది. ఆ ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇవ్వగా.. కేంద్రం మరో 4 అంశాలపై కొర్రీలు వేసింది. – కృష్ణా నదిలో నీటి లభ్యతపై పూర్తిస్థాయి నివేదిక (హోలిస్టిక్‌ రిపోర్ట్‌) ఇవ్వాలి. – ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి […]

రాయలసీమ ఎత్తిపోతల అనుమతులు మరింత ఆలస్యం..
X

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కేంద్ర బిందువైన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ అనుమతులివ్వడాన్ని మరి కొంతకాలం వాయిదా వేసింది. గతంలో 5 అంశాలపై వివరణ కోరుతూ మొదటిసారి అనుమతులు వాయిదా వేసింది. ఆ ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇవ్వగా.. కేంద్రం మరో 4 అంశాలపై కొర్రీలు వేసింది.

– కృష్ణా నదిలో నీటి లభ్యతపై పూర్తిస్థాయి నివేదిక (హోలిస్టిక్‌ రిపోర్ట్‌) ఇవ్వాలి.
– ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని వాడుకునే విధానం, రాయలసీమ ఎత్తిపోతల పూర్తైన తర్వాత ఎలా వాడుకుంటారనే విషయంపై పూర్తి నివేదిక ఇవ్వాలి.
– శ్రీశైలం ప్రాజెక్ట్ కి అనుసంధానంగా ఉన్న ఇతర ఎత్తిపోతల పథకాలు, వాటి పర్యావరణ అనుమతుల గురించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి.
– రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల రిజర్వాయర్ లో నీటిమట్టం తగ్గితే ఏర్పడే పరిణామాలేంటో చెప్పాలి. ఆ ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రక్షిత అటవీప్రాంతాలు ఎక్కడెక్కడున్నాయో స్పష్టమైన లొకేషన్లు చూపాలి.

ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణపై కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ పరిశీలన జరిపింది. అనంతరం మరో నాలుగు అంశాలపై మరింత వివరణ కోరుతూ తాజాగా వర్తమానం పంపింది. నదిపై ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ లతోపాటు, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు, జల విద్యుత్ కేంద్రాల వివరాలు ఇవ్వాలని కూడా కోరింది.

నిపుణుల కమిటీ వ్యక్తం చేసిన అభ్యంతరాలు..
గతంలో శ్రీశైలం రిజర్వాయర్‌ పక్కగా ప్రాజెక్టు అప్రోచ్‌ ఛానల్‌ నిర్మించాలని నిర్ణయించారని, ఇప్పుడు దాన్ని మార్చి శ్రీశైలం ప్రాజెక్టు ముందు భాగంలో నిర్మించాలని ప్రతిపాదించారని, దీనివల్ల పూడిక పేరుకుపోయి నీటి నిల్వ తగ్గిపోతుందని, రిజర్వాయర్‌ చుట్టుపక్కల ప్రాంతం ఎండిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణుల కమిటీ పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 840 అడుగుల నుంచి నీరు తీసుకుంటుండగా, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ లో 800 అడుగుల నుంచే నీటిని తీసుకుంటున్నట్టు గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణంపై కూడా ప్రభావం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపినట్టు పేర్కొంది. ఈ అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని తాము సూచించిన 4 అంశాలపై మరింత వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

First Published:  19 July 2021 9:17 PM GMT
Next Story