Telugu Global
National

అమరీందర్ కు పొగపెట్టిన కాంగ్రెస్, పీసీసీ చీఫ్ గా సిద్ధూ..

ఎన్నికల ఏడాదిలో పంజాబ్ కాంగ్రెస్ లో కీలక మార్పుకి అధిష్టానం శ్రీకారం చుట్టింది. సీఎం అమరీందర్ వ్యతిరేకిస్తున్నా కూడా సిద్ధూని పీసీసీ చీఫ్ గా నియమించింది. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్ని కూడా నియమించింది. దీంతో అమరీందర్ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. పరోక్షంగా కెప్టెన్ ప్రభావాన్ని తగ్గించేందుకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ వయసు 80ఏళ్లు. వయోభారం మీదపడుతున్నా రాజకీయ చాణక్యంతో ఆయన పంజాబ్ […]

అమరీందర్ కు పొగపెట్టిన కాంగ్రెస్, పీసీసీ చీఫ్ గా సిద్ధూ..
X

ఎన్నికల ఏడాదిలో పంజాబ్ కాంగ్రెస్ లో కీలక మార్పుకి అధిష్టానం శ్రీకారం చుట్టింది. సీఎం అమరీందర్ వ్యతిరేకిస్తున్నా కూడా సిద్ధూని పీసీసీ చీఫ్ గా నియమించింది. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్ని కూడా నియమించింది. దీంతో అమరీందర్ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. పరోక్షంగా కెప్టెన్ ప్రభావాన్ని తగ్గించేందుకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.

పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ వయసు 80ఏళ్లు. వయోభారం మీదపడుతున్నా రాజకీయ చాణక్యంతో ఆయన పంజాబ్ ని ఏలుతున్నారు. ఇవేనా నా చివరి ఎన్నికలంటూ పోయినసారి సింపతీ ఓటుతో అమరీందర్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఈ దఫా కూడా పంజాబ్ లో రైతుల అలజడితో బీజేపీకి డిపాజిట్లు దక్కేలా లేవు. కాంగ్రెస్ కే మరోసారి అధికారం కట్టబెడతారనే అంచనాలున్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా అమరీందర్ ని లైట్ తీసుకుంది. ఆ స్థానంలో యువనాయకత్వాన్నిప్రోత్సహించేందుకు రాహుల్ గాంధీ, సిద్ధూని తెరపైకి తెచ్చారు. సుదీర్ఘ మంతనాల అనంతరం సిద్ధూకి పీసీసీ పదవి కట్టబెట్టారు.

సిద్ధూ రాకతో కెప్టెన్ హవా తగ్గినట్టేనా..?
బీజేపీతో విభేదించి కాంగ్రెస్ లో చేరిన సిద్ధూ.. 2017నుంచి 2019వరకు సీఎం అమరీందర్ సారథ్యంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సిద్ధూ పాక్ ప్రయాణం వివాదాలకు కారణం అయింది. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఆయన, పాక్ సైన్యాధ్యక్షుడిని కౌగిలించుకోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధూ, అమరీందర్ కి వ్యతిరేకంగా సొంత వర్గాన్ని బలపరుచుకున్నారు. 2019 సార్వత్రిక తన భార్యకు ఎంపీ సీటు రాకపోడానికి కారణం కూడా అమరీందర్ అనే అనుమానం సిద్ధూలో ఉంది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. తీరా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలనాటికి పంజాబ్ లో తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నించి పీసీసీ చీఫ్ పదవి సంపాదించి సఫలం అయ్యారు సిద్ధూ. ఆయన రాకతో అమరీందర్ హవా తగ్గినట్టేనని తెలుస్తోంది.

రాజీవ్ గాంధీ సన్నిహితుడుగా పేరున్న అమరీందర్ సింగ్, మొదటినుంచీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ పంజాబ్ లో పార్టీకంటే ఎక్కువగా ఎదిగారు. పార్టీ కూడా ఆయన్ను వదులుకోలేక భరిస్తూ వచ్చింది. ఇన్నాళ్లకు అమరీందర్ కు ఆల్టర్నేట్ దొరకడం, ఆయనపై వయోభారం పడటంతో.. సిద్ధూని తెరపైకి తెచ్చింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను సిద్ధూ ఫేస్ తోటే ఎదుర్కోవాలని చూస్తోంది. ఈ మార్పు కాంగ్రెస్ కి లాభమా, నష్టమా అనేది అసెంబ్లీ ఎన్నికలతో తేలిపోతుంది.

First Published:  18 July 2021 10:03 PM GMT
Next Story