Telugu Global
National

అక్టోబర్ 1నుంచి కాలేజీలు.. యూజీసీ మార్గదర్శకాలు..

కరోనా కారణంగా విద్యావ్యవస్థలో పరీక్షలు, ఫలితాలు, అడ్మిషన్లు.. అన్నీ గందరగోళంగా మారాయి. ఆల్ పాస్ ఫార్ములాతో బాగా చదివే విద్యార్థులకు, కేవలం పరీక్ష ఫీజు కట్టి చదవకుండా కూర్చునేవారికి తేడా లేకుండా పోయింది. అయితే అన్ లాక్ పూర్తి స్థాయిలో అమలులోకి రావడంతో చాలా చోట్ల స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు తెరుచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ క్లాస్ లు మొదలయ్యాయి. అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్ ని బట్టి అడ్మిషన్లు ఇచ్చే డిగ్రీ కాలేజీలు, ఎంట్రన్స్ టెస్ట్ […]

అక్టోబర్ 1నుంచి కాలేజీలు.. యూజీసీ మార్గదర్శకాలు..
X

కరోనా కారణంగా విద్యావ్యవస్థలో పరీక్షలు, ఫలితాలు, అడ్మిషన్లు.. అన్నీ గందరగోళంగా మారాయి. ఆల్ పాస్ ఫార్ములాతో బాగా చదివే విద్యార్థులకు, కేవలం పరీక్ష ఫీజు కట్టి చదవకుండా కూర్చునేవారికి తేడా లేకుండా పోయింది. అయితే అన్ లాక్ పూర్తి స్థాయిలో అమలులోకి రావడంతో చాలా చోట్ల స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు తెరుచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ క్లాస్ లు మొదలయ్యాయి. అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్ ని బట్టి అడ్మిషన్లు ఇచ్చే డిగ్రీ కాలేజీలు, ఎంట్రన్స్ టెస్ట్ ల ఆధారంగా నిర్వహించాల్సిన పీజీ కోర్సుల వ్యవహారంలో మాత్రం ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చింది. యూజీసీ దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.

అక్టోబర్ 1నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు..
యూనివర్శిటీలు, కాలేజీలు అక్టోబర్ 1నుంచి నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియను సెప్టెంబరు 30లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. విద్యాసంవత్సరం ఈ ఏడాది అక్టోబరు 1న ప్రారంభమై వచ్చే ఏడాది జులై 31వ తేదీ లోపు పూర్తయ్యేలా చూసుకోవాలని సూచించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర రాష్ట్ర బోర్డులు ఇంటర్ ఫలితాలు వెల్లడించిన తర్వాతే డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పింది.

ఆగస్ట్ 31లోపు చివరి సెమిస్టర్ పరీక్షలు..
ప్రస్తుతం అన్ని డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఆఖరి సంవత్సరం విద్యార్థులకు చివరి సెమిస్టర్ పరీక్షలు మిగిలిపోయాయి. వీటిని ఆగస్ట్ 31లోపు ముగించాలని యూజీసీ సూచించింది. డిగ్రీ ఫైనల్ ఇయర్, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఆగస్ట్ లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని, సెప్టెంబర్ నుంచి కొత్త విద్యాసంవత్సరానికి సంబందించిన ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పింది. ఒకవేళ ఇంటర్ బోర్డ్ ల ఫలితాలు ఆలస్యం అయితే అక్టోబర్ 1న కాకపోయినా, అక్టోబర్ 18నుంచి అయినా కొత్త విద్యాసంవత్సరం మొదలు పెట్టాలని సూచించింది యూజీసీ. కొత్తగా ప్రారంబించిన విద్యాసంవత్సరాన్ని వచ్చే ఏడాది జులై 31లోపు ముగించేలా చూడాలని కోరింది. దీనికి సంబంధించి ఆఫ్ లైన్, ఆన్ లైన్ .. లేదా రెండూ కలిపిన బోధన విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని యూనివర్శిటీలకే వదిలిపెట్టింది. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా, రాకపోయినా ముందు జాగ్రత్తగా టైమ్ టేబుల్ వేసుకోవాలని, దాని ప్రకారమే సిలబస్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. కరోనా కష్టకాలంలో పేరెంట్స్ ఆర్థిక ఇబ్బందులు పరిగణలోకి తీసుకోవాలని, కాలేజీ మైగ్రేషన్ సమయంలో ఫీజు తిరిగి ఇచ్చే విషయంలో ఉదారంగా ఉండాలని సూచించింది.

First Published:  17 July 2021 9:30 PM GMT
Next Story