Telugu Global
Health & Life Style

కరోనా రోగులంతా టీబీ పరీక్షలు చేయించుకోవాల్సిందే..

కరోనా వచ్చిన కొత్తల్లో.. టీబీ నివారణకు వాడే మందులు కరోనా వైరస్ ని అడ్డుకునేందుకు బాగా పనిచేస్తాయనే ప్రచారం జరిగింది. అంతే కాదు.. టీబీ వ్యాక్సిన్ (బీసీజీ) వేయించుకోవడం వల్లే కరోనా తొలిదశ భారత్ పై పెద్ద ప్రభావం చూపించలేకపోయిందని కూడా అనుకున్నారు. సెకండ్ వేవ్ వచ్చే సరికి ఇవన్నీ వట్టి మాటలేనని తేలిపోయింది. సెకండ్ వేవ్ లో ఇతర దేశాలకంటే భారత్ ఎక్కువగా నష్టపోయింది. అయితే టీబీ, కరోనా.. రెండిటిలో ఉన్న కామన్ లక్షణాల వల్ల […]

కరోనా రోగులంతా టీబీ పరీక్షలు చేయించుకోవాల్సిందే..
X

కరోనా వచ్చిన కొత్తల్లో.. టీబీ నివారణకు వాడే మందులు కరోనా వైరస్ ని అడ్డుకునేందుకు బాగా పనిచేస్తాయనే ప్రచారం జరిగింది. అంతే కాదు.. టీబీ వ్యాక్సిన్ (బీసీజీ) వేయించుకోవడం వల్లే కరోనా తొలిదశ భారత్ పై పెద్ద ప్రభావం చూపించలేకపోయిందని కూడా అనుకున్నారు. సెకండ్ వేవ్ వచ్చే సరికి ఇవన్నీ వట్టి మాటలేనని తేలిపోయింది. సెకండ్ వేవ్ లో ఇతర దేశాలకంటే భారత్ ఎక్కువగా నష్టపోయింది. అయితే టీబీ, కరోనా.. రెండిటిలో ఉన్న కామన్ లక్షణాల వల్ల ఈ వ్యాధుల మధ్య సారూప్యతపై పదే పదే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. కోవిడ్ బారినపడి కోలుకున్నవారిలో చాలామంది ఆ తర్వాత టీబీ బారిన పడుతున్నట్టు తేలింది. దీంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

కరోనా సోకిన రోగుల్లో కొంతమంది ట్యుబర్‌ క్యులోసిస్‌(టీబీ) బారినపడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ తరహా కేసులు ప్రతి రోజూ వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్‌ బారినపడివారు టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అలాగే టీబీ రోగులు కూడా విధిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచనలు చేసింది.

భారత్ లో కోవిడ్ ప్రబలిన తర్వాత టీబీ కేసులు కూడా ఎక్కువయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత దాదాపుగా 203 రకాల ఇతర సమస్యలు చుట్టుముడుతున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. వీటిలో టీబీ కూడా ఒకటి అని తేలింది. అయితే భారత్ లో ఈ ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆధారాలు లేకపోయినా కోవిడ్ నుంచి కోలుకున్నవారు విధిగా టీబీ టెస్ట్ చేయించుకోవాలని మాత్రం సూచించింది. కరోనానుంచి కోలుకున్న ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కోవిడ్ తో బాధపడుతున్నట్టు బ్రిటన్ అధ్యయనం ఇటీవలే తేల్చింది. అయితే భారత్ లో మాత్రం అలాంటి ఇబ్బందులు లేవని, కరోనానుంచి కోలుకున్నవారిలో 95శాతం మంది తిరిగి సాధారణ జీవనాన్ని గడుపుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

First Published:  17 July 2021 10:00 PM GMT
Next Story