Telugu Global
NEWS

గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ అభ్యంతరాలు ఇవే..

ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్ లను ఆయా నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నదీ యాజమాన్య బోర్డుల పరిధిని కూడా ఖరారు చేసింది. ఇప్పటికిప్పుడు ఇది ఏపీకి సానుకూల అంశమే అయినా భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని మార్పులను కోరుతోంది. జలవనరుల శాఖ అధికారులతో చర్చించిన సీఎం జగన్, మార్పులు కోరుతూ కేంద్రానికి […]

గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ అభ్యంతరాలు ఇవే..
X

ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్ లను ఆయా నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నదీ యాజమాన్య బోర్డుల పరిధిని కూడా ఖరారు చేసింది. ఇప్పటికిప్పుడు ఇది ఏపీకి సానుకూల అంశమే అయినా భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని మార్పులను కోరుతోంది. జలవనరుల శాఖ అధికారులతో చర్చించిన సీఎం జగన్, మార్పులు కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు.

ఏపీ కోరుతున్న మార్పులేవంటే..
– ఉమ్మడి ప్రాజెక్టుల్ని బోర్డుల పరిధిలోకి తీసుకు రావడం సమంజసమే అయినా, రాష్ట్రంలోని అంతర్గత ప్రాజెక్ట్ లు, కాల్వల నిర్వహణ కూడా బోర్డు పరిధిలో ఉండాల్సిన అవసరం లేదు.
– బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదినుంచి కేటాయించిన 512 టీఎంసీల నీటిని వాడుకునే విషయంలో ఏపీకి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఆ నీటిని ఎక్కడ, ఎలా, ఏ అవసరాలకు వాడుకున్నా బోర్డు అభ్యంతర పెట్టకూడదు.
– దిగువ రాష్ట్రం కాబట్టి, వరద జలాలపై ఏపీకే సర్వ హక్కులు ఉండాలి.
– కొత్త ప్రాజెక్ట్ లకు 6 నెలలలోపు అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉన్నా.. వరదనీటిపై ఆధారపడే వాటిని నిర్మిస్తున్నందున వాటి నిర్మాణం విషయంలో బోర్డ్ ఉదారంగా ఉండాలి. ప్రాజెక్ట్ ల నిర్మాణ వ్యయం రాష్ట్రాలదే కాబట్టి, కేవలం వరద నీరు వచ్చినప్పుడే అవి ఉపయోగపడతాయి కాబట్టి, వరద జలాలపై దిగువ రాష్ట్రానికే హక్కు ఉంటుంది కాబట్టి, వాటి నిర్మాణానికి బోర్డు అభ్యంతరం చెప్పకూడదు.
– గోదావరిపై కాటన్‌ బ్యారేజి, కృష్ణాపై ప్రకాశం బ్యారేజి, వాటి కాలువలు, అవుట్‌ లెట్‌లు కూడా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదు.
– వెలిగొండ ప్రాజెక్ట్ ని కూడా బోర్డు పరిధిలో చేర్చాలి.

కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు అధికారులు. ఏపీలో మరీ దిగువన ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒకసారి నీరు విడుదల చేసిన తర్వాత ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలన్నది ఏపీ హక్కు అన్నారు. దిగువ ప్రాంతాల్లోని ప్రాజెక్ట్ లు, కాల్వలు బోర్డుల పరిధిలో ఉంటే పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, అలాంటి ప్రాజెక్టులు మినహాయించేలా మార్పులు కోరతామని చెప్పారు. ఈమేరకు కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు.

First Published:  16 July 2021 8:50 PM GMT
Next Story