Telugu Global
NEWS

జగన్ ఫార్ములాకి కేంద్రం ఓకే.. కేసీఆర్ కి షాకే..

‘జల విద్యుత్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నీటి వృథాని అడ్డుకోండి, లేకపోతే ప్రాజెక్ట్ ల వ్యవహారాలు కేంద్రం పరిధిలోకి తీసుకోండి.’ సుప్రీంకోర్టులో ఏపీ చేస్తున్న వాదన ఇది. సరిగ్గా ఈ వాదనకు అనుకూలంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్ లన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల అధీనంలోకి వెళ్లేలా ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు అక్టోబర్ 14నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది కేంద్ర జలశక్తి శాఖ. బోర్డుల […]

జగన్ ఫార్ములాకి కేంద్రం ఓకే.. కేసీఆర్ కి షాకే..
X

‘జల విద్యుత్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నీటి వృథాని అడ్డుకోండి, లేకపోతే ప్రాజెక్ట్ ల వ్యవహారాలు కేంద్రం పరిధిలోకి తీసుకోండి.’ సుప్రీంకోర్టులో ఏపీ చేస్తున్న వాదన ఇది. సరిగ్గా ఈ వాదనకు అనుకూలంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్ లన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల అధీనంలోకి వెళ్లేలా ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు అక్టోబర్ 14నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది కేంద్ర జలశక్తి శాఖ.

బోర్డుల పరిధిలోకి వెళ్తే ఏం జరుగుతుంది..?
ఇప్పటి వరకూ ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్ట్ లు ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లు ఉమ్మడి నిర్వహణలో ఉన్నాయి. శ్రీశైలంలో సాగునీటికోసం నిల్వ చేసుకున్న నీటిని తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో కిందకు విడుదల చేస్తున్నా ఏపీ ఏమీ చేయలేని పరిస్థితి. ఉమ్మడి ప్రాజెక్ట్ లు కాబట్టి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు బలగాలను తరలించి, ఎవరి పరిధిని వారు కాపాడుకున్నాయి. ప్రాజెక్ట్ ల నిర్వహణ బోర్డుల పరిధిలోకి వెళ్తే, ఇకపై ఇలాంటి సీన్లు ఎక్కడా కనిపించవు. ఉమ్మడి ప్రాజెక్ట్ లతోపాటు, కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్ట్ లు కూడా బోర్డుల పరిధిలోకి వెళ్తాయి. బోర్డు చైర్మన్లుగా వేరే రాష్ట్రాల అధికారుల్ని నియమిస్తామని స్పష్టం చేసింది కేంద్ర జలశక్తి శాఖ.

నిర్వహణ కేంద్రానికి.. ఖర్చు రాష్ట్రాలది..
రెండు తెలుగు రాష్ట్రాలు రివర్ బోర్డ్ లకు మొత్తం రూ.400 కోట్లు సీడ్‌ మనీ కింద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇవికాక నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు సర్దుబాటు చేయాలి. బోర్డుల పరిధి నోటిఫై చేశాక ఉమ్మడి ప్రాజెక్టులు, ఉమ్మడి కాలువల వద్ద కేంద్ర బలగాలను నియమిస్తారు. దీంతోపాటు బోర్డులకు 328 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా. టెలిమెట్రీ, ప్రాజెక్టుల నిర్వహణ.. ఇలా అన్నింటికి భారీగా వ్యయం పెరుగుతుంది. అనుమతిలేని ప్రాజెక్టులకు 6 నెలలలోపు క్లియరెన్స్ లు తెచ్చుకోవాలి. అనుమతులు రాకపోతే.. ప్రాజెక్టులు పూర్తయినా కూడా, వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది.

ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లు లేనట్టే..
ట్రిబ్యునల్ తీర్పుల ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల్లో ఏపీ 66శాతం, తెలంగాణ 34శాతం వాడుకుంటున్నాయి. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా ఫిఫ్టీ ఫిఫ్టీ వాదన తెరపైకి తెచ్చారు. ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం కేటాయించిన 811 టీఎంసీలను సమానంగా పంచుకోవాలని ఆయన ఓ కొత్త ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం ఈ వాదన కూడా వీగిపోయినట్టే. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం, గతంలో జరిగిన ఒప్పందం ప్రకారమే నీటి వాటాలు వేసుకోవాలని. కృష్ణా ట్రిబ్యునల్‌-2 తీర్పు వచ్చాక దాని ప్రకారం సవరణలు జరుగుతాయని స్పష్టం చేసింది కేంద్రం.

మొత్తమ్మీద ఉమ్మడి ప్రాజెక్ట్ లను కేంద్రం తన పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరితే.. మొత్తంగా ప్రాజెక్ట్ లన్నిటినీ బోర్డు పరిధిలోకి తెస్తూ జలశక్తి శాఖ నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం ప్రకారం ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే.. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్ ల నిర్వహణ పూర్తిగా బోర్డు పరిధిలోకి వెళ్తుంది. బోర్డు ఆదేశాల ప్రకారమే నీటి కేటాయింపులు, విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల ఉంటాయి. అక్రమ ప్రాజెక్ట్ లంటూ కొత్తగా ఎలాంటి గొడవలు మొదలయ్యే అవకాశం లేదు.

First Published:  15 July 2021 8:23 PM GMT
Next Story