Telugu Global
National

ఎన్నికల వేళ యోగీకి మాజీ అధికారుల షాక్..

ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలుండగా.. యూపీ పంచాయతీ పోరులో చతికిలబడ్డ బీజేపీ దాన్ని కవర్ చేసుకోలేక నానా తంటాలు పడుతోంది. అటు సీఎం కుర్చీ పదిలం చేసుకోడానికి వారం రోజులపాటు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు యోగీ. కేవలం యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆ రాష్ట్రానికి కేంద్ర కేబినెట్ లో పెద్దపీట వేశారు ప్రధాని నరేంద్రమోదీ. యూపీలో అధికారం నిలబెట్టుకోడానికి బీజేపీ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎక్కడో ఒకచోట ఆ వ్యవహారం రివర్స్ లో తగులుతూనే ఉంది. […]

ఎన్నికల వేళ యోగీకి మాజీ అధికారుల షాక్..
X

ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలుండగా.. యూపీ పంచాయతీ పోరులో చతికిలబడ్డ బీజేపీ దాన్ని కవర్ చేసుకోలేక నానా తంటాలు పడుతోంది. అటు సీఎం కుర్చీ పదిలం చేసుకోడానికి వారం రోజులపాటు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు యోగీ. కేవలం యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆ రాష్ట్రానికి కేంద్ర కేబినెట్ లో పెద్దపీట వేశారు ప్రధాని నరేంద్రమోదీ. యూపీలో అధికారం నిలబెట్టుకోడానికి బీజేపీ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎక్కడో ఒకచోట ఆ వ్యవహారం రివర్స్ లో తగులుతూనే ఉంది. తాజాగా మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సీఎం యోగీపాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. యూపీలో పాలన స్తంభించిందంటూ బహిరంగ లేఖ రాశారు.

ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ లో పూర్తిగా పాల‌న స్తంభించింద‌ని ఆ రాష్ట్రానికి చెందిన 87 మంది మాజీ ఉన్నతాధికారులు, మాజీ పోలీసు అధికారులు ఆరోపించారు. రూల్ ఆఫ్ లాను ప‌చ్చిగా ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ బ‌హిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖ‌పై 200 మందికి పైగా ప్ర‌ముఖులు సంత‌కాలు చేయడం విశేషం. ఎన్నికల ఏడాదిలో ఈ వ్యతిరేక పవనాలు బీజేపీకి చికాకు కలిగిస్తున్నాయి.

నిరంకుశ పాలన..
యూపీలో శాంతియుత నిరసనలకు కూడా చోటు లేదని, ఆందోళ‌న‌కారుల‌పై పోలీసులు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ఏక‌ప‌క్షంగా అరెస్ట్ లు చేసి, భయభ్రాంతులగు గురి చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. చ‌ట్ట విరుద్ధ హ‌త్య‌ల‌కు చ‌ర‌మ గీతం పాడాల‌ని కోరారు.

అస‌మ్మ‌తివాదుల‌ను బతకనీయరా..?
రాష్ట్రంలోని ప్రజలంతా ప్రభుత్వాన్ని ఆహా ఓహో అంటూ పొగడాలంటే ఎలా..? ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వర్గం పూర్తిగా ఉండకూడదనుకుంటే ఎలా..? అసమ్మతి వాదుల్ని మట్టుబెట్టేందుకు కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి, వాటిని తమ స్వప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని మాజీ అధికారులు తమ లేఖలో ఆరోపించారు. గోవ‌ధ పేరుతో అస‌మ్మ‌తి వాదుల‌కు వ్య‌తిరేకంగా, ల‌వ్ జిహాద్‌ కు వ్య‌తిరేకంగా ముస్లింల‌ను ల‌క్ష్యంగా చేసుకుని జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

ముస్లింలని టార్గెట్ చేసుకున్నారా..?
యోగీ సర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బ‌హిరంగంగా ముస్లింల‌కు వ్య‌తిరేకంగా ప‌క్ష‌పాత పూరితంగా చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు మాజీ అధికారులు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల లోపు ఇటువంటి చ‌ర్య‌ల‌ను నిలువ‌రించ‌క‌పోతే రాష్ట్రంలో మ‌త‌ప‌ర‌మైన ఉద్వేగాలు పెరిగిపోతాయ‌ని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలో జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులు, జర్నలిస్ట్ ల నిర్బంధాలు ప్రభుత్వ ప్రతిష్టను తెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. హ‌థ్రాస్ లైంగిక దాడి కేసు వార్త క‌వ‌రేజీకి వెళ్తున్న కేర‌ళ జ‌ర్న‌లిస్టు సిద్ధిఖి క‌ప్ప‌న్‌ ను అరెస్ట్ చేసి 200 రోజుల‌కు పైగా జైలులో ఉంచార‌ని గుర్తు చేశారు. యూపీ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో లోపాల‌ను ఎత్తి చూపిన వారిపై కేసులు పెడుతూ త‌మ వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికి యోగీ సర్కారు ప్ర‌య‌త్నిస్తోందని ఆరోపించారు. మాజీ అధికారులు రాసిన ఈ లేఖ ప్రస్తుతం యూపీలో సంచలనంగా మారింది. ప్రభత్వ తప్పుల్ని ఉదాహరణలతో సహా సునిశితంగా విమర్శిస్తూ.. బహిరంగ లేఖ విడుదల చేశారు మాజీ అధికారులు. ప్రభుత్వం దీనిపై ఇంకా స్పందించలేదు.

First Published:  12 July 2021 10:10 PM GMT
Next Story