Telugu Global
National

జలజగడాన్ని సుప్రీం పరిష్కరించగలదా..?

కృష్ణా నది నీటిపై హక్కులు కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది. ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డ్ కి లేఖలు రాశారు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రికీ ఫిర్యాదు చేశారు, ఏకంగా ప్రధానికి రెండు ఉత్తరాలు వెళ్లాయి.. అయినా ఫలితం లేదు. దీంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతోంది ఏపీ ప్రభుత్వం. రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్ట్ ల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు […]

జలజగడాన్ని సుప్రీం పరిష్కరించగలదా..?
X

కృష్ణా నది నీటిపై హక్కులు కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది. ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డ్ కి లేఖలు రాశారు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రికీ ఫిర్యాదు చేశారు, ఏకంగా ప్రధానికి రెండు ఉత్తరాలు వెళ్లాయి.. అయినా ఫలితం లేదు. దీంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతోంది ఏపీ ప్రభుత్వం. రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది.

సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్ట్ ల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి కోసం నీటిని కిందకు వదిలేస్తూ సముద్రంపాలు చేయడాన్ని ఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓవైపు శ్రీశైలంలో నీరు తగ్గిపోడానికి పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం కారణం అవుతోందని, పోతిరెడ్డిపాడుకి నీరు మిగలకుండా చేస్తోందని, అదే సమయంలో ఆ నీరంతా వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతుందని ఆరోపిస్తోంది. దీన్ని లక్ష్యపెట్టకుండా తెలంగాణ మాత్రం తమ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరమవుతోందని, దాని భర్తీకోసమే నీరు విడుదల చేస్తున్నామని, అది తమ హక్కని వాదిస్తోంది. ఇంకా మాట్లాడితే కృష్ణాలో 50శాతం నీరివ్వాలంటూ కొత్త లెక్కలు చెబుతోంది. ఈ దశలో సహజ న్యాయ సూత్రాలను ధిక్కరించిన తెలంగాణకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కృష్ణా రివర్ బోర్డ్ పై ఉంది, ఆ తర్వాత కేంద్రం కూడా సుద్దులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రెండూ జరక్కపోయే సరికి ఏపీ నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతోంది.

కేంద్రానికి అప్పగించేస్తారా..?
శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల.. ఈ ప్రాజెక్ట్ లన్నీ.. ఏపీ, తెలంగాణ రెండు భూభాగాల్లో ఉన్నాయి. వీటి నిర్వహణ, భద్రతపై రెండు రాష్ట్రాలకు అజమాయిషీ ఉంది. ఇప్పుడీ అధికారాన్ని కేంద్రానికి దఖలు పరచాలని, అంతర్ రాష్ట్ర నదులపై ఉన్న అన్ని ప్రాజెక్ట్ లు, జలవిద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్ట్ లుగా గుర్తించి, వాటి నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను కోరే అవకాశముందని తెలుస్తోంది. కృష్ణాబోర్డు విధివిధానాలు ఖరారు చేయడంలో కూడా కేంద్రం చొరవచూపేలా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలని కోరబోతున్నట్టు సమాచారం.

ప్రాజెక్ట్ ల నిర్వహణ రాష్ట్రాల చేతుల్లో ఉంటేనే.. తక్షణ అవసరాలకు ఉపయోగం ఉంటుంది. అది కేంద్రం చేతుల్లో పెడితే.. ప్రతి విషయానికి కేంద్రం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రం జోక్యం కోరుతుందంటే.. పరోక్షంగా తెలంగాణపై ఒత్తిడి తెస్తున్నట్టే లెక్క. విద్యుత్ ఉత్పత్తి ఆపేస్తారా లేక ప్రాజెక్ట్ ల బాధ్యతలు కేంద్రానికి అప్పజెప్పేస్తారా అనే విధంగా తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం సాక్షిగా ఏపీ ఒత్తిడి తేవాలని చూస్తోంది. కేంద్రాన్ని కూడా ఇందులో ప్రతివాదిగా చేసేందుకు ఏపీ సిద్ధమవుతోంది. మొత్తమ్మీద ప్రాజెక్ట్ ల నిర్వహణ బాధ్యత కేంద్రానికి అప్పగించే ప్రతిపాదన తెలంగాణకు షాకిచ్చే అంశమే.

First Published:  12 July 2021 9:39 PM GMT
Next Story