Telugu Global
National

థర్డ్ వేవ్ ముప్పు, ఆ రెండు రాష్ట్రాలవైపే అందరి చూపు..

మార్చి 2021. కరోనా సెకండ్ వేవ్ ఊసే లేదు. అన్ని చోట్లా అన్ లాక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చి జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్న రోజులవి. స్కూళ్లు, కాలేజీలు అన్నీ సవ్యంగా సాగిపోతాయని అనుకుంటున్న సమయంలో మహారాష్ట్రలో మెల్లగా కరోనా కేసులు పెరగడంతో కలవరం రేగింది. ఏప్రిల్ నాటికి కేరళనూ ఆ ఉధృతి తాకింది. ఆ తర్వాత పోటాపోటీగా కేసుల సంఖ్య పెరిగింది. దక్షిణాది రాష్ట్రాలు కేరళతో సరిహద్దులు కట్టడి చేసుకున్నా ఫలితం లేకపోయింది. […]

థర్డ్ వేవ్ ముప్పు, ఆ రెండు రాష్ట్రాలవైపే అందరి చూపు..
X

మార్చి 2021. కరోనా సెకండ్ వేవ్ ఊసే లేదు. అన్ని చోట్లా అన్ లాక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చి జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్న రోజులవి. స్కూళ్లు, కాలేజీలు అన్నీ సవ్యంగా సాగిపోతాయని అనుకుంటున్న సమయంలో మహారాష్ట్రలో మెల్లగా కరోనా కేసులు పెరగడంతో కలవరం రేగింది. ఏప్రిల్ నాటికి కేరళనూ ఆ ఉధృతి తాకింది. ఆ తర్వాత పోటాపోటీగా కేసుల సంఖ్య పెరిగింది. దక్షిణాది రాష్ట్రాలు కేరళతో సరిహద్దులు కట్టడి చేసుకున్నా ఫలితం లేకపోయింది. అప్పటికే సెకండ్ వేవ్ అన్ని రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టేసింది. ఏప్రిల్ లో జోరందుకుని, మే నెలలో గరిష్టస్థాయిని తాకాయి కేసులు. మహారాష్ట్ర, కేరళ లో కరోనా కట్టడి లేకపోవడం వల్లే సెకండ్ వేవ్ విజృంభించిందనే అపవాదుని ఆ రెండు రాష్ట్రాలు మూటగట్టుకున్నాయి.

థర్డ్ వేవ్ పాపం కూడా వారిదేనా..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలోలాగే అన్ని చోట్లా అన్ లాక్ అమలులోకి వచ్చేసింది. అయితే మూడు రోజులుగా స్వల్ప స్థాయిలో పెరుగుతున్న కేసులు మరోసారి అందరినీ ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. అందులోనూ ఈసారి కూడా మహారాష్ట్ర, కేరళ ముందువరుసలో ఉండటంతో ఈ ఆందోళన మరింత పెరిగింది.

పెరుగుతున్న కేసులు..
ఒక ద‌శ‌లో 34 వేల దిగువ‌కు చేరిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య, గ‌త రెండు మూడు రోజులుగా మ‌ళ్లీ 40 వేల స్థాయికి చేరింది. అయితే, ఈ కొత్తగా న‌మోద‌వుతున్న కేసులలో స‌గానికిపైగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల‌ నుంచే వస్తున్నాయని కేంద్ర వైద్య‌ ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళలోని 14 జిల్లాలు, మహారాష్ట్రలోని 15 జిల్లాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఈ జిల్లాలే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్రం చెబుతోంది. దేశ వ్యాప్తంగా గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రకటించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కంటైన్‌ మెంట్‌ చర్యలను పాటించాలని పేర్కొంది. పర్యాటక ప్రాంతాల్లో పెరుగుతున్న రద్దీ, నిబంధనలను పాటించకపోవడం ఆందోళన కలిగించే అంశాలని తెలిపింది కేంద్రం.

ప్రస్తుతానికి సెకండ్ వేవే సమసిపోలేదని, మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు స్వల్పంగా పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ కి సంకేతాలనే అనుమానాలూ బలపడుతున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో 53శాతం ఆ రెండురాష్ట్రాలనుంచే కావడం మరింత విస్మయాన్ని కలిగించే అంశం.

Next Story