Telugu Global
National

వైద్య విద్య.. పూర్తిగా కేంద్రం పరిధిలోకే..

మెడికల్ సీట్లు హాట్ కేకులనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ హాట్ కేకుల్ని కేంద్రం మొత్తంగా తన చేతిలోకి తీసుకోబోతోంది. రాష్ట్రాల అభ్యంతరాల్ని పక్కనపెట్టి మరీ, మెడికల్ ఎంట్రన్స్ పై ఈమధ్య కేంద్రం పెత్తనం సాధించింది. రాష్ట్రాలు సొంతంగా నిర్వహించుకుంటున్న ప్రవేశ పరీక్షలు చెల్లుబాటు కాకుండా చేసి నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఒక్కటే ఉండేలా చేసింది. కోర్టుల్లో న్యాయపోరాటాలు చేసినా కూడా రాష్ట్రాలు తమ పంతం నెగ్గించుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మెడికల్ సీట్ల […]

వైద్య విద్య.. పూర్తిగా కేంద్రం పరిధిలోకే..
X

మెడికల్ సీట్లు హాట్ కేకులనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ హాట్ కేకుల్ని కేంద్రం మొత్తంగా తన చేతిలోకి తీసుకోబోతోంది. రాష్ట్రాల అభ్యంతరాల్ని పక్కనపెట్టి మరీ, మెడికల్ ఎంట్రన్స్ పై ఈమధ్య కేంద్రం పెత్తనం సాధించింది. రాష్ట్రాలు సొంతంగా నిర్వహించుకుంటున్న ప్రవేశ పరీక్షలు చెల్లుబాటు కాకుండా చేసి నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఒక్కటే ఉండేలా చేసింది. కోర్టుల్లో న్యాయపోరాటాలు చేసినా కూడా రాష్ట్రాలు తమ పంతం నెగ్గించుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మెడికల్ సీట్ల విషయంలో కూడా కేంద్రం గుత్తాధిపత్యానికి తెరలేపింది. ఎంట్రన్స్ తో మొదలు పెట్టి, సీట్ల కేటాయింపు అధికారాల్ని కూడా కేంద్రం తన పరిధిలోకి తీసుకుంటోంది.

కేంద్రీకృత విధానంలో మెడికల్ కౌన్సెలింగ్‌ నిర్వహణపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించింది. ఇప్పటికే నీట్ ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రవేశాలను కూడా కేంద్ర పరిధిలో ఉంటాయని చెప్పింది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయిలో కేంద్రానికి తమ సమ్మతి తెలియజేశాయి. అదే సమయంలో పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కూడా కోరాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు.. స్థానిక, స్థానికేతర కోటా అమలులో ఉన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. తెలుగు రాష్ట్రాల్లో 371 ఆర్టికల్ అమలులో ఉందని చెప్పాయి. కేంద్రం ఈ అభ్యంతరాలపై సానుకూలంగా స్పందించి, రాష్ట్రాల్లో అమలులో ఉన్న నియమ నిబంధనలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌/పీజీలో ఉన్న వాటిలో 15% సీట్లను కేంద్రానికి అప్పగిస్తున్నాయి రాష్ట్రాలు. వీటిని నీట్‌ ర్యాంకు ఆధారంగా జాతీయ కోటాలో రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి కేంద్రం భర్తీ చేస్తోంది. మిగిలిన సీట్లను మళ్లీ రాష్ట్రాలకు కేటాయిస్తోంది. ఏపీ విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వాని చెందిన 85% సీట్లను, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని ఎ, బి, సి కేటగిరీ సీట్లను ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ భర్తీ చేస్తోంది. యాజమాన్య కోటాపై హక్కు ప్రైవేటు కాలేజీలదే. తెలంగాణాలో కె.ఎన్‌.ఆర్‌. ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా వైద్య విద్య సీట్ల భర్తీ జరుగుతోంది.

ఇకపై ఇలా..
కేంద్రం కొన్ని సీట్లు భర్తీ చేసి మిగిలినవాటిని రాష్ట్రాలకు అప్పగించడం, ఆ తర్వాత రాష్ట్రాలు కౌన్సెలింగ్ చేపట్టడం, ఎయిమ్స్, జిప్ మర్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేక విధానం ఉండటం.. ఇలా వేర్వేరు విధానాలను ఇప్పుడు కేంద్రం సమ్మిళితం చేయాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా ఒకటే ఎంట్రన్స్, ఒకటే కౌన్సెలింగ్ ఉండేలా కొత్త విధానం తీసుకొస్తోంది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. తెలుగు రాష్ట్రాలు సహా పంజాబ్‌, రాజస్థాన్‌, త్రిపుర, బీహార్‌, ఛత్తీస్‌ గఢ్‌, హర్యానా, కర్నాటక, ఉత్తరాఖండ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌, జమ్మూ-కశ్మీర్‌, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రభుత్వాలు ప్రాథమికంగా ఆమోదాన్ని తెలిపాయి.

ప్రస్తుత 2021-22 విద్యా సంవత్సరంలో ఈ కొత్త ప్రతిపాదన అమల్లోనికి వస్తుందా? లేదా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై మరిన్ని చర్చలు జరిగాక, అధికారిక నిర్ణయం వెలువడుతుంది.

First Published:  9 July 2021 10:54 PM GMT
Next Story