Telugu Global
National

బెంగాల్ రాజకీయం.. ఇదో సరికొత్త అధ్యాయం..

ఇప్పటి వరకూ పశ్చిమ బెంగాల్ లో జరిగిన రాజకీయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు వేరు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కూడా ఈస్థాయిలో రాజకీయాలు జరగడంలేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది పశ్చిమ బెంగాల్. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు మమతా బెనర్జీ. కంఫర్టబుల్ మెజార్టీతో టీఎంసీకి అధికారం వచ్చేసింది, ప్రతిపక్షంలో బీజేపీ కూర్చుంది, ఐదేళ్లపాటు ఇక ఇబ్బంది […]

బెంగాల్ రాజకీయం.. ఇదో సరికొత్త అధ్యాయం..
X

ఇప్పటి వరకూ పశ్చిమ బెంగాల్ లో జరిగిన రాజకీయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు వేరు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కూడా ఈస్థాయిలో రాజకీయాలు జరగడంలేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది పశ్చిమ బెంగాల్.

ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు మమతా బెనర్జీ. కంఫర్టబుల్ మెజార్టీతో టీఎంసీకి అధికారం వచ్చేసింది, ప్రతిపక్షంలో బీజేపీ కూర్చుంది, ఐదేళ్లపాటు ఇక ఇబ్బంది లేదు అనుకుంటున్న టైమ్ లో బెంగాల్ లో ప్రతిరోజూ జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనకు, సీఎం మమత డుమ్మా కొట్టడం దగ్గర్నుంచి, గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య జరుగుతున్న వాదోపవాదాపు.. ఇలా ప్రతి అంశమూ, ప్రతిరోజూ హైలెట్ అవుతున్నాయి. ఎన్నికల వేళ జరిగిన రాజకీయ క్రీడ కంటే, ఎన్నికల తర్వాత ఇది మరింత ఆసక్తికరంగా మారింది.

తాజాగా మమతను సీఎం కుర్చీనుంచి దింపేందుకు బీజేపీ మరో కొత్త ఎత్తుగడ వేసింది. సభలో సభ్యురాలు కాకుండానే సీఎం పదవి చేపట్టిన మమత 6 నెలల్లోగా ఎన్నికల్లో నెగ్గాలి. అలా కుదరకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి. ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం ఇదే సమస్యతో రాజీనామా చేయగా, మమతపై ఒత్తిడి పెంచేందుకు కాషాయదళం ప్లాన్ వేసింది. కానీ మమత ఏకంగా మండలినే పునరుద్ధరించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే దీన్ని ఆమోదించే టెక్నికల్ అంశం కేంద్రం చేతిలో ఉండటం విశేషం.

పీఏసీ పదవి విషయంలో కొత్త సంప్రదాయం..
సహజంగా ఏ రాష్ట్రంలో అయినా ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కేటాయిస్తారు. బెంగాల్ లో ఆ పదవికోసం బీజేపీ ఆరుగురు ఎమ్మెల్యేల పేర్లను ప్రభుత్వానికి సూచించింది. అయితే టెక్నికల్ గా బీజేపీని దెబ్బకొట్టారు మమతా బెనర్జీ. బీజేపీ టికెట్ పై గెలిచి, ప్రస్తుతం టీఎంసీలో చేరినన కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కి ఆ పదవి కట్టబెట్టారు. ముకుల్ రాయ్ టీఎంసీలో చేరినా ప్రస్తుతానికి ఆయన బీజేపీ ఎమ్మెల్యేనే. అసెంబ్లీ రికార్డుల్లో కూడా అదే ఉంటుంది. అందుకే తెలివిగా మమత ముకుల్ రాయ్ ని పీఏసీ చైర్మన్ ని చేసి, అసలు బీజేపీ ఊసే లేకుండా చేయాలనుకుంటున్నారు. సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు.

ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు, ఇటీవల ఫేక్ వ్యాక్సినేషన్ కుంభకోణం.. ఇలా ప్రతి విషయంలోనూ బీజేపీ, టీఎంసీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పథకాలను ప్రకటించడం, సంక్షేమ కార్యక్రమాలను అమలులోకి తేవడంలో బిజీగా ఉన్నా కూడా.. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకే మమత ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. అటు ప్రతిపక్షనేత సువేందు అధికారి కూడా అదే స్థాయిలో మమతను ధీటుగా ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నారు. కేంద్రం కూడా బెంగాల్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎన్నికల సమయంలో రాజకీయాలు సరే, ఎన్నికల తర్వాత కూడా బెంగాల్ రాజకీయం రణరంగాన్ని తలపించడం విశేషం.

First Published:  9 July 2021 10:06 PM GMT
Next Story