Telugu Global
NEWS

జల వివాదం సశేషం.. కృష్ణా బోర్డ్ మీటింగ్ వాయిదా..

అత్యవసరంగా కృష్ణా బోర్డ్ మీటింగ్ జరపాలని, తెలంగాణ వృథా చేస్తున్న నీటికి అడ్డుకట్ట వేయాలని ఏపీ ప్రభుత్వం కోరిన మీదట.. త్రిసభ్య కమిటీ సమావేశానికి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ సిద్ధపడింది. అయితే మీటింగ్ జరపొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం కోరడం, తాము హాజరుకాబోమని తెగేసి చెప్పడంతో అనివార్యంగా అది వాయిదా పడింది. త్రిసభ్య కమిటీ సమావేశంతో అద్భుతాలు జరుగుతాయని అనుకోలేం కానీ, కనీసం తెలంగాణ ప్రభుత్వ వైఖరిని బోర్డు తప్పుబట్టడమో, లేక కేంద్రానికి నివేదిక ఇవ్వడమో […]

జల వివాదం సశేషం.. కృష్ణా బోర్డ్ మీటింగ్ వాయిదా..
X

అత్యవసరంగా కృష్ణా బోర్డ్ మీటింగ్ జరపాలని, తెలంగాణ వృథా చేస్తున్న నీటికి అడ్డుకట్ట వేయాలని ఏపీ ప్రభుత్వం కోరిన మీదట.. త్రిసభ్య కమిటీ సమావేశానికి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ సిద్ధపడింది. అయితే మీటింగ్ జరపొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం కోరడం, తాము హాజరుకాబోమని తెగేసి చెప్పడంతో అనివార్యంగా అది వాయిదా పడింది. త్రిసభ్య కమిటీ సమావేశంతో అద్భుతాలు జరుగుతాయని అనుకోలేం కానీ, కనీసం తెలంగాణ ప్రభుత్వ వైఖరిని బోర్డు తప్పుబట్టడమో, లేక కేంద్రానికి నివేదిక ఇవ్వడమో జరిగి ఉండేవి. కానీ అసలు మీటింగే లేకుండా రద్దు కావడం ఏపీకి నిరాశ కలిగించే అంశమే.

కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్ లతో త్రిసభ్య కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశంపై సుముఖత వ్యక్తం చేయలేదు. నీటి వాటాలో తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అజెండాలో చేర్చలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌ ఏర్పాటు చేయాలని కోరింది. కొత్తగా బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎంపీ సింగ్‌ దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్ లకు బోర్డ్ సభ్యకార్యదర్శి డీఎం రాయ్ పురే వర్తమానం పంపారు. మళ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది లేఖ ద్వారా తెలియజేస్తామన్నారు.

త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడటంతో.. పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరిగే వరకు జల జగడం కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నీటిని రోజుకి 4 టీఎంసీల మేర కిందకు విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అటు పులిచింతలలో కూడా ఇదే పరిస్థితి. ఈ నీరంతా వృథాగా సముద్రంపాలవుతుందంటూ ఏపీ ఫిర్యాదు చేసింది. దీన్ని కూడా తెలంగాణకు కేటాయించిన నీటివాటాలో కలపాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. కృష్ణా జలాల్లో ఏపీ వాటా 66శాతం, తెలంగాణ వాటా 34శాతం లెక్కలు ఇక చెల్లవంటోంది. ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలంటోంది. కృష్ణా బోర్డ్ ముందు కూడా తెలంగాణ ఇదే వాదన వినిపించబోతోంది. ఈ నేపథ్యంలో జలజగడం మరింత ముదిరింది.

First Published:  8 July 2021 8:33 PM GMT
Next Story