Telugu Global
NEWS

తెలంగాణలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చేనా..?

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ యాక్టివిటీ పెరిగింది. రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆ సందడి మరింత భారీ స్థాయిలో కనిపించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు పొన్నాల లక్ష్మయ్య. ఆయన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరేళ్లపాటు ఆ పదవిలో ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డి టీపీసీసీకి మూడో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో గాంధీభవన్ […]

తెలంగాణలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చేనా..?
X

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ యాక్టివిటీ పెరిగింది. రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆ సందడి మరింత భారీ స్థాయిలో కనిపించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు పొన్నాల లక్ష్మయ్య. ఆయన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరేళ్లపాటు ఆ పదవిలో ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డి టీపీసీసీకి మూడో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో గాంధీభవన్ లో సందడి లేదు. రేవంత్ బాధ్యతల స్వీకారోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో సందడి వాతావరణం నెలకొంది.

ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌ నుంచి రేవంత్ రెడ్డి బయలుదేరగా.. ఆయన గాంధీభవన్‌ కు చేరేందుకు 3 గంటలకుపైగా సమయం పట్టింది. నాయకులు, కార్యకర్తలు.. బైక్ లు, ఆటోలు, కార్లలో తరలివచ్చారు. హైదరాబాద్ లోని వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. పీసీసీ కార్యవర్గం బాధ్యతలు చేపట్టే కార్యక్రమం లాంఛనంగా కాకుండా అట్టహాసంగా సాగింది. వివిధ రాష్ట్రాలనుంచి కాంగ్రెస్ అధినేతలు, కేంద్రంలోని పెద్దలు హైదరాబాద్ తరలి వచ్చారు. మొత్తమ్మీద తన రాకతో కాంగ్రెస్ లో హుషారు వచ్చిందనే సంకేతాన్ని అధిష్టానానికి పంపించగలిగారు రేవంత్ రెడ్డి. బహుశా రేవంత్ కాకుండా ఇంకెవరికైనా ఆ పదవి వచ్చి ఉంటే.. ఈ స్థాయిలో హంగామా జరిగేది కాదు అని చర్చ మొదలయ్యేలా చేశారు.

ప్రమాణ స్వీకారం సరే.. భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది, పీసీసీ ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా మిగతా అందరూ రేవంత్ కి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శుభాకాంక్షలు తెలిపారు, అసంతృప్తుల్లో చాలామంది గాంధీ భవన్ కి వచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, భవిష్యత్ లో కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి ఎలా నడిపించగలరనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎన్నికలకింకా మూడేళ్లు సమయం ఉంది. కనుచూపు మేరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ని నిలువరించి, టీఆర్ఎస్ కి పోటీగా బీజేపీ ఎదుగుతోంది. ఈ దశలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకు రావడం అసంభవమే అయినా, బీజేపీని పక్కనపెట్టి ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ ని ఇరుకున పెట్టేందుకు రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి కార్యకర్త రెండేళ్లపాటు ఫ్యామిలీకి సెలవు పెట్టి, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. పీసీసీ పదవి లేనప్పుడే రాష్ట్రంలో పాదయాత్రకు సిద్ధపడి, సీనియర్ల పోరుతో వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రమంతా కలియదిరుగుతారనడంలో సందేహం లేదు. అదే సమయంలో టీఆర్ఎస్ ని కానీ, కేసీఆర్ ని కానీ.. తీవ్ర స్థాయిలో విమర్శించడంలో మిగతా కాంగ్రెస్ నేతలకంటే రేవంత్ రెడ్డి రెండు అడుగులు ముందే ఉంటారు.

తనకి పీకేలాంటి వ్యూహకర్తలు అవసరం లేదని, కార్యకర్తలే ఏకే-47లు అంటూ తొలిరోజే అందర్నీ హుషారెత్తించారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు పట్టిన గులాబి చీడ వదిలించాలని, టీఆర్ఎస్, బీజేపీలను పాతరేయాలని, ప్రగతిభవన్ లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగించాలని పంచ్ డైలాగులు విసిరారు. జై సోనియా, జై రాహుల్.. ఈ రెండు నినాదాలే వినిపించాలని అనుచరులకు సూచించిన రేవంత్ రెడ్డి.. తొలిరోజు హంగామాని ఇలాగే కొనసాగించగలిగితే.. తెలంగాణలో కాంగ్రెస్ కోలుకునే అవకాశం ఉంది.

First Published:  7 July 2021 9:12 PM GMT
Next Story