Telugu Global
National

12మందిపై వేటు.. 36మందికి చోటు.. మోదీ కొత్త టీమ్..

కేంద్ర కేబినెట్ విస్తరణ ఊహలకు అందకుండా సాగింది. కొత్తవారిని తీసుకోవడంలో అందరి అంచనాలు నిజమయ్యాయి కానీ, పాతవారిని తొలగించే విషయంలో మోదీ అంత సాహసం చేస్తారని ఎవరూ అనుకోలేదు. మొత్తం 12మంది పాతవారిపై వేటు వేసిన మోదీ, థావర్ చంద్ గహ్లాత్ వంటి వారికి గవర్నర్ పదవులిచ్చి న్యాయం చేసినా, మిగతా వారి విషయంలో కఠినంగా ఉన్నట్టు స్పష్టమైంది. సీనియర్లైన ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, సమాచార ప్రసార శాఖ మంత్రి […]

12మందిపై వేటు.. 36మందికి చోటు.. మోదీ కొత్త టీమ్..
X

కేంద్ర కేబినెట్ విస్తరణ ఊహలకు అందకుండా సాగింది. కొత్తవారిని తీసుకోవడంలో అందరి అంచనాలు నిజమయ్యాయి కానీ, పాతవారిని తొలగించే విషయంలో మోదీ అంత సాహసం చేస్తారని ఎవరూ అనుకోలేదు. మొత్తం 12మంది పాతవారిపై వేటు వేసిన మోదీ, థావర్ చంద్ గహ్లాత్ వంటి వారికి గవర్నర్ పదవులిచ్చి న్యాయం చేసినా, మిగతా వారి విషయంలో కఠినంగా ఉన్నట్టు స్పష్టమైంది. సీనియర్లైన ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, విద్యాశాఖ మంత్రి రమేష్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌ పై కూడా వేటు పడటం బీజేపీ వర్గాలనే విస్మయానికి గురిచేసింది.

36మందికి చోటు..
ఈ ఏడాది జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు, వచ్చే ఏడాది జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో కొత్తవారికి తన టీమ్ లో చోటిచ్చారు మోదీ. మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాలకు అవకాశం కల్పించారు. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జేడీయూ, లోక్‌ జనశక్తి పార్టీ, అప్నాదళ్‌ పార్టీలకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించారు మోదీ. జేడీయూ జాతీయ అధ్యక్షుడు రామచంద్రప్రసాద్‌ సింగ్, లోక్‌ జనశక్తి నేత పశుపతి కుమార్‌ పారస్, అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్‌ పటేల్‌ ను కేబినెట్ లోకి తీసుకున్నారు.

మోదీ కొత్త టీమ్ లో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరితో సహా మొత్తం 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 36 మంది కొత్త వారు కాగా.. ఇప్పటికే స్వతంత్ర, సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తం 77 మంది మంత్రులతో సరికొత్త మంత్రి మండలిని కొలువుదీర్చారు మోదీ. ప్రధానితో కలిపి మంత్రుల సంఖ్య 78 కి చేరగా, గరిష్టంగా 81 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది.

హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేబినెట్‌ ర్యాంక్‌ లభించింది. ఆయనకు పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖను కేటాయించారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. తమిళనాడుకు చెందిన ఎల్‌ మురుగన్‌ ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. ఆయనను పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. హోంశాఖ, యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రిగా నిశిత్‌ ప్రామానిక్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన వయసు కేవలం 35 సంవత్సరాలు. మోదీ కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కుడు ఆయనే. మొత్తమ్మీద.. ఉద్వాసనల విషయంలో ఊహలకు అందని నిర్ణయాలు తీసుకుని, ఎన్నికలకోసం కొత్త టీమ్ ని సిద్ధం చేసుకున్నారు మోదీ.

First Published:  7 July 2021 8:55 PM GMT
Next Story