Telugu Global
NEWS

జల జగడాన్ని కేంద్రం తీర్చాల్సిందే.. మోదీకి జగన్ మరో లేఖ

ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన జల వివాదాన్ని పరిష్కరించాలంటూ, ఆ దిశగా కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలివ్వాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి మరో లేఖను రాశారు ఏపీ సీఎం జగన్. సముద్రంలోకి నీటిని వృథాగా విడిచిపెడుతున్న తెలంగాణ చర్యలను తక్షణం అడ్డుకోవాలని కోరారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 19టీఎంసీలు వృథాగా కిందకు విడిచిపెట్టారని, రోజుకి సగటున 4 టీఎంసీల నీటిని కేవలం విద్యుత్ ఉత్పత్తికోసం వాడుకుంటూ, ఏపీకి అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే […]

జల జగడాన్ని కేంద్రం తీర్చాల్సిందే.. మోదీకి జగన్ మరో లేఖ
X

ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన జల వివాదాన్ని పరిష్కరించాలంటూ, ఆ దిశగా కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలివ్వాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి మరో లేఖను రాశారు ఏపీ సీఎం జగన్. సముద్రంలోకి నీటిని వృథాగా విడిచిపెడుతున్న తెలంగాణ చర్యలను తక్షణం అడ్డుకోవాలని కోరారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 19టీఎంసీలు వృథాగా కిందకు విడిచిపెట్టారని, రోజుకి సగటున 4 టీఎంసీల నీటిని కేవలం విద్యుత్ ఉత్పత్తికోసం వాడుకుంటూ, ఏపీకి అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పథకం ప్రకారమే తెలంగాణ చర్యలు..
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకంటే ఎక్కువ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రోజూ 44వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తరలించగలరు. అయితే తెలంగాణ మొండి వైఖరితో.. జలాశయంలోకి వచ్చిన నీటిని వచ్చినట్టు తరలిస్తుండటంతో.. నీటిమట్టం 854 అడుగులు మించి పెరగడంలేదు. దీంతో పోతిరెడ్డిపాడు నుంచి రోజుకి కనీసం 6వేల క్యూసెక్కుల నీటిని కూడా ఏపీ తీసుకోలేకపోతోంది. దీనివల్ల చెన్నైకి తాగునీటిని అందించే తెలుగు గంగ కాల్వతోపాటు కేసీ కెనాల్, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీకి నీరివ్వలేకపోతున్నారు అధికారులు. దీంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీరని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్.

ఏపీ డిమాండ్లు ఇవీ..
– జల విద్యుత్ ఉత్పత్తికోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 34ను వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్రం ఆదేశాలివ్వాలి.
– శ్రీశైలంలో కనీస నీటిమట్టం ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేపట్టేలా ఆదేశాలివ్వాలి.
– ఇప్పటి వరకూ తెలంగాణ వృథా చేసిన నీటిని, కృష్ణాలో వారి వాటా (299టీఎంసీలు) నుంచి మినహాయించాలి.
– పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల, కల్వకుర్తి పథకం స్థాయి పెంపు, ఎస్ఎల్బీసీ విస్తరణ.. పేరుతో తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్ లను నిలువరించాలి.
– విభజన చట్టంలో 11వ షెడ్యూలులో ప్రకటించిన ఏపీ ప్రాజెక్ట్ లను అడ్డుకోకుండా కేంద్రం స్పష్టమైన ఆదేశాలివ్వాలి.
– పర్యావరణ అనుమతులు, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్న రాయలసీమ ఎత్తిపోతలకు క్లియరెన్స్ ఇప్పించాలి.

కేంద్ర జలశక్తిశాఖకు, కృష్ణా బోర్డుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని లేఖలో ప్రస్తావించారు సీఎం జగన్. కృష్ణా బోర్డు పని తీరు ప్రభావవంతంగా లేదని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ హక్కులు కాపాడాల్సిన సమయంలోనూ స్పందించడం లేదని వెంటనే కేంద్రం కలుగజేసుకోవాలని కోరారు.

First Published:  7 July 2021 8:36 PM GMT
Next Story