స్టాన్ స్వామి.. గిరిజనుల ఆత్మీయ మిత్రుడు..
స్టాన్ స్వామి. మూడు రోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నపేరిది. ఆదివాసీల హక్కుల పోరాటంలో స్టాన్ స్వామిది ఐదు దశాబ్దాల భాగస్వామ్యం. తమిళనాడులో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన స్టాన్ స్వామి, మనీలాలో చదువుకొన్నారు. అక్కడే ఆయన క్రైస్తవం వైపు ఆకర్షితులయ్యారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులో చర్చి ఫాదర్ గా పనిచేస్తూనే దళితుల కోసం పాఠశాల నెలకొల్పారు. అలా ఆయనకు ‘ఫాదర్ స్టాన్ స్వామి’గా పేరుపడింది. ఆ తర్వాత జార్ఖండ్ కి తన మకాం మార్చిన […]
స్టాన్ స్వామి. మూడు రోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నపేరిది. ఆదివాసీల హక్కుల పోరాటంలో స్టాన్ స్వామిది ఐదు దశాబ్దాల భాగస్వామ్యం. తమిళనాడులో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన స్టాన్ స్వామి, మనీలాలో చదువుకొన్నారు. అక్కడే ఆయన క్రైస్తవం వైపు ఆకర్షితులయ్యారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బెంగళూరులో చర్చి ఫాదర్ గా పనిచేస్తూనే దళితుల కోసం పాఠశాల నెలకొల్పారు. అలా ఆయనకు ‘ఫాదర్ స్టాన్ స్వామి’గా పేరుపడింది.
ఆ తర్వాత జార్ఖండ్ కి తన మకాం మార్చిన స్టాన్ స్వామి, ఆదివాసీ హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో భాగస్వామి అయ్యారు. ప్రభుత్వ విధానాలు ఆదివాసీలను ప్రకృతి సహజ వనరుల నుండి దూరం చేసి వారిని పేదరికంలోకి ఎలా నెట్టివేస్తున్నాయో నిరూపించారు. భారతదేశపు జైళ్ళలో దాదాపు 30 శాతం మంది ఆదివాసీలు అకారణంగా మగ్గిపోతున్నారని తన పరిశోధనలో కనుగొన్నారు. 2016లో జైళ్లలో మగ్గిపోతున్న గిరిజనులపై పరిశోధన చేసి, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారి విడుదలకోసం కృషిచేశారు. ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీల భూములను ప్రభుత్వం లాగేసుకున్నప్పుడు వారు చేస్తున్న ఉద్యమంలో స్టాన్ స్వామి భాగస్వామి అయ్యారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేశారు.
2017 లో భీమా కోరే గావ్ కేసులో పోలీసులు ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయనపై ఉపా కేసు పెట్టి, జైలులో వేశారు. భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టైన వారిలో అత్యంత వృద్ధులు స్టాన్ స్వామి కావడం విశేషం. అసలు తాను భీమా కోరేగావ్ వెళ్లలేదని ఎంత మొత్తుకున్నా, ఆయన్ను పోలీసులు వదిలిపెట్టలేదు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అరెస్ట్ చేశారు. ఈ విషయంలో యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అధినేతలు కూడా కేంద్ర ప్రభుత్వానిదే తప్పని ఆరోపించారు.
క్యాన్సర్ ,పార్కిన్సన్ వ్యాధులతో, వృద్ధాప్యపు సమస్యలతో బాధపడుతున్న స్టాన్ స్వామి జైలులో మరిన్ని చిత్రవధలు అనుభవించారు. మంచినీళ్ళు తాగేందుకు గ్లాసు కూడా సరిగ్గా పట్టుకోలేని పరిస్థితుల్లో, స్ట్రా కానీ సిప్పర్ కానీ ఇప్పించాలని వేడుకున్నా, జైలు అధికారులు నిరాకరించారు. కోర్టులో అప్పీలు చేస్తే జడ్జి కూడా కుదరదన్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ముంబై జైలుకి ఆయన్ను తరలించారు. ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది, కరోనా సోకింది. సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈనెల 5న ముంబై ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.