Telugu Global
National

స్టాన్ స్వామి మరణం.. ప్రపంచం ముందు దోషిగా మోదీ ప్రభుత్వం..

భీమాకోరేగావ్ అల్లర్లు, ఎల్గార్ పరిషద్ కేసులో భారత ప్రభుత్వం అరెస్ట్ చేసిన గిరిజన హక్కుల నాయకుడు ఫాదర్ స్టాన్ స్వామి మరణంతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడింది. ఫాదర్ స్టాన్ స్వామిని తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని, అనారోగ్యంతో జైలులో ఆయన చనిపోడానికి కారణం మోదీ ప్రభుత్వమేననే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దశలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం ప్రతినిధి ‘మేరీ లాలర్’ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. స్టాన్ […]

స్టాన్ స్వామి మరణం.. ప్రపంచం ముందు దోషిగా మోదీ ప్రభుత్వం..
X

భీమాకోరేగావ్ అల్లర్లు, ఎల్గార్ పరిషద్ కేసులో భారత ప్రభుత్వం అరెస్ట్ చేసిన గిరిజన హక్కుల నాయకుడు ఫాదర్ స్టాన్ స్వామి మరణంతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడింది. ఫాదర్ స్టాన్ స్వామిని తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని, అనారోగ్యంతో జైలులో ఆయన చనిపోడానికి కారణం మోదీ ప్రభుత్వమేననే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దశలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం ప్రతినిధి ‘మేరీ లాలర్’ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. స్టాన్ స్వామిని తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల విభాగం ప్రతినిధి ఎమాన్ గిల్మోర్ కూడా ఇదే విషయంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 9నెలల క్రితం స్టాన్ స్వామిని అరెస్ట్ చేసినప్పటినుంచి.. భారత్ తో యూరోపియన్ యూనియన్ చర్చలు జరుపుతోందని, అయినా కూడా ఫలితం లేదని, చివరకు ఆయన జైలులోనే చనిపోవాల్సి వచ్చిందని అన్నారు. అంతర్జాతీయ సంస్థలనుంచి వస్తున్న ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించకపోవడం విశేషం.

ఎవరీ స్టాన్ స్వామి..?
తమిళనాడుకి చెందిన స్టాన్ స్వామి దళితులు, అణగారిన వర్గాల తరపున గళమెత్తే సామాజిక కార్యకర్త, గిరిజన హక్కుల ఉద్యమ నాయకుడు. కేవలం దళితులు, వెనకబడిన వర్గాలకోసం బెంగళూరులో స్కూలు నడిపేవారు. ఆ తర్వాత జార్ఖండ్ కి వచ్చి అక్కడి ఆదివాసీల హక్కులకోసం ఉద్యమిస్తున్నారు. మావోయిస్ట్ లు గా ముద్రపడి జైళ్లలో మగ్గిపోతున్న ఆదివాసీలకోసం న్యాయపోరాటం చేసేవారు. ఈ క్రమంలో భీమాకోరేగావ్ సమావేశానికి ఎల్గార్ పరిషద్ తరపున ఆయన కూడా హాజరయ్యారు. అయితే ఆ సమావేశానికి, మావోయిస్ట్ నాయకులకు సంబంధం ఉందని, ప్రధాని నరేంద్రమోదీ హత్యకు కుట్రజరిగిందని ఆరోపిస్తూ.. చాలామంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వరవరరావు కూడా ఉన్నారు. అలా అరెస్టయినవారిలో 84 ఏళ్ల స్టాన్‌ స్వామి అత్యంత పెద్దవయసు వారు. అప్పటికే ఆయన పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. జైలులో ఆయన మంచినీరు తాగేందుకు కూడా గ్లాసు పైకెత్తి పట్టుకోలేకపోయేవారు. దానికోసం ఓ సిప్పర్, స్ట్రా కావాలని అడిగితే జైలు అధికారులు నిరాకరించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిప్పర్ ఫర్ స్టాన్ పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ ఉద్యమమే నడిచింది. చాలామంది సిప్పర్లు ఆన్ లైన్ లో కొని జైలుకు పంపించారు.

ఈ క్రమంలో మే నెలలో స్టాన్ స్వామికి కోవిడ్ సోకింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తలోజా సెంట్రల్ జైలునుంచి ఆయనను ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. జూలై 5న ఆస్పత్రిలోనే ఆయన మరణించారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్ అని ధృవీకరించారు.

స్టాన్ స్వామి మరణంతో దేశంలో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం దమనకాండని నిరసిస్తున్నామంటూ రాహుల్ గాంధీ సహా అందరు నేతలు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు ఉంచారు. దేశంలోని ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవచ్చు, కొట్టిపారేయవచ్చు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు మోదీ ప్రభుత్వం దోషిగా నిలబడుతోంది. యూరోపియన్ యూనియన్ సహా, ఐక్యరాజ్యసమితి కూడా ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందిస్తోంది. తప్పుడు కేసులో అరెస్ట్ చేశారంటూ ఐక్యరాజ్యసమితి అధికారులు నేరుగా ఆరోపణలు చేస్తున్నారంటే, అంతర్జాతీయ వేదికపై భారత కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడిందనే చెప్పాలి. ఇప్పటికైనా అన్యాయంగా అరెస్ట్ చేసిన మిగిలిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రపంచ దేశాల మానవ హక్కుల ప్రతినిధులు.

First Published:  5 July 2021 10:21 PM GMT
Next Story