Telugu Global
National

మహా రాజకీయాల్లో ఫడ్నవీస్ కలకలం..

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఆమధ్య ప్రధాని నరేంద్రమోదీని, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కలవడంతో ఆ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టే.. తమ మధ్య శతృత్వం ఎప్పుడూ లేదని ఉద్ధవ్ సెలవిచ్చారు కూడా. ఆ తర్వాత శివసేన నాయకులు కొంతమంది, బీజేపీతో దోస్తీకోసం ఉద్ధవ్ కు లేఖ రాయడం కూడా కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో ఒంటరిపోరు […]

మహా రాజకీయాల్లో ఫడ్నవీస్ కలకలం..
X

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఆమధ్య ప్రధాని నరేంద్రమోదీని, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కలవడంతో ఆ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టే.. తమ మధ్య శతృత్వం ఎప్పుడూ లేదని ఉద్ధవ్ సెలవిచ్చారు కూడా. ఆ తర్వాత శివసేన నాయకులు కొంతమంది, బీజేపీతో దోస్తీకోసం ఉద్ధవ్ కు లేఖ రాయడం కూడా కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో ఒంటరిపోరు అంటూ నోరు జారడం, వెంటనే శివసేన కౌంటర్ ఇవ్వడం.. ఇలాంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. శివసేనపై ఎనలేని ప్రేమ కురిపించడంతో మరోసారి మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.

మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన త‌మ‌కు శ‌తృవు కాదనీ, ఎన్న‌టికీ శివ‌సేన‌ను అలా చూడ‌బోమ‌ని, వారు ఎప్ప‌టికీ మాకు మిత్రులే అని ఫ‌డ్నవీస్ తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీలు కలసి పనిచేసే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు. రాజకీయాల్లో పొత్తులు శాశ్వతం కాదని, అప్పటికప్పుడు స్థానిక సమస్యల ఆధారంగా అన్నీ సర్దుకుంటాయని అన్నారు. శివసేనతో తిరిగి కలసి పనిచేస్తారా అనే ప్రశ్నకు.. 2019 ఎన్నికల్లో తాము కలసి పోటీ చేశామనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాతే శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కూటమి కట్టిందని అన్నారు.

మరోవైపు శివసేన, బీజేపీ నేతల రహస్య భేటీపై కూడా మహారాష్ట్రలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మహా వికాస్ అగాఢీ కూటమికి రోజులు దగ్గరపడ్డాయని, కూటమి నుంచి శివసేన బయటకు వస్తుందనే ఊహాగానాలున్నాయి. గతంలో శివసేన ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయడంతో, బీజేపీ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ సహకారంతోనే తొలిసారిగా మహారాష్ట్రలో శివసేన నేత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. రోజులు గడిచేకొద్దీ బీజేపీ, శివసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కూటమిని కూలగొట్టేందుకు రోజుకో రకంగా స్టేట్ మెంట్లిస్తున్నారు బీజేపీ నేతలు.

First Published:  4 July 2021 8:45 PM GMT
Next Story