Telugu Global
National

సెకండ్ వేవ్ ముగిసిపోలేదు.. డెల్టా ప్లస్ కి థర్డ్ వేవ్ కి సంబంధం లేదు..

భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువవుతోందని, ఇటీవల కేసుల సంఖ్య కూడా పెరిగిందనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, కర్నాటకలో దాదాపు 40 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు గుర్తించారు. సెకండ్ వేవ్ తో డెల్టా కథ ముగిసిందని, థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ విజృంభిస్తుందని అంటున్నారు. కానీ కొత్త వేరియంట్ కి థర్డ్ వేవ్ కి సంబంధం లేదని చెబుతున్నారు ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ […]

సెకండ్ వేవ్ ముగిసిపోలేదు.. డెల్టా ప్లస్ కి థర్డ్ వేవ్ కి సంబంధం లేదు..
X

భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువవుతోందని, ఇటీవల కేసుల సంఖ్య కూడా పెరిగిందనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, కర్నాటకలో దాదాపు 40 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు గుర్తించారు. సెకండ్ వేవ్ తో డెల్టా కథ ముగిసిందని, థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ విజృంభిస్తుందని అంటున్నారు. కానీ కొత్త వేరియంట్ కి థర్డ్ వేవ్ కి సంబంధం లేదని చెబుతున్నారు ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్తలు. డెల్టా ప్లస్ వేరియంట్ కి, థర్డ్ వేవ్ కి సంబంధం ఉందనే ఆధారాలేవీ లేవని అన్నారు ఐజీఐబీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగల్వాల్. అసలు దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తొలగిపోలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరోనా సెకండ్‌ వేవ్‌ ముగిసిపోలేదనే విషయంపై ఆందోళన చెందాలని.. డెల్టా ప్లస్‌, థర్డ్‌ వేవ్‌పై కాదని చెప్పారు.

ఐజీఐబీ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మహారాష్ట్ర నుంచి సేకరించిన నమూనాలను క్రమబద్ధీకరించి పరిశోధనలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్లు ఎక్కువగా కనపడుతున్నాయని, అయితే అవి రోజువారీ కేసుల్లో 1శాతం కంటే తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా డెల్టా వేరియంట్ వ్యాప్తి సాధారణంగానే ఉందని చెప్పారు. అంటే.. కొత్త వేరియంట్ తో ముప్పు ఎక్కువగా ఉంటుందని చెప్పలేమని, అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ కి, థర్డ్ వేవ్ కి సంబంధం లేదని కూడా చెబుతున్నారు.

కేరళలో తగ్గని ప్రభావం..
దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల నమోదవుతున్నా.. కేర‌ళ‌లో మాత్రం ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. అక్క‌డ ఇప్ప‌టికీ 10 వేల‌కు త‌గ్గ‌కుండా రోజువారీ కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్త‌గా 12,787 మందికి క‌రోనా పాజిటివ్ తేలింది. రోజువారీ మ‌ర‌ణాలు కూడా ప్ర‌తిరోజూ 100కు త‌గ్గ‌కుండా న‌మోద‌వుతున్నాయి. కేసులు భారీగా న‌మోద‌వుతున్నా అందుకు త‌గ్గ‌ట్టుగానే రిక‌వ‌రీలు కూడా ఉండటం సంతోషించదగ్గ విషయం.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల హెచ్చుతగ్గులు చూస్తుంటే.. అసలు సెకండ్ వేవ్ పూర్తి కాకుండానే థర్డ్ వేవ్ వస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిందనే భావనతో అన్ లాక్ పూర్తిగా అమలు చేస్తున్నారు. జన జీవనం సాధారణ స్థితికి వచ్చి చేరుతోంది. ఈ దశలో కేసులు మళ్లీ విజృంభిస్తే కచ్చితంగా మూడో విపత్తుకి మనమే చేజేతులా అవకాశం ఇచ్చినట్టవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగినా, పెరగకపోయినా.. మూడో విపత్తు తప్పదని అంటున్నారు.

First Published:  23 Jun 2021 10:01 PM GMT
Next Story