Telugu Global
National

దేశంలో థర్డ్ ఫ్రంట్ బలాలు.. బలహీనతలు..

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభ మసకబారుతోంది, కాంగ్రెస్ కి జవసత్వాలు పుంజుకోవడం కష్టంగా మారింది. బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమికోసం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇంట్లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీకంటే ముందు శరద్ పవార్ తో, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు దఫాలు సమావేశం కావడం మరింత చర్చనీయాంశమైంది. ఢిల్లీ మీటింగ్ తర్వాత ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని, కీలక ప్రకటన ఉంటుందని […]

దేశంలో థర్డ్ ఫ్రంట్ బలాలు.. బలహీనతలు..
X

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభ మసకబారుతోంది, కాంగ్రెస్ కి జవసత్వాలు పుంజుకోవడం కష్టంగా మారింది. బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమికోసం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇంట్లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీకంటే ముందు శరద్ పవార్ తో, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు దఫాలు సమావేశం కావడం మరింత చర్చనీయాంశమైంది. ఢిల్లీ మీటింగ్ తర్వాత ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని, కీలక ప్రకటన ఉంటుందని ఊహించినవారంతా ఉసూరుమన్నారు. శరద్ పవార్ ఇంట్లో జరిగిన మీటింగ్ లో ఏదీ తెగలేదు, తెల్లారలేదు. బయటకొచ్చినవారంతా అది రాజకీయ భేటీ కాదని చెప్పడం మరో విశేషం. దేశంలోని సమస్యలపైనే తాము చర్చించామని సెలవిచ్చారు విపక్ష నేతలు.

ఇటీవల 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశలకు గండిపడింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. అదే సమయంలో స్థానికంగా ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు మరింత బలపడ్డాయి. వచ్చేఏడాది ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందనే అంచనాలున్నాయి. దీంతో సహజంగానే విపక్షాల్లో ఐక్యత వచ్చింది, ఆశ పెరిగింది. పనిలో పనిగా కాంగ్రెస్ ని కూడా కలుపుకొని వెళ్లాలనేదే వీరి ప్రయత్నం. అందులోనూ మీటింగ్ కి ఆతిథ్యమిచ్చిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్రలో మహా ఘట్ బంధన్ పేరుతో కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నారు. ఈ మీటింగ్ కి కాంగ్రెస్ కి కూడా ఆహ్వానం ఉన్నా.. ఆ పార్టీ నేతలు హాజరు కాలేదు.

ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించిన తృణమూల్ కాంగ్రెస్ తరపున, బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, ప్రస్తుత విపక్ష కూటమికి నేతృత్వం వహించడం మరో విశేషం. రాష్ట్రీయ మంచ్ పేరుతో ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తేవాలని చూస్తున్న యశ్వంత్ సిన్హా, ఈ మీటింగ్ లో కీలకంగా వ్యవహరించారు. సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ, ఆర్ఎల్డీ, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్, సీీపీఐ, సీపీఎం, జేడీయూ.. నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

శరద్ పవార్ ఇంట్లో సమావేశమైన నేతలంతా అది రాజకీయ భేటీ కాదని చెప్పినప్పటికీ.. తాజా పరిణామం ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుకు ఆరంభం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, రాష్ర్టాల్లో బీజేపీని ప్రాంతీయ పార్టీలు నిలువరిస్తుండటంతో.. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని చెబుతున్నారు. అయితే ప్రాంతీయ కూటమి వచ్చే ఎన్నికలనాటికి బలపడుతుందా, లేక ఎవరి దారి వారు చూసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. విడివిడిగా పోటీ చేసి, ఎన్నికల తర్వాత కలివిడిగా ఉంటామంటే.. కుదరని పని. ఓట్లలో చీలిక వచ్చి అది బీజేపీకే లాభం చేకూరుస్తుంది. ఎన్నికల ముందే విభేదాలు పక్కనపెట్టి, కూటమి కడితే బీజేపీపై ఒత్తిడి పెరుగుతుంది. అది జరిగినప్పుడే థర్డ్ ఫ్రంట్ ఆశలు సజీవంగా ఉంటాయి.

Next Story