Telugu Global
International

బ్రెజిల్ లో కోవాక్సిన్ కుంభకోణం..

భారత్ బయోటెక్ తయారీ కోవాక్సిన్ టీకా.. బ్రెజిల్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోవాక్సిన్ కు ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అనుమతి లేదు. దీంతో ఆ వ్యాక్సిన్ వాడకాన్ని అమెరికా, బ్రిటన్ సహా పలు ఇతర దేశాలు ఇంకా మొదలు పెట్టలేదు. అయితే బ్రెజిల్ ప్రభుత్వం మాత్రం కోవాక్సిన్ కోసం హడావిడిగా ముందుకొచ్చింది. ఏకంగా 2కోట్ల డోసుల కోవాక్సిన్ టీకాల సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకుంది. టీకా సాంకేతిక సరఫరా ద్వారా దీన్ని బ్రెజిల్ లో పంపిణీ చేయాలనుకున్నారు. […]

బ్రెజిల్ లో కోవాక్సిన్ కుంభకోణం..
X

భారత్ బయోటెక్ తయారీ కోవాక్సిన్ టీకా.. బ్రెజిల్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోవాక్సిన్ కు ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అనుమతి లేదు. దీంతో ఆ వ్యాక్సిన్ వాడకాన్ని అమెరికా, బ్రిటన్ సహా పలు ఇతర దేశాలు ఇంకా మొదలు పెట్టలేదు. అయితే బ్రెజిల్ ప్రభుత్వం మాత్రం కోవాక్సిన్ కోసం హడావిడిగా ముందుకొచ్చింది. ఏకంగా 2కోట్ల డోసుల కోవాక్సిన్ టీకాల సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకుంది. టీకా సాంకేతిక సరఫరా ద్వారా దీన్ని బ్రెజిల్ లో పంపిణీ చేయాలనుకున్నారు. దీనికోసం ఏకంగా 300 మిలియన్‌ డాలర్లు (రూ. 2,230 కోట్లు) చెల్లించేలా బ్రెజిల్‌ ఆరోగ్యశాఖ, భారత్ బయోటెక్ తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో బ్రెజిల్‌ కు చెందిన ప్రెసిసా అనే కంపెనీ మధ్యవర్తిగా వ్యవహరించింది. ఈ ఒప్పందంలో ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 743 కోట్లు) చేతులు మారాయనేది ప్రధాన ఆరోపణ. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారోపై ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. ఇది ఓ పెద్ద కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. అవినీతి విచారణకోసం పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వరీ వేశారు. దీంతో బ్రెజిల్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి.

కోవిడ్ ని తొలిదశలో నిర్లక్ష్యం చేసిన దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి. దీనికి పర్యవసానంగా అక్కడ భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. తొలిదశలో కోవిడ్ నిర్వహణలో విఫలమయ్యారని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు టీకా వ్యహారంలో ఆయన మరింత అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్ ని కాదని మరీ.. భారత్ కి చెందిన కోవాక్సిన్ కోసం బ్రెజిల్ అధ్యక్షుడు తాపత్రయ పడటం టీకా వ్యవహారంలో చెలరేగిన విమర్శలకు మరింత బలం చేకూర్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు, బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ (అన్విసా) కూడా ఇంకా కోవాక్సిన్ అత్యవసర అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈలోగా టీకా కోసం డబ్బులు చేతులు మారడం అనుమానాలకు తావిస్తోంది.

విచిత్రం ఏంటంటే.. 2020 నవంబరులో కోవాక్సిన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నా ఇంతవరకు ఒక్క టీకా కూడా అక్కడ వినియోగంలోకి రాలేదు. మూడోదశ క్లినికల్ పరీక్షలకు అనుమతి లభించకపోవడంతో కోవాక్సిన్ సరఫరా చేస్తామని బ్రెజిల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రెసిసా కంపెనీ వెనక్కు తగ్గింది. టీకాలు సరఫరా చేయడానికి మరింత సమయం కోరింది. దీంతో ప్రజలంతా అసహనంతో రగిలిపోతున్నారు. లైఫ్, బ్రెడ్, వ్యాక్సిన్, ఎడ్యుకేషన్ కావాలంటూ రోడ్లెక్కారు.

పార్లమెంటరీ కమిటీ ఎంక్వయిరీలో అనేక అంశాలు బయటపడుతున్నాయి. కోవాక్సిన్ దిగుమతికి పూచీ ఇవ్వాల్సిందిగా తమపై అసాధారణ ఒత్తిడి వచ్చిందని బ్రెజిల్‌ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మధ్యవర్తిత్వం నెరపిన ప్రెసిసా అనే సంస్థపై కూడా విచారణ కొనసాగుతోంది. బ్రెజిల్ మీడియా అంతా ఇప్పుడు ఈ వార్తలకే ప్రాముఖ్యతనిస్తోంది. కోవాక్సిన్ కుంభకోణం అనే పేరు రావడంతో.. ఇటు భారత్ బయోటెక్ కూడా ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

First Published:  22 Jun 2021 8:15 PM GMT
Next Story