Telugu Global
NEWS

కేసీఆర్ హడావిడి.. టార్గెట్ హుజూరాబాదేనా..?

చాన్నాళ్ల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ జనంలోకి రావడం మొదలు పెట్టారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మంత్రులు లేకుండానే నెలల తరబడి పాలన చేసిన ఆయన అప్పట్లో మారిన మనిషిలా కనిపించారు. ఆ టైమ్ లోనే కేసీఆర్ నియంతృత్వ పోకడలపై బహిరంగంగా విమర్శలు వినిపించాయి. దుబ్బాక ఉప ఎన్నికల పరాజయం వరకు కేసీఆర్ ఎవర్నీ లెక్కచేయలేదు. అధికారులైనా, మంత్రులైనా, ఉద్యోగ సంఘాలయినా ఎవర్నీ లక్ష్యపెట్టేవారు కాదు. కానీ దుబ్బాకలో ప్రజల తిరుగుబాటు చూసి డంగైపోయిన కేసీఆర్.. […]

కేసీఆర్ హడావిడి.. టార్గెట్ హుజూరాబాదేనా..?
X

చాన్నాళ్ల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ జనంలోకి రావడం మొదలు పెట్టారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మంత్రులు లేకుండానే నెలల తరబడి పాలన చేసిన ఆయన అప్పట్లో మారిన మనిషిలా కనిపించారు. ఆ టైమ్ లోనే కేసీఆర్ నియంతృత్వ పోకడలపై బహిరంగంగా విమర్శలు వినిపించాయి. దుబ్బాక ఉప ఎన్నికల పరాజయం వరకు కేసీఆర్ ఎవర్నీ లెక్కచేయలేదు. అధికారులైనా, మంత్రులైనా, ఉద్యోగ సంఘాలయినా ఎవర్నీ లక్ష్యపెట్టేవారు కాదు. కానీ దుబ్బాకలో ప్రజల తిరుగుబాటు చూసి డంగైపోయిన కేసీఆర్.. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం సహా.. సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ తిరిగి లైన్లో పెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పరువు నిలుపుకున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల రూపంలో కేసీఆర్ కి మరో సమస్య ఎదురైంది. దీంతో రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు కేసీఆర్. ఈటల బహిష్కరణ తర్వాత కరోనా కష్టకాలంలో ఆస్పత్రుల్ని సందర్శించి తన గేమ్ ప్లాన్ అమలులో పెట్టారు కేసీఆర్.

దుబ్బాక తప్పుల్ని సరిదిద్దుకుంటున్న కేసీఆర్..
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ లో అతి విశ్వాసం కనిపించింది. అంతేకాదు.. సరిగ్గా ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గ పరిధిలోని గ్రామానికి రూ.25లక్షలు, మండలానికి రూ.50లక్షలు, దుబ్బాక టౌన్ కి పాతిక కోట్లు అంటూ ఆఫర్లిచ్చేశారు కేసీఆర్. ఎన్నికలప్పుడు మాత్రమే జనాల్ని పట్టించుకుంటారనే ఓ నెగెటివ్ ప్రచారానికి పరోక్షంగా కారణం అయ్యారు. ఇప్పుడు హుజూరాబాద్ విషయంలో ఆ తప్పు చేయడంలేదు. మొత్తం రాష్ట్రమంతా వరాల జల్లు కురిపిస్తున్నారు. కొవిడ్ తదనంతర పరిస్థితుల పర్యవేక్షణ నెపంతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు కేసీఆర్. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్లు, ఇతర భవనాలు ప్రారంభిస్తున్నారు. వరంగల్ ని మెడికల్ హబ్ గా మార్చేస్తామంటున్నారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో 10వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ఉప సంఘం ఏర్పాటు చేశారు. యాదాద్రిపై మళ్లీ దృష్టి పెట్టారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ దాదాపుగా రాష్ట్రమంతా ఓ పాజిటివ్ మూడ్ తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. నేరుగా హుజూరాబాద్ పై కాన్సన్ట్రేషన్ పెడితే, ఎన్నికలప్పుడే ప్రభుత్వానికి అభివృద్ధి గుర్తొస్తుందనే అపవాదు వస్తుంది. అందుకే తెలివిగా ఆయన రాష్ట్రంలో కలియదిరుగుతున్నారు. ఎన్నికలనాటికి తన ఫోకస్ అంతా హుజూరాబాద్ కి మళ్లిస్తారు. ఈటల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఆయనపై ఎప్పుడూ కేసీఆర్ విమర్శలు సంధించలేదు. బీసీ మంత్రులతోనే ఘాటుగా బదులిప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని బీసీ సామాజిక వర్గాలన్నిటినీ టీఆర్ఎస్ వైపు నిలుపుకునేలా ప్రయత్నిస్తున్నారు. కరోనా కాలంలో ప్రభుత్వంపై పెరిగిన సహజ వ్యతిరేకతను తగ్గించుకునేందుకే లాక్ డౌన్ నిబంధనల్ని ఇతర రాష్ట్రాలకంటే ముందుగానే సడలించారు కేసీఆర్. మొత్తమ్మీద హుజూరాబాద్ పేరెత్తకుండానే.. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ తీసుకొచ్చారు తెలంగాణ సీఎం.

First Published:  21 Jun 2021 8:56 PM GMT
Next Story